ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరుగలేదు
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్
కరీంనగర్/హుజూరాబాద్ టౌన్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) : హుజూరాబాద్ ఉప ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా, స్వేచ్ఛగా జరిగాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ స్పష్టం చేశారు. శనివారం ఉప ఎన్నిక జరుగుతున్న హుజూరాబాద్ పట్టణం, కమలాపూర్ మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా హుజూరాబాద్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలోని 306 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన కొవిడ్ నిబంధనల ప్రకారం ఓటింగ్ ప్రారంభమైందని తెలిపారు. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినా భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ కంపెనీకి చెందిన టెక్నికల్ బృందం వాటిని పరిష్కరించిందని తెలిపారు. నియోజకవర్గంలో ఈ కంపెనీకి చెందిన ఆరుగురు ఇంజినీర్లు అందుబాటులో ఉన్నారని, అన్ని పోలింగ్ కేంద్రాల్లో హెల్ప్ డెస్లు, హెల్త్ డెస్లు ఏర్పాటు చేశామని, మాసులు లేకుండా వచ్చే ఓటర్లకు వాటిని అందించినట్లు చెప్పారు. ఓటర్లు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 2018లో ఈ నియోజకవర్గంలో 84.04 శాతం ఓటింగ్ జరిగిందని, ఇప్పుడు అంతకంటే ఎక్కువ జరుగుతుందని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకే 45 శాతం ఓటింగ్ జరుగడం ఇందుకు నిదర్శనమన్నారు. ఓటర్లందరూ తమ ఓటు హకును స్వేచ్ఛగా వినియోగించుకున్నారని తెలిపారు. ఇప్పటి వరకు రూ.3.50 కోట్ల నగదు, 1,075 లీటర్ల మద్యం సీజ్ చేశామని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు పెడుతున్నామని తెలిపారు. అనంతరం జమ్మికుంటలోని పోలింగ్ కేంద్రాలను శశాంక్ గోయల్ పరిశీలించారు. కేంద్రంలో సౌకర్యాలను పరిశీలించి జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. ఆయన వెంట సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి రవి కిరణ్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ఉన్నారు.