Dharmaram | ధర్మారం ,మే 17: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మరెడ్డిపల్లి గ్రామంలో అస్వస్థకు గురై గత రెండు రోజులుగా 30 గొర్రె లు మృత్యువాత పడ్డాయి. మరో 40 గొర్రెలు తీవ్ర అస్వస్థకు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్నాయని గొర్రెల పెంపకం దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొమ్ము కనకయ్య, కొమ్ము రాజేశం, రేచవేని మల్లేశం, సమ్మెడ కొమురయ్య, దాడి నాగయ్య అనే గొర్రెల పెంపకం దారులు సుమారు 500 గొర్రెలను పెంపకం చేస్తున్నారు. ఈ గొర్రెలన్నీ సామూహికంగా కలిసి గ్రామ శివారులో ప్రతిరోజు మేతకు వెళ్తూ ఉంటాయి. పెంపకం దారులు వీటిని ప్రతిరోజు గ్రామ శివారులో ఉన్న కోసిన వరి పొలాలలో మేత మేపుతున్నారు.
ఈ క్రమంలో కొమ్ము కనుకయ్య కు చెందిన మూడు గొర్రెలు, కొమ్ము రాజేష్ వి ఐదు, రేచవేని మల్లేశం వి నాలుగు, సమ్మెడ కొమురయ్యవి తొమ్మిది, దాడి నాగయ్యవి ఎనిమిది గొర్రెలతో పాటు గడ్డం కొండల్ రెడ్డి కి చెందిన ఒక గొర్రె అస్వస్థకు గురై మరణించింది. గత రెండు రోజులుగా 30 గొర్రెలు అస్వస్థతకు గురై మరణించినట్లు గొర్రెల పెంపకం దారులు తెలిపారు. వీటికి తోడు మందలోని మరో 40 గొర్రెలు తీవ్ర అస్వస్థత గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్నాయని పెంపకం దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మూగ జీవాలు విషఆహారం తినడం వల్ల మరణించాయా …? లేక మరేదైనా కారణం ఉందా..? అనే విషయం తెలియక పెంపకం దారులు అయోమయానికి గురవుతున్నారు.
కాగా ఇప్పటివరకు మరణించిన మూగజీవాల వల్ల రూ.3 నుంచి మూడున్నర లక్షల వరదాక నష్టం వాటిల్లిందని పెంపకం దారులు ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన మూగజీవాలకు నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వం తమను ఆదుకోవాలని పెంపకం దారులు విజ్ఞప్తి చేశారు. కాగా మరణించిన గొర్రెల సమాచారం గురించి తెలుసుకున్న ధర్మారం వెటర్నరీ డాక్టర్ అజయ్ కుమార్ శనివారం ఆ గ్రామం వెళ్లి గొర్రెల కళేబరాలను పరిశీలించారు. గొర్రెల సామూహిక మృత్యువాతపై వెటర్నరీ డాక్టర్ ను వివరణ కోరగా పొలం గట్లపై గడ్డి నివారణ కోసం చల్లిన ఆర్గానో ఫాస్పేట్ అవశేషాలను తినడం వల్ల అస్వస్థకు గురై గొర్రెలు మరణించి ఉండవచ్చునని ప్రాథమిక అంచనా వేసినట్లు ఆయన వివరించారు. గొర్రెల మృత్యువాతపై శాఖ ఉన్నతాధికారులకు నివేదిస్తానని ఆయన వివరించారు.