ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం
ఎమ్మెల్యే సుంకె రవి శంకర్
చొప్పదండి, జనవరి 30 : దేశమంతా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలకు జై కొడుతుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేస్తున్నారని, తమ ఉనికి కోసం ముఖ్యమంత్రిపై చేస్తున్న విమర్శలు మానుకోవాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హెచ్చరించారు. చొప్పదండిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటే మతిస్థిమితం కోల్పోయిన బీజేపీ నాయకులకు పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారన్నారు. నోరు ఉంది కదా? అని ఏదిపడితే అది మాట్లాడితే ఊరుకునే సమస్యేలేదని, మరోమారు కేసీఆర్‌ను విమర్శిస్తే నాలుక చీరేస్తాం అని ఆయన హెచ్చరించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఏడేళ్లు గడుస్తున్నా రాష్ర్టానికి చేసిందేమీలేదని ఆయన ఆరోపించారు. యాసంగిలో ఏరకమైన రైస్ పండిస్తారో కూడా తెలియని దద్దమ్మలు యాసంగిలో రా రైస్ కొంటామని చెప్పడం వారి తెలివి తక్కువతనానికి నిదర్శనమన్నారు. ఎడారిగా మారిన తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కాళేశ్వరం ప్రాజెక్ట్ నీటితో కళకళలాడేలా చేశారన్నారు. ప్రతి ఎకరాకూ నీరందిస్తున్న ప్రాజెక్ట్‌లను ఎందుకు కట్టారని మాట్లాడడంపై బండిసంజయ్‌కు రైతాంగంపై ఎంత ప్రేమ ఉన్నదో అర్థం చేసుకోవాలన్నారు.
తెలంగాణ ప్రాంతాన్ని సస్యశామలం గా మార్చిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయహోదా వచ్చేలా చేయడం చేతకాని బండిసంజయ్‌కు కేసీఆర్‌ను విమర్శించే నైతికహక్కు లేదని పేర్కొన్నారు. దేశమంతా కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకుని సంక్షేమ పథకాలు అమలు చేయాలని చూస్తుంటే రాష్ట్ర పథకాలను విమర్శిస్తున్న బండిసంజయ్‌ను పిచ్చి హాస్పిటల్లో చేర్పించాలన్నా రు. రైతు సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న ప్ర భుత్వం మాదని, రైతు వ్యతిరేక చట్టాలు అమలు చేస్తూ రైతులకు వ్యతిరేకంగా సాగుతున్న ప్రభు త్వం కేంద్రమని అన్నారు. తెలంగాణ ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని ఇకపై మీ ఆటలు సాగవని, సరైన సమయంలో సరైన నిర్ణయం ద్వారా మీకు గుణపాఠం చెబుతారన్నారు. ఇకనైనా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాల అమలులో భాగస్వాములై రాష్ర్టాభివృద్ధిలో పాలుపంచుకోవాలని, మరోసారి కేసీఆర్‌ను విమర్శిస్తే ప్రజలే సరైన బుద్ధిచెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లాగ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మెన్ ఆరెల్లి చంద్రశేఖర్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ మినుపాల తిరుపతి రావు, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు గడ్డం చుక్కారెడ్డి, మచ్చ రమేశ్, నాయకులు బందారపు అజయ్‌కుమార్ గౌడ్, గన్ను శ్రీనివాస్‌రెడ్డి, సీపెల్లి గంగయ్య తదితరులు పాల్గొన్నారు.