పట్టణంలో రూ.వందల కోట్లతో పనులు
రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్
రూ.6.5 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ధర్మపురి, డిసెంబర్ 29: ధర్మపురి క్షేత్రాన్ని యాదాద్రి తరహాలో తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ధర్మపురి పట్టణంలో రూ.6.5కోట్ల ఎస్డీఎఫ్ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. బస్టాండ్ సమీపంలో శ్రీలక్ష్మీనరసింహ సదన్ 32 వసతి గదుల ధర్మశాల పైన రూ.5కోట్ల నిధులతో 60 గదుల నిర్మాణానికి, రూ.1.5కోట్లతో చేపడుతున్న మూడు అంతస్తుల కేఎన్ఆర్ షాపింగ్ మాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ధర్మపురి దేవాలయ అభివృద్ధి కోసం రూ.100 కోట్లు బడ్జెట్లో కేటాయించారని, అందులో మొదటి విడుతగా రూ.46.65 కోట్లు మంజూరు చేయగా ప్రస్తుతం రూ.6.5 కోట్లతో పనులు ప్రారంభించామన్నారు. ఇప్పటికే వందలాది కోట్ల నిధులతో ధర్మపురి పట్టణాన్ని అభివృద్ధి చేశామన్నారు. పట్టణంలో రూ.2కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మిస్తున్నామన్నారు. రూ.50లక్షలతో ఫిష్ మార్కెట్ పూర్తయిందన్నారు. పవిత్ర గోదావరి నదిలో మురుగునీరు కలువకుండా రూ.5.68కోట్లతో మహాడ్రైనేజీ నిర్మాణం పూర్తి చేశామన్నారు. కోటి రూపాయలతో అధునాతన వైకుంఠధామాన్ని పూర్తి చేశామన్నారు. రూ.50కోట్లతో నిర్మిస్తున్న మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని త్వరలో పూర్తి చేస్తామన్నారు. మురికి కూపంలా ఉన్న చింతామణి చెరువును రూ.36కోట్లతో ఆధునీకరణ, సుందరీకరణ పనులు పూర్తి చేసుకున్నామన్నారు. తమ్మళ్లకుంటను రూ.63లక్షలతో సుందరీకరించుకున్నామని పేర్కొన్నారు.