లేకుంటే కేంద్రంతో ఉద్యమమే
సిరిసిల్ల నేతన్నల ఆగ్రహం
ముగిసిన వస్త్ర పరిశ్రమ ఐక్య వేదిక దీక్ష
సిరిసిల్ల టౌన్, డిసెంబర్ 29: వస్త్ర పరిశ్రమపై జీఎస్టీని ఉపసంహరించుకునేదాకా పోరాటం ఆగదని సిరిసిల్ల వస్త్ర పరిశ్రమల ఐక్యవేదిక నాయకులు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తుంటే.. కేంద్రం కార్మికుల నడ్డివిరిచే నిర్ణయాలు తీసుకుంటున్నదని ధ్వజమెత్తారు. కేంద్రం ఒంటెత్తు పోకడను సహించబోమని, జీఎస్టీ ఎత్తేసేవరకు ఉద్యమం చేస్తామని తేల్చిచెప్పారు. పెంచిన జీఎస్టీకి వ్యతిరేకంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చేపట్టిన మూడు రోజుల నిరసన దీక్ష బుధవారంతో ముగిసింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్తోపాటు ఇతర పార్టీల నాయకులు, కార్మిక సంఘాలు, పద్మశాలీ సంఘం, తదితరులు సంఘీభావం తెలిపారు. అనంతరం వారు మాట్లాడారు. స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వస్త్ర పరిశ్రమకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తూ వెన్నుదన్నుగా నిలిచిందని కొనియాడారు. కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వస్త్ర పరిశ్రమను కనుమరుగు చేసేందుకు కుట్ర పన్నుతున్నదని విమర్శించారు. వస్త్ర పరిశ్రమపై కరోనా తీవ్ర ప్రభావం చూపిందని, ఇప్పుడు కేంద్రం జీఎస్టీ పేరిట గుదిబండ మోపుతున్నదని వాపోయారు. కేంద్రం నిర్ణయాన్ని ఉపసంహరించుకోలేని పక్షంలో దశల వారీగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఇక్కడ టెక్స్టైల్ పార్క్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్నల్దాస్ అనీల్, ఆంకారపు కిరణ్, బొద్దుల విష్ణు, కాటన్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం డైరెక్టర్ పోలు రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.
మోయలేని భారం..
వస్త్ర పరిశ్రమపై రెండేండ్లుగా కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. కేంద్ర ప్రభుత్వం చరిత్రలో లేనివిధంగా వస్త్ర పరిశ్రమపై 5 శాతం జీఎస్టీని అమలుచేసింది. అప్పుడే టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రం నిర్ణయాన్ని తీవ్రస్థాయిలో వ్యతిరేకించింది. మళ్లీ ఇప్పుడు అదనంగా పెంచిన 7శాతం జీఎస్టీ జనవరి నుంచి అమలులోకి వస్తుంది. దీని ద్వారా వస్త్ర పరిశ్రమపై మోయలేని భారం పడుతుంది. జిల్లాలో 40వేల వరకు మరమగ్గాలు ఉన్నాయి. వీటిపై ఆధారపడి 27వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. పెరిగిన జీఎస్టీ ప్రభావం వీరందరి జీవితాలపై పడుతుంది. – మంచె శ్రీనివాస్, మున్సిపల్ వైస్‌చైర్మన్