ప్రారంభమైన ఆత్మీయ భవనం పనులు
నాలుగు నెలల్లోగా పూర్తికి చర్యలు
సకల సౌకర్యాలతో నిర్మాణం
హుజూరాబాద్, జనవరి 30: రెడ్డి కులస్తుల దశాబ్దాల కల త్వరలో నెరవేరనున్నది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఆత్మీయ భవనం త్వరలో పూర్తి కానున్నది. పట్టణ పరిధిలోని కేసీ క్యాంపులో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఎకరం స్థలం కేటాయించింది. అలాగే, భవన నిర్మాణానికి రూ. కోటి మంజూరు చేసింది. ఈ మేరకు పదిహేను రోజుల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. నాలుగు నెలల్లో పూర్తి కానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఆత్మీయ భవనానికి స్థలం కావాలని గత పాలకులకు రెడ్డి కులస్తులు విన్నవించినా పట్టించుకోకపోగా… నోటితో నవ్వి నోసలుతో వెక్కిరించే విధంగా వ్యవహరించారని వారు పేర్కొన్నారు.
సకల సౌకర్యాలతో నిర్మాణం
చిన్న చిన్న సమావేశాలు, ఇతరాత్ర అవసరాల కోసం డివిజన్లో రెడ్డి కులస్తులకు ఇప్పటి వరకు ఒక్క కమ్యూనిటీ హాల్ కూడా లేదు. ఎన్నో ఏళ్లుగా చూస్తున్న ఆత్మీయ భవనం పనులు ప్రారంభం కావడంతో రెడ్డి కులస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భవనాన్ని సకల సౌకర్యాలతో నిర్మించనున్నారు. ముఖ్యంగా ఇది పేద రెడ్డి కులస్తులకు ఎంతో ఉపయోగపడనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు కల్యాణ మండపాల్లో పెద్ద ఎత్తున ఖర్చు అవుతున్నది. ఆత్మీయ భవనం పూర్తయితే పేద రెడ్డి కులస్తులకు ఆర్థిక భారం తప్పనుంది. 30 గుంటల స్థలంలో భవనం నిర్మిస్తున్నారు. మరో పది గుంటలు పార్కింగ్‌కు కేటాయించనున్నారు. సమావేశ మందిరం, డైనింగ్ హాల్ వేర్వేరుగా నిర్మించనున్నారు. కాగా, అధికారులు పనులు త్వరగా చేపడుతున్నారు.
సీఎం కేసీఆర్‌కు రుణ పడి ఉంటం
ఇన్ని రోజులు ఆత్మీయ భవనం లేక మీటింగులు పెట్టుకోవాలంటే ఇబ్బందులు ఎదుర్కొన్నాం. రెడ్డి కులస్తుల గురించి గత పాలకులు ఏనాడు పట్టించుకోలేదు. స్వరాష్ట్రంలో స్థలం కేటాయించి, నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు, తెలంగాణ ప్రభుత్వానికి రుణ పడి ఉంటాం. భవనం త్వరగా పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. -ఎడవెల్లి కొండల్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్
పేదలకు ఎంతో ఉపయోగపడుతుంది
డివిజన్లో రెడ్డిలకు ఇప్పటి వరకు ఒక్క కమ్యూనిటీ భవనం కూడా లేదు. ఆత్మీయ భవనం పూర్తయితే రెడ్డి కులస్తుల్లోని పేదలకు ఎంతో ఉపయోగపడుతుంది. పెండ్లి, ఇతర శుభకార్యాలు చేసుకోవచ్చు. ఆత్మీయ భవనానికి స్థలం, నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, ఇందుకు కృషి చేసిన మంత్రి హరీశ్‌రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు.
–చొల్లేటి కిషన్‌రెడ్డి, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు