గొల్లపల్లి, జనవరి 30 : రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఎస్సీఈఆర్టీ ప్రచురించిన ఫోర్ రన్నర్స్ పుస్తకంలో గొల్లపల్లి మండలంలోని దట్నూర్ ఎంపీయూపీఎస్పై హరితహారం విభాగంలో ‘అవర్ స్కూల్ ఈజ్ అవర్ సెకండ్ హోమ్’ సక్సెస్ ఫుల్ స్టోరీ ప్రచురితమైంది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఫోర్ రన్నర్స్ పుస్తకానికి హరితహారం విభాగంలో ఆరు పాఠశాలలకు అవకాశం దక్కగా అందులో జగిత్యాల జిల్లా నుంచి గొల్లపల్లి మండలంలోని దట్నూరు ఎంపీయూపీఎస్ ఉండడం విశేషం. దట్నూర్ పాఠశాలలో పూలమొక్కలు, పండ్ల మొక్కలు, విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి అవసరమైన కూరగాయలను సేంద్రియ పద్ధతిలో సాగు చేసినందుకు గానూ ఫోర్ రన్నర్స్ పుస్తకంలో చోటుదక్కింది. పాఠశాల ఉపాధ్యాయుడు జూపాక సుదర్శన్‌కు జగిత్యాల జిల్లా విద్యాధికారి కార్యాలయంలో పీఆర్టీయూటీఎస్ జిల్లా అధ్యక్షుడు యాళ్ల అమర్నాథ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బోయినపెల్లి ఆనంద రావు ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారి జగన్మోహన రెడ్డికి ఆదివారం ఫోర్ రన్నర్స్ పుస్తకాన్ని అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ, దట్నూరు పాఠశాల ఉపాధ్యాయుడు జూపాక సుదర్శన్ ‘తెలంగాణకు హరితహారం’లో తన సొంత ఖర్చులతో పండ్లు, పూల మొక్కలను పెంచడంతో పాటు విద్యార్థుల మధ్యాహ్న భోజనానికి సేంద్రియ పద్ధతిలో కూరగాయలను సాగు చేసినందుకు గానూ పాఠశాల సక్సెస్ స్టోరీ ఫోర్ రన్నర్స్ పుస్తకంలో ప్రచురితమైందన్నారు. హరితహారంలో భాగంగా వివిధ రకాల 1,250 మొక్కలను నాటి వాటి సంరక్షణకు తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేయడం అభినందనీయమని జూపాక సుదర్శన్‌ను అభినందించారు. కార్యక్రమంలో సమగ్ర శిక్షా కోఆర్డినేటర్ సెక్టోరల్ ఆఫీసర్ ఎస్ బాల కిషన్, పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర నాయకులు ఏవీఎన్ రాజు, నందిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గొల్లపల్లి మండలాధ్యక్షుడు బొంగోని మల్లేశం గౌడ్, ప్రధాన కార్యదర్శి ముదులాకర్, ఉమేశ్, అసోసియేట్ అధ్యక్షుడు రాయి శ్రీనివాస్, ఎంఈవో గాయత్రి, ప్రధానోపాధ్యాయుడు కొక్కుల రాజేశ్, జిల్లా నాయకుడు మచ్చ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.