మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ యత్నం
పాదయాత్రలు ఎందుకు చేస్తున్నారో బహిరంగ చర్చకు రావాలి
బండి, రేవంత్ సోయి లేకుండా మాట్లాడుతున్నరు
రాష్ట్రం ఏర్పడడంతోనే వారికి పదవులు వచ్చినయ్
విలేకరుల సమావేశంలో మంత్రి కొప్పల ఈశ్వర్
జమ్మికుంట, ఆగస్టు 29 : ‘రాజకీయ అధికార దాహం కోసం బండి సంజయ్, రేవంత్‌రెడ్డి ప్రజలను రెచ్చగొట్టే యాత్రలు చేస్తున్నరు. శాంతియుతంగా ఉన్న రాష్ట్రంలో బీజేపీ మత విధ్వేషాలు సృష్టించే ప్రయత్నం చేస్తోంది. ఏడేళ్లుగా దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పటి వరకు ఇక్కడ ఏం చేసిందో చెప్పాలె. నిధులిచ్చినామని అబద్ధాలు చెప్తుంది. మనకిచ్చే నిధులకే కోతలు పెడ్తుంది. రాష్ట్రంలోని సంక్షేమం, అభివృద్ధిపై బహిరంగ వేదికపైకి రావాలి. 18 రాష్ర్టాల్లో ఏదో చేస్తున్నట్లు ఫోజులు కొట్టడం ఆపాలి. రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి సీఎం కేసీఆర్ రిలాక్స్ కాలే. పేరుకుపోయిన సమస్యలన్నీ శాశ్వతంగా పరిష్కరిస్తున్నడు. ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్రం.. దేశానికే పాఠాలు నేర్పుతోంది. ఇక కాంగ్రెస్ కనుమరుగైన పార్టీ. ఏమన్నంటే రేవంత్.. ఫాంహౌస్‌లో సీఎం అంటడు.. కుటుంబ పాలన అంటడు. ఆయనకేమన్నా.. సోయిందా.. రైతుబంధు, రైతు బీమా, దళిత బంధు, కాళేశ్వరం ప్రాజెక్టు, పింఛన్లు, ఇలా చెప్పుకుంటూ ఎన్నో పథకాలు అమలెట్లా అవుతున్నయో చెప్పాలె. కేటీఆర్, హరీశ్‌రావు ప్రజా నాయకులు.. గెలిచిన నాయకులు వారు.. అర్థం పర్థం లేకుండా విమర్శిస్తే బాగుండదు.. జాగ్రత్త’ అని ఫైర్ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన కరీంనగర్ జిల్లా జమ్మికుంట కొత్త మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉద్యమంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఎక్కడున్నారో.. చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకానొక సందర్భంలో రాష్ట్రం కోసం రాజీనామా చేయాలని అన్ని రాజకీయ పార్టీలు భావించినప్పుడు, ఒక్కగానొక్క ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి పారిపోయాడని గుర్తు చేశారు. టీడీపీ, కాంగ్రెస్ కూడా అదే దారి పట్టాయని దుయ్యబట్టారు. 16 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి చూపెట్టిన ఘనత తమదని, ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొన్నామని గుర్తు చేశారు. సంక్షేమంలో ముందుకు వెళ్తున్న రాష్ర్టాన్ని డిస్ట్రర్బ్ చేసేందుకుకే పాదయాత్రలు మొదలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన చట్టంలో ఉన్న ఏ ఒక్కటీ అమలు చేయలేదని బీజేపీని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్‌కు విమర్శించే అర్హత లేదన్నారు. తెలంగాణ రావడం వల్లే వారికి పదవులు వచ్చాయని, అధికారం కోసం ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని బండి, రేవంత్‌ను హెచ్చరించారు. సరైన సమయంలో సరైన గుణపాఠం ప్రజలే చెబుతారని పేర్కొన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
సమస్య విని.. సత్వరమే పరిష్కరించి..
జమ్మికుంట పట్టణంలోని 29 వార్డులో ఏళ్లనాటి సమస్యకు మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిష్కారం చూపారు. ఆదివారం ఆ వార్డు కౌన్సిలర్ రావికంటి రాజు ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు, వార్డు ప్రజలతో సమావేశం నిర్వహించగా, మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు జమ్మికుంటలోని అతి పెద్ద కూరగాయల మార్కెట్ ఏరియా ట్రాఫిక్ సమస్య గురించి చెప్పారు. తమ వార్డు పరిధిలో ఉన్న ఈ మార్కెట్‌తో ప్రతి రోజూ రాకపోకలకు ఇబ్బంది కలుగుతున్నదని, వన్ వే చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. పోలీస్ స్టేషన్ పక్కనున్న దారి నుంచైనా, రూరల్ పీఎస్ వెనుక నుంచైనా భారీ వాహనాలు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యను చెబుతుండగానే అమాత్యుడు వెంటనే పట్టణ సీఐ రాంచందర్‌రావును పిలిపించి, చర్చించారు. వన్ వే వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో వార్డు ప్రజలంతా సంతోషం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం ఇంత ఈజీయా.. అని అనుకున్నారు. మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్ కోసం పనిచేస్తామని ప్రతినబూనారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపునకు పాటుపడుతామని హామీ ఇచ్చారు. తర్వాత మంత్రి మాట్లాడుతూ సమస్య ఏదైనా తమ దృష్టికి తీసుకరావాలని, పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మీ చేతులో టీఆర్ఎస్ ఎమ్మెల్యేను పెట్టేంత వరకు సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల బాధ్యత తమదేనని తెలిపారు. సమావేశాల్లో మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ సంపత్, కౌన్సిలర్లు రమేశ్, భాస్కర్, రాము, రాజు, నాయకులు మల్లయ్య, శ్రీహరి తదితరులున్నారు.
జమ్మికుంటలో సీసీ రోడ్డుకు శంకుస్థాపన
జమ్మికుంట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మంత్రి కొప్పుల ఈశ్వర్ సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. మున్సిపల్ కార్యాలయానికి తొలిసారిగా వచ్చిన మంత్రిని మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు, కౌన్సిలర్లు శాలువాలతో సన్మానించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. ప్రతి వార్డుకూ రూ.కోటి నిధులు అందించామని తెలిపారు. పనులన్నీ ఎన్నికల్లోగా పూర్తి చేసుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ జమ్మికుంట పట్టణంపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు.
కల్యాణలక్ష్మి పేదింటి ఆడబిడ్డకు గొప్ప వరం
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు గొప్ప వరమని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. జమ్మికుంట పట్టణంలోని మున్సిపల్ చైర్మన్ నివాసంలో మంత్రి మున్సిపల్ పరిధిలోని పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేసీఆర్ కిట్, అమ్మ ఒడి పథకాలేవీ బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలు కావడం లేదన్నారు. కల్యాణలక్ష్మితో బాల్య వివాహాలకు అడ్డుకట్ట పడిందని తెలిపారు. ఉచిత విద్య కోసం వెయ్యి గురుకులాలను ఏర్పాటు చేసి నిర్వహిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని చెప్పారు. మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు, బుగ్గారం జడ్పీటీసీ బాదినేని రాజేందర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.