మంత్రి కేటీఆర్ చొరవతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముందుకొస్తున్న సంస్థలు, దాతలు
సీఎస్సార్ చేయూత.. వందలాది అదనపు తరగతి గదుల నిర్మాణం
ఎర్త్ ఫౌండేషన్ ఆలంబన.. పిల్లలకు యూనిఫాంలు అందజేత
మారి సంస్థ గొప్ప మనసు.. హ్యాండ్‌వాష్ స్టేషన్ల ఏర్పాటు
ఇంగ్లిష్ మీడియంలో రాణించేలా అర్కమిత్ర ప్రోత్సాహం
రాజన్న సిరిసిల్ల, జనవరి 30 (నమస్తే తెలంగాణ): సర్కారు బడి బలోపేతమవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చర్యలు.. మంత్రి కేటీఆర్ చొరవ, పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో చక్కబడుతున్నది. ఓ వైపు సీఎస్సార్ నిధులు, మరోవైపు సంస్థలు, దాతల ఆర్థిక చేయూతతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని విద్యాలయాల్లో సకల వసతులతో కూడిన విద్య అందుతున్నది. మారి సంస్థ ఆధ్వర్యంలో స్కూళ్లలో హ్యాండ్‌వాష్ స్టేషన్లు ఏర్పాటవుతుండగా, ఎర్త్ ఫౌండేషన్ యూనిఫాంలు, టైలు అందిస్తున్నది. ఇంకా పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో రాణించేలా అర్మమిత్ర ప్రోత్సహిస్తుండడం, విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీస్తూ, క్రీడల్లో రాణించేలా వివిధ సంస్థలు చేస్తున్న కృషిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
బడుల బలోపేతానికి సర్కారు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. మంత్రి కేటీఆర్ చొరవ, సహకారం అందించేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. ఓ వైపు సీఎస్సార్ నిధులు, మరోవైపు స్వచ్ఛంద సంస్థల ఆర్థిక చేయూతతో సర్కారు బడుల రూపురేఖలు మారిపోతున్నాయి. పేద విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు తమవంతుగా వైద్యులు సైతం భూరి విరాళాలతో ప్రోత్సహిస్తున్నారు. కార్పొరేట్‌కు దీటుగా ఆధునిక హంగులతో భవనాలు, టాయిలెట్లు, హైండ్వాష్ స్టేషన్లు నిర్మిస్తున్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీస్తూ, క్రీడల్లో రాణించేలా వివిధ సంస్థలు చేస్తున్న కృషిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
మంత్రి కేటీఆర్ చొరవతో ముందుకొస్తున్న సంస్థలు..
సమైక్యపాలనలో విద్యావ్యవస్థ కుంటు పడిపోయింది. ఈ పరిస్థితిలో సర్కారు బడులలో విద్యార్థుల సంఖ్య ఘననీయంగా తగ్గింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలతో విద్యావ్యవస్థకు మంచి రోజులొచ్చాయి. బడుల బలోపేతానికి ప్రత్యేక నిధులు కేటాయించి అనేక వసతులు కల్పించి పూర్వవైభవం తెచ్చారు. ఈ క్రమంలో బడుల బలోపేతానికి ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు తమ సహకారాన్ని అందిస్తూ సర్కారుకు అండగా నిలుస్తున్నాయి. పేద విద్యార్థులకు చేయూత నిచ్చి, వారిని అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహిస్తున్నాయి. మంత్రి కేటీఆర్ చొరవతో పలు స్వచ్ఛంద సంస్థలు ఆర్థిక సహకారాన్ని అందించేందుకు ముందుకొస్తున్నాయి. స్వచ్ఛంద సంస్థలే కాకుండా ప్రైవేట్, ప్రభుత్వ వైద్యులు, ప్రజాప్రతినిధుల పేద పిల్లల చదువులకు తమ చేయూతనిస్తూ బూరి విరాళాలు అందిస్తున్నారు. అర్కమిత్ర, గివ్తెలంగాణ, ఎర్త్, భారతీఫౌండేషన్, వికెన్ మేక్ చేంజ్ లాంటి స్వచ్ఛంద సంస్థలు జిల్లాలోని పాఠశాలలను దత్తత తీసుకుని ఆధునాతన హంగులతో మౌళిక వసతులు కల్పించాయి. స్థానిక వైద్యులు వాణీ రమణారావు, శోభా పెంచలయ్య, కందేపి రాణీప్రసాదరావు జిల్లాలోని పలు పాఠశాలలకు వేలాది రూపాయలతో వివిధ సౌకర్యాలు కల్పించారు.
రూ.1.50 కోట్లతో హ్యాండ్ వాష్స్టేషన్లు..
మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మారి స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. జిల్లాలోని 18 పాఠశాలలను దత్తత తీసుకున్నది. సిరిసిల్ల, కోనరావుపేట, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, వేములవాడ మండలాల్లో 18 పాఠశాలల్లో రూ.1.50 కోట్లు ఖర్చు పెట్టి అధునాతన హ్యాండ్ వాష్ స్టేషన్లు, బాలబాలికలకు మరుగుదొడ్లు నిర్మించింది. బడులలో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ చేతులు కడిగే వారు. దీంతో ఈగలు, దోమలు వ్యాప్తి చెంది అనారోగ్యాల పాలవుతున్నారు. మారి స్వచ్ఛంద సంస్థ నిర్మించిన హ్యాండ్ వాష్ స్టేషన్లు బడులకే శోభాయమానంగా కనిపిస్తున్నాయి.
అదనపు గదులకు సీఎస్సార్ నిధులు..
సర్కారు బడులను బలోపేతం చేసి రాష్ట్రంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లాను అగ్రభాగాన నిలుపాలన్న మంత్రి కేటీఆర్ పిలుపునకు విశేష స్పందన వస్తున్నది. వివిధ సంస్థలు రూ.లక్షలు సహకారం అందిస్తుండగా, సీఎస్ఆర్ నిధులతో ఆధునిక తరగతి గదుల నిర్మాణం జరుగుతున్నది. గివ్ తెలంగాణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీలో వివిధ సంస్థల సహకారంతో జిల్లాకు 7.77 కోట్ల నిధులు తెచ్చింది. జిల్లాలోని 49 పాఠశాలల్లో 94 అదనపు తరగతి గదులను నిర్మించింది. గంభీరావుపేట మండలంలో 36లక్షలతో 4, ముస్తాబాద్ మండలంలో 1.69 కోట్లతో 22, సిరిసిల్ల అర్బన్ మండలంలో 2.64కోట్లతో 32, తంగళ్లపల్లి మండలంలో 75.25 లక్షలతో 9, వీర్నపల్లి మండలంలో 78.5లక్షలతో 10, ఎల్లారెడ్డిపేట మండలంలో 1.40 కోట్లతో 17 తరగతి గదులను నిర్మించి ఇచ్చింది.
ఆంగ్ల మాధ్యమంలో రాణించేలా.. అర్కమిత్ర ఫౌండేషన్
ప్రాథమిక విద్య నుంచే విద్యార్థులు ఆంగ్ల మాద్యమంలో నైపుణ్యం సాధించేలా అర్కమిత్ర ఫౌండేషన్ కృషి చేస్తున్నది. ఏడేళ్లుగా వివిధ జిల్లాల్లో పాఠశాలల విద్యార్థులకు తనవంతు సేలవందిస్తున్న ఈ సంస్థ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు జిల్లాలోని 6 మండలాలు 14 సర్కారు బడులను దత్తత తీసుకున్నది. పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా టై బెల్టులు, తెలుగు, ఇంగ్లిష్ కాఫీరైట్స్ వెయ్యి మందికి పంపిణీ చేసింది. ఆంగ్లంతో పాటు తెలుగులో పాండిత్యాన్ని అవపోసన పట్టేలా విద్యార్థులకు పెద్ద బాల శిక్ష పుస్తకాలను 200 మందికి అందజేసింది. ప్రతి వారంలో రెండు సార్లు పండ్లు పంపిణీ చేస్తూ ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి తంగళ్లపల్లి మండలం నేరెళ్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాంలు, బ్యాగ్‌లు అందించే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నది.