3.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్‌లాల్
కరీంనగర్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): జిల్లాలో వానకాలం సీజన్లో వందశాతం వరి ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేసినట్లు అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసేందుకు జిల్లాలో 351 కేంద్రాలను ప్రారంభించి 67, 506 మంది రైతుల నుంచి రూ.745.92 కోట్ల విలువైన 3లక్షల 80వేల 573 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. బుధవారం వరకు 67,168 మంది రైతులకు రూ.715.92 కోట్లను ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా వందశాతం ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ధాన్యం సజావుగా కొనుగోలు చేసేందుకు సహకరించిన రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, ప్రజాప్రతినిధులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. గతేడాది వానకాలం సీజన్లో ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని, ఈసారి సాగు విస్తీర్ణం పెరిగినందున రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. జిల్లాలో వానకాలం సీజన్లో ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల నుంచి 340 కేంద్రాల పరిధిలో కొనుగోళ్లు పూర్తయినందున మూసివేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు 95,25,950 గన్నీ బ్యాగులు పంపిణీ చేశామని పేర్కొన్నారు. ఇంకా 30,291 నిల్వ ఉన్నట్లు చెప్పారు. జిల్లాలో వందశాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తయినట్లు పేర్కొన్నారు.