సుల్తానాబాద్ శ్రీ శ్రీనివాస చేనేత సహకార సంఘం అవినీతిలో కూరుకుపోయింది. 30 లక్షల నిధుల గోల్‌మాల్‌తో పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. 175 మంది సభ్యులతో చేతినిండా పనితో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన సొసైటీ చివరి వరకూ సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన తుమ్మ జనార్దన్ అక్రమాలతో మూత పడిపోయింది. ప్రభుత్వం నుంచి నూలు, రాయితీలు రాకుండా పోగా, కార్మికుల బతుకు ఆగమైంది. వృత్తిని వదిలేసి పనిలేక చెట్టుకొకరు పుట్టకొకరుగా వెళ్లిపోవాల్సిన పరిస్థితి దాపురించింది. సమగ్ర విచారణ అనంతరం తాజా మాజీ అధ్యక్షుడి నుంచి కొంత మేర రికవరీ చేసిన యంత్రాంగం, ఇంకా పెద్ద మొత్తంలో రాబట్టాల్సి ఉండగా, ఎవరో చేసిన తప్పునకు తమకు శిక్ష వేయొద్దని, ప్రభుత్వం స్పందించి మళ్లీ సంఘాన్ని పునరుద్ధరించాలని కార్మికులు కోరుతున్నారు.
పెద్దపల్లి, జూలై 13 (నమస్తే తెలంగాణ): సుల్తానాబాద్‌లోని శ్రీ శ్రీనివాస చేనేత సహకార సంఘం 175 మంది సభ్యులతో సమైక్య రాష్ట్రంలోనే ఏర్పడింది. ఈ సంఘంలో సుల్తానాబాద్‌తోపాటు నారాయణ్‌పూర్, రేగడిమద్దికుంట, సుద్దాల, నిట్టూరు, అల్లీపూర్, గర్రెపల్లి, ఐతరాజ్పల్లి, రా మునిపల్లి, తొగర్రాయి, కనుకుల, బొంతకుంటపల్లి, ఎలిగేడు మండలం లోకపేట, కాల్వశ్రీరాంపూర్ మండలంలో ని పలు గ్రామాల చేనేత కార్మికులు ఉపాధి పొందేవారు. ఆయా గ్రామాల్లో సంఘం ఆధ్వర్యంలో చేనేత యంత్రాల ను ఏర్పాటు చేసి కార్మికుల నుంచి నేచిన బట్టలను ఆప్కోకు అందించేవారు. నిర్విరామంగా పనిదొరుకుతుండడంతో కార్మికులు మరమగ్గాలపై ఆధారపడి జీవించేవా రు. క్రమంగా ఈ ప్రాంతం ఉపాధి కేంద్రంగా మారింది. ఆప్కో నుంచి వచ్చే నూలు ఇతర ముడిసరుకుల ద్వారా ఇక్కడ షర్ట్స్ క్లాత్, లుంగీ, టవల్స్, బెడ్‌షీట్స్, మ్యాటీస్, డ్రిల్స్‌ను నేచి తిరిగి సొసైటీద్వారా ఆప్కోకు అందించేవారు.
ఈ సంఘంలో చివరి అధ్యక్షుడు, పాలకవర్గం హయాంలో 30 లక్షల వరకు అవినీతి జరిగిందని చేనేత శాఖకు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. అందులో అధ్యక్షుడే ప్రధాన సూత్రధారి అన్న ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. ప్రధానంగా 175 మంది సభ్యుల్లో 71 మంది సభ్యులను తనకు అనుకూలంగా లేరనే కారణంగా వారి సభ్యత్వాన్ని తుమ్మ జనార్దన్ తొలగించారని, సభ్యుల వాటాధనంలోని డబ్బును సభ్యులకు ఇవ్వకుండా చెల్లించినట్టుగా రికార్డుల్లో చూపారని ఆరోపణలు ఉన్నాయి. ఇంకా చేనేత సభ్యుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న త్రిఫ్ట్ డిపాజిట్ డబ్బు 2.50 లక్షలనూ ఫోర్జరీ సంతకాలతో కాజేశారని, చనిపోయిన ఇద్దరు కార్మికులకు ఎంజీబీబీవై పథకం కింద ఒక్కొక్కరికీ 20 వేల చొప్పన వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బు కాజేశారని ఆరోపణలు ఉన్నాయి.
వీటితోపాటు చేనేత భవనం మరమ్మతుల పేరిట 76 వేలు, కొత్త భవనం నిర్మాణం కోసమని చెప్పి భవనం కట్టకుండానే 2.56 లక్షలు సొంతానికి వాడుకున్నారని, కొన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసిన చేనేత యంత్రాల ద్వారా క్యాష్ క్రెడిట్‌గా 6 లక్షలు, ఐసీడీపీ సీసీ లోన్ ద్వారా 3 లక్షలు తీసుకున్నారని, రుణమాఫీ పథకం ద్వారా సంఘానికి 14 లక్షలు, రుణాల పేరిట 9 లక్షలు వచ్చినా సభ్యులకు సమాచారం ఇవ్వకుండా కాజేశారనే ఆరోపణలున్నాయి. ఫలితంగా కేడీసీసీ బ్యాంకుకు సైతం సంఘం డ్యూ పడేలా చేశారు.
ఒక దశలో సంఘం ఆస్తులను బ్యాంకు స్వాధీనం చేసుకునేందుకు ముందుకురాగా, కార్మికులు సమగ్ర వివరాలతో కలెక్టర్, చేనేత జౌళీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎప్పుడేం జరిగిందో వివరించారు. డబ్బుల డ్రా పూర్తిగా అధ్యక్షుడికే సంబంధించిన విషయమని స్పష్టం చేయడంతో విచారణ జరిపిన జౌళీ శాఖ అధికారులు అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. అధ్యక్షుడిగా కొనసాగిన తుమ్మ జనార్దన్ నుంచి కొంత మేరకు రికవరీ చేయగా ఇంకా రికవరీ చేయాల్సి ఉన్నది.
సంఘానికి నాలుగు సొంత భవనాలున్నప్పటికీ సంఘంలో జరిగిన అవినీతి అక్రమాల వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే నూలు, రాయితీలు రాకుండా పోయాయి. క్రమంగా సంఘం మూతపడిపోగా, కార్మికుల జీవితాలు ఆగమయ్యాయి. దాదాపు 165 మంది వృత్తినే వదిలేశారు. ఇతర వృత్తులను ఎంచుకున్నారు. 10 మంది కార్మికులు మాత్రం కనుకులలోని శ్రీ వెంకటేశ్వర చేనేత సహకార సంఘం నుంచి నూలు తీసుకొని వారికి బట్ట నేచి ఇస్తూ ఉపాధి పొందుతున్నారు.
సుల్తానాబాద్‌లోని శ్రీ శ్రీనివాస చేనేత సహకార సంఘంలో జరిగిన అక్రమాలను గుర్తించాం. సంఘం అధ్యక్షుడి నుంచి ఇప్పటికే కొంత మేరకు రికవరీ చేశాం. ఇంకా రికవరీ చేయాల్సి ఉంది. చేస్తాం. సహకరించకపోతే రెవెన్యూ రికవరీ చట్టాన్ని ఉపయోగిస్తాం. బ్యాంకు బకాయికి సంబంధించి కొంత మేరకు చెల్లింపులు చేశాం. ఇంకా చెల్లించాల్సి ఉంది. అయితే, త్వరలోనే రుణమాఫీ వస్తుంది. అలా పూర్తిగా తేరిపోతుంది. అక్రమాలపై చర్యలు తీసుకొని తిరిగి సంఘాన్ని బలోపేతం చేస్తాం. త్వరలోనే ఎన్నికలను నిర్వహించి కొత్త కమిటీని ఎన్నుకుంటాం.
– ఎస్ చరణ్, సహాయ సంచాలకుడు చేనేత, జౌళీ శాఖ (కరీంనగర్)