రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్
తాతాలిక ఉత్సవ కమిటీ ఏర్పాటు
కమాన్‌చౌరస్తా, జనవరి 30: జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్డులో గల వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఫిబ్రవరి 4వ తేదీ నుంచి నిర్వహించే పంచమ బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉత్సవాల ప్రధాన నిర్వాహకుడు, రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు చకిలం శ్రీనివాస్, చకిలం గంగాధర్, ఈవో పీచర కిషన్‌రావుతో కలిసి ఆలయంలో ఏర్పాట్లను పరిశీలించారు. పంచమ వార్షిక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతికి చెందిన వేద బ్రాహ్మణుల ఆధ్వర్యంలో కరోనా నిబంధనలు పాటిస్తూ, ఘనంగా నిర్వహిస్తామని పునరుద్ఘాటించారు. ఈసారి తిరుపతి వేదబ్రాహ్మణోత్తముల సూచన మేరకు తెలంగాణ అమరవీరుల స్థూపం వరకు వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అంతే కాకుండా బ్రహ్మోత్సవాల వేళ విద్యుత్ అంతరాయం లాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్ అధికారులకు ప్రత్యేక సూచనలు జారీ చేశారు. బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు 20 మందితో బ్రహ్మోత్సవ కమిటీని ప్రకటించారు. ఆలయ ప్రధాన వేదిక, స్వాగత తోరణాల కటౌట్లు, భక్తులకు సౌకర్యాలు, అధ్యయనోత్సవాల వివరాలు, వైదిక కార్యక్రమాలు, వాహన అలంకరణలు, ప్రసాదాల వితరణ, కొవిడ్ నియంత్రణ చర్యలు వంటి అంశాలపై చర్చించారు. వివిధ దేవతా మూర్తులతో కూడిన స్వాగత తోరణాలు సిద్ధమవుతున్నాయని, ఆలయానికి రంగులు వేసి అలంకరిస్తున్నారని చెప్పారు. గతంలో నిర్వహించిన శోభాయాత్రలో ఒక గజ వాహనాన్ని ఏర్పాటు చేశామని, ఈసారి శోభాయాత్రలో 2 గజ వాహనాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాల నిర్వహణపై తిరుపతి పండితుల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
ఉత్సవ కమిటీ సభ్యులు వీరే..
పంచమ బ్రహ్మోత్సవాల సందర్భంగా మంత్రి ఆధ్వర్యంలో ప్రత్యేక ఉత్సవ కమిటీని ప్రకటించారు. ఇందులో గంప రమేశ్ , గోగుల ప్రసాద్, తిప్పబత్తిని రవీందర్, కంసాల దేవత, కే రవికుమార్, జీ సంతోష్‌కుమార్, పూదరి తిరుపతి, బండారి వనిత, కుల్ల లత, పాత రాహుల్ నారాయణ, డోలి ఉపేంద్రనాథ్, కన్నం శ్రీనివాస్, కస్తూరి శ్రీనివాస్ వరప్రసాద్, పబ్బతి శ్రీనివాస్ రెడ్డి, రామిడి శ్రీధర్, గౌరిశెట్టి భూపతి, బూర్ల విద్యాసాగర్, వాస్తు రామన్న, తోటపల్లి సుభాష్, చిట్టుమల్ల ప్రశాంత్ కుమార్ ఉన్నారు.