శాస్ర్తోక్తంగా రుద్ర ఏకాదశి పూజలు
కమాన్‌చౌరస్తా, డిసెంబర్ 29: నగరంలోని భగత్‌నగర్ హరిహర క్షేత్రం అయ్యప్పస్వామి ఆలయంలో బుధవారం తెప్పోత్సవం, రుద్ర ఏకాదశి పూజలను ఉత్సవ కమిటీ అధ్యక్షుడు డీ సంపత్ నేతృత్వంలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంగళంపల్లి రాజేశ్వరశర్మ, డింగరి చాణక్య ఆధ్వర్యంలో గణపతి హోమం జరిపించారు. అనంతరం డీ సంపత్ గురుస్వామి ఆధ్వర్యంలో పలువురు దీక్షాపరులు మాండువ (మానేరు డ్యాం) నదికి వెళ్లి నీటిని తీసుకువచ్చి స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ఫల, పంచామృతాలతో అభిషేకం చేశారు. వేములవాడ, కరీంనగర్‌కు చెందిన అర్చకులు వేద మంత్రాల మధ్య రుద్ర ఏకాదశి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం దీక్షాపరులు, భక్తులతో కిక్కిరిసిపోయింది. మధ్యాహ్న సమయంలో భిక్ష ఏర్పాటు చేశారు. సాయంత్రం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి, మహాపడిపూజను నిర్వహించారు. భజనలు, పూజలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. బిగ్‌బాస్ ఫేమ్ గంగవ్వ పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో కొస్న కాంతారెడ్డి, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ బెల్సింగ్, గడప నాగరాజు, రుద్రాక్ష కృష్ణ, బొల్లు నరేందర్, సాయిచింటూ, జీఎస్ ఆనంద్, శంకర్, వినోద్, తిరుపతి, శేఖర్‌రావు తదితరులు పాల్గొన్నారు. కొవిడ్ నిబంధనల ప్రకారం పూజా కార్యక్రమాలు నిర్వహించగా, భక్తులు పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులయ్యారు.