దవాఖానలకు వచ్చే రోగులే లేరు
మందులతోనే సరి
కొవిడ్‌పై ప్రజల్లో పెరిగిన అవగాహన
తగ్గుతున్న వైరస్ భయం
సత్ఫలితాలిస్తున్న జ్వర సర్వే
ఐసొలేషన్ కిట్స్‌తో ఇంట్లోనే వైద్యం
ఓపీతోనే సరిపెట్టుకుంటున్న రోగులు
కరీంనగర్, జనవరి 30 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్ : కరోనా మూడో దశ విస్తరిస్తున్నా మొదటి, రెండు వేవ్‌లా జనాల్లో అంతగా హైరానా కనిపించడం లేదు. పాజిటివ్ వచ్చిన వారంతా హోం ఐసొలేషన్‌లోనే చికిత్స పొందుతూ క్షేమంగా బయటపడుతున్నారు. ప్రజల్లో అవగాహన పెరుగడంతో కొవిడ్‌పై భయం తగ్గిపోయింది. మరోవైపు రాష్ట్ర సర్కారు చేపట్టిన జ్వర సర్వే సత్ఫలితాలనిస్తున్నది. వ్యాధి వచ్చిన వారు ప్రభుత్వ దవాఖానల్లో రెండంకెల్లోపు మాత్రమే చేరుతుండగా, ప్రైవేట్ దవాఖానలకు వెళ్లే వారే కనిపించడం లేదు. వ్యాక్సినేషన్ పూర్తి కావడం,ఒమిక్రాన్ వంటి వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు అత్యధికుల్లో రోగ నిరోధక శక్తి పెరగడమే ఇందుకు కారణంగా వైద్యులు వివరిస్తున్నారు.
గత రెండు దశల్లో కరోనా అంటే జనం తీవ్రమైన భయానికి గురయ్యారు. గతేడాది ఏప్రిల్‌లో ప్రభుత్వ దవాఖానలోనే కాదు.. ప్రైవేట్ దవాఖానల్లోనూ బెడ్స్ దొరుకడం కష్టంగా ఉండేది. ప్రముఖ ప్రైవేట్ దవాఖానల్లో లక్షలు ఖర్చుచేసి చికిత్స పొందిన వారు ఎందరో ఉన్నారు. అప్పుడు ప్రాణభయం అంతలా ఉండేది. ప్రభుత్వ దవాఖానల్లో చేరే ప్రతి నలుగురిలో ముగ్గురు వెంటిలేటర్ మీదనో, ఆక్సిజన్‌తోనే చికిత్స పొందాల్సిన పరిస్థితి ఉండేది. వైరస్ బారిన పడిన వారు రోజుల తరబడి చికిత్స పొందితేగానీ ఇంటికి వెళ్లే పరిస్థితి ఉండేది కాదు. అంతే కాకుండా రెండో వేవ్‌లో మరణాలు కూడా ఎక్కువే సంభవించాయి. ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు మృత్యువాత పడ్డ సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడ చూసినా కరోనా భయంతో జనం హడలి పోయారు. కరోనా సోకిందంటే లక్షలు చేతిలో పట్టుకుని చికిత్సకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. డబ్బులు లేక ఆస్తులు అమ్ముకుని వైద్యం చేయించుకున్నా ప్రాణాలు దక్కని వాళ్లు ఎందరో.. ప్రాణాలు దక్కినా అప్పులు మిగిలిన వారు మరెందరో ఇప్పటికీ కనిపిస్తుంటారు. ఆ దశలో అనేక కుటుంబాలను కరోనా అతలాకుతలం చేసింది. ప్రభుత్వం దూరదృష్టితో తీసుకున్న చర్యల కారణంగా ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
ప్రభావం చూపని మూడో దశ
మొదటి రెండు దశల్లో ప్రభావం చూపిన కరోనా వైరస్ మూడో దశలో అంతగా ప్రభావం చూపడం లేదు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేనని వైద్యాధికారులు చెబుతున్నారు. గతేడాది ఏప్రిల్ నుంచి మూడు నాలుగు నెలల పాటు దవాఖానల్లో బెడ్స్ దొరుకని స్థితి నుంచి ఇప్పుడు హోం ఐసొలేషన్తోనే సరిపెట్టుకునే పరిస్థితికి వచ్చింది. వైరస్ తీవ్రత తగ్గిందా? అంటే రోజుకు పదుల సంఖ్యలో కేసులు వస్తూనే ఉన్నాయి. కానీ, 95 శాతం మందికి హోం ఐసొలేషన్‌లోనే పూర్తి చికిత్స అందుతోంది. వైరస్ సోకిన వారు ఏడు రోజుల పాటు హోం ఐసొలేషన్‌లో చికిత్స పొంది మామూలు స్థితికి చేరుకుంటున్నారు. దవాఖానల్లో ఉండి చికిత్స పొందాల్సిన పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. వైరస్ సోకిన కొందరు ఓపీకి వచ్చి పరీక్షలు చేయించుకుని, మందులు తీసుకుని ఇంటికి వెళ్లి చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో చికిత్స పొందుతున్న వారికి ఆక్సిజన్, వెంటిలేటర్లతో పని లేకుండా మామూలు చికిత్సనే అందిస్తున్నామని ప్రభుత్వ వైద్యులు చెబుతున్నారు. ఇక గతేడాది కరోనా రోగులతో కిటకిటలాడిన ప్రైవేట్ దవాఖానలకు వెళ్లేవారే కరువయ్యారు.
ప్రభుత్వ చర్యలే ప్రధాన కారణం
కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలే కారణమని ప్రభుత్వ వైద్యులు చెబుతున్నారు. ఒక పక్క మూడో దశ వైరస్ విజృంభిస్తున్నా దవాఖానలకు వచ్చే వారి సంఖ్య తగ్గిపోయింది. ఈ దశ విజృంభిస్తున్న తీరు చూస్తే ఇప్పటికే దవాఖానలు కిటకిటలాడాల్సింది. కానీ హోం ఐసొలేషన్‌లోనే చికిత్స పూర్తి చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. వ్యాక్సినేషన్ విజయవంతంగా పూర్తి చేయడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే టీకాలు పూర్తి స్థాయిలో తీసుకోవడం వల్లే ప్రజల్లో రోగ నిరోధక శక్తి పెరిగి ఎలాంటి వైరస్‌నైనా తట్టుకునే పరిస్థితికి వచ్చారని వైద్యులు చెబుతున్నారు. 15 నుంచి 18 ఏండ్లలోపు పిల్లలకు కూడా టీకాలు వేస్తున్నారు. అంతే కాకుండా బూస్టర్ డోసు టీకాలు కూడా శరవేగంగా వేస్తున్నారు. ఈ కారణంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక డోసులో వ్యాక్సిన్ తీసుకుని ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఫలితంగానే వైరస్ సోకినా దాని తీవ్రత అంతగా లేదనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. అలాగే, ప్రస్తుతం సోకుతున్న వైరస్ ముక్కు, గొంతు వరకే పరిమితం అవుతున్నదని, ఊపిరితిత్తుల్లోకి వెళ్లడం లేదని, ప్రజలు భయపడాల్సిన పనిలేదని వైద్యులు చెబుతున్నారు.
ఫీవర్ సర్వేతో స్థానికంగానే చికిత్స..
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి జ్వర సర్వే మంచి ఫలితాలు ఇస్తోంది. జ్వరాలు వచ్చిన వారిని స్థానికంగానే గుర్తించి ప్రభుత్వం ఇచ్చిన కిట్లు అందిస్తున్నాం. దీంతో వారికి అక్కడే చికిత్స అందుతోంది. ఇప్పుడు హోం ఐసొలేషన్ ఏడు మాత్రమే ఇస్తున్నాం. ప్రతి ఇంటికి ఆరోగ్య కార్యకర్తలు వెళ్లి జ్వరాలు వచ్చిన వారిని, కొవిడ్ లక్షణాలు ఉన్న వారిని ముందే గుర్తిస్తున్నారు. ఫలితంగా వారు దవాఖానలకు వెళ్లాల్సిన పరిస్థితి రావడం లేదు.