రాష్ట్ర సర్కారు చొరవతో సరికొత్తగా పట్టణం
నాడు పట్టింపులేక ఆగం
నేడు ప్రగతి కాంతులు
రూ.70కోట్లతో అభివృద్ధి పనులు
వాడవాడనా సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణం
ఇప్పటికే మెజార్టీ పనుల పూర్తి
ఆనందంలో పట్టణప్రజలు
హుజూరాబాద్ టౌన్, అక్టోబర్ 29 : హుజూరాబాద్ మున్సిపాలిటీ. ఓ చైతన్యవంతమైన ప్రాంతం. దాదాపు 50వేల జనాభా ఉంటుంది. పట్టణంలో 30 వార్డులు ఉండగా, అందుకుతగ్గ వసతులు లేక ప్రజానీకం ఇబ్బందులు పడుతున్నది. గత పాలకుడు ఏండ్లకేండ్లు ఏకచత్రాధిపత్య పాలనతో ఏ ఒక్క పని కాక నరకం చూసింది. డ్రైనేజీలు, సీసీరోడ్లు, ఇతర మౌలిక వసతులు లేక గోసపడ్డది. కానీ విషయం తెలిసిన రాష్ట్ర సర్కారు ప్రత్యేక చొరవతో రెండు నెలల్లో తన రూపురేఖలు మార్చుకొని నవ్వుతున్నది.
రూ.70 కోట్లతో పనులు..
హుజూరాబాద్ పట్టణం గతి మారింది. ప్రజల డిమాండ్ తెలుసుకున్న రాష్ట్ర సర్కారు అధికారులను పురమాయించి యుద్ధప్రాతిపదికన ప్రణాళికలు సిద్ధం చేసి రూ.70 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇంకేముంది మంజూరైన నిధులతో హుజూరాబాద్ పట్టణంలో అభివృద్ధి పనులు శరవేగంగా పరుగెత్తాయి. రూ.50 కోట్ల నిధులతో మున్సిపల్ పరిధిలోని ముప్పై వార్డుల్లో సీసీరోడ్లు, మురుగు కాలువలు నిర్మించగా, రూ.10 కోట్లతో మిషన్ భగీరథ పథకం కింద యుద్ధప్రాతిపదికన ప్రతి వాడలో నూతన పైప్‌లైన్ నిర్మించారు. అలాగే మరో రూ.10 కోట్లతో ఇతర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టగా ఎన్నికల కోడ్ రావడంతో కొన్నిచోట్ల పనులు ఆగిపోయినప్పటికీ నూటికి 90శాతం పనులను పూర్తి చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం 70రోజుల్లో రూ.70 కోట్ల అభివృద్ధి పనులు చేసి ఔరా అనిపించారు.
ఇంత స్పీడ్‌గా చేస్తరనుకోలె..
గత పాలకుడు హుజూరాబాద్‌ను పట్టించుకోకపోవడంతో పట్టణ ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డా రు. ఈ క్రమంలో మంత్రు లు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రభు త్వం ప్రత్యేక చొరవ తీసుకొని హుజూరాబాద్‌లో అభివృద్ధి పనులను పరుగులెత్తించారు. మెజార్టీ ప్రాంతా ల్లో పనులు పూర్తికాగా, మిగతా చోట్ల చురుగ్గా సాగుతున్నాయి. అనతి కాలంలోనే ఎంతో చిత్తశుద్ధితో పట్టణాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి హుజూరాబాద్ పట్టణ ప్రజలందరూ రుణపడి ఉంటారు.
ప్రభుత్వం చేయూత మరువలేనిది
హుజూరాబాద్ పట్టణ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసింది. రూ.70 కోట్లతో రెండు నెలల్లోనే 90శాతం పనులు పూర్తి చేసింది. గతంలో ఏ వసతులు లేక ఈ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. నరకం చూశారు. ఎవరిని అడిగినా ఏం చేయలే. ఇప్పుడు అందరికీ అన్ని వసతులు సమకూరాయి. రాష్ట్ర సర్కారుకు బల్దియా ప్రజలు ఎల్లవేళలా రుణపడి ఉంటారు.