అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కృషి
పథకాలకు ఆకర్షితులయ్యే చేరికలు
యాత్రల పేరుతో వంచిస్తున్న బీజేపీ
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
వీణవంక, ఆగస్టు 29: అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం చిరునామాగా మారిందని, అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి చేరికలు జోరుగా సాగుతున్నాయని చెప్పారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గొర్రె రాజమౌళితో పాటు మరో 10 మంది ఆదివారం బీజేపీ నుంచి టీఆర్ఎస్లో చేరగా ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో 9వ వార్డు మెంబర్ మౌనిక-సతీశ్, సీనియర్ నాయకులు వీరనేని కిషన్‌రావు, జితేందర్‌రావు, కత్తెర్ల శ్రీను, బండారి ఐలయ్య, దామోదర్, మేఘమాచారి తదితరులున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. ఈటల నిర్లక్ష్యంతోనే హుజూరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని విమర్శించారు. దళిత వర్గాల ఆర్థికాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని తీసుకువచ్చారని తెలిపారు. దళితబంధును అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తుంటే బీజేపీ మాత్రం తప్పుడు ప్రచారం చేస్తున్నదని దుయ్యబట్టారు. ప్రజలను వంచించేందుకే బీజేపీ యాత్రలు చేపట్టిందని ఆరోపించారు. హుజూరా బాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, సింగిల్ విండో చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, మాజీ చైర్మన్ మాడ సాదవరెడ్డి, సర్పంచ్ మోరె సారయ్య, ఉపసర్పంచ్ తిరుపతి, నాయకులు రవీందర్రావు, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
బీజేపీతో ఒరిగేదేంలేదు
అభివృద్ధి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యం. నేను గతంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడిగా పని చేసిన. ఈటలను నమ్మి బీజేపీలోకి వెళ్లిన. ఎంపీగా బండి సంజయ్ ఏమీ చేయలేదు. ఇక ఈటల గెలిచి ఏం చేస్తడు. అభివృద్ధి ఆగకూడదనే మళ్లీ టీఆర్ఎస్లో చేరిన. గెల్లు శ్రీనివాస్ గెలుపు కోసం కృషి చేస్త.