నేడు ఒక్కరోజే వ్యాక్సినేషన్
ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు..
సూపర్ స్ప్రెడర్లుగా డ్రైవర్లు, కండక్టర్లే..
నాలుగు జిల్లాల్లో 1,021 మంది అర్హులు
డిపోల వారీగా కేంద్రాలు
ఒక్కరోజులో పూర్తి చేయాలని ఆర్టీసీ ఎండీ ఆదేశాలు
కరీంనగర్, మే 29 (నమస్తే తెలంగాణ) : కరోనా వ్యాప్తిని నిరోదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూపర్ స్ప్రెడర్లుగా గుర్తించి కేటగిరీల వారీగా టీకాలు వేస్తున్నది. మొదట జర్నలిస్టులు, ఎల్పీజీ గ్యాస్ డీలర్లు, వర్కర్లు, ఫర్టిలైజర్, పెస్టీసైడ్స్ డీలర్లు, వర్కర్లకు ప్రాధాన్యత ఇచ్చి శుక్ర, శనివారాల్లో రెండు రోజుల పాటు టీకాలు వేశారు. ఇక అత్యంత ప్రాధాన్యతగల ప్రజా రవాణాలోని సూపర్ స్ప్రెడర్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా ఆర్టీసీలో పని చేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లకు ఆదివారం ఒక్కరోజే టీకాలు వేయాలని నిర్ణయించారు. ఆర్టీసీ సీఎండీ సునీల్‌శర్మ శనివారం అన్ని రీజియన్ల మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఆదివారం ఒక్కరోజే వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఆర్టీసీలో పని చేస్తున్న 45 ఏండ్లు దాటిన వారు వ్యక్తిగతం గా ఇప్పటికే టీకాలు వేసుకున్నారు. ఇక ఆలోపు వారికి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి టీకాలు వేయనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని పది డిపోల్లో డ్రైవర్లు, కండక్టర్లు సుమారు 3,800 మంది ఉండగా, 45 ఏండ్లలోపు ఉన్న వారు 1,021 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరి లో ఇద్దరు నాన్‌ఆపరేషన్ యూనిట్‌కు సంబంధించిన కండక్టర్లు కాగా, డ్రైవర్లు 322, కండక్టర్లు 699 మంది ఉన్నారు. అయితే, 45 ఏండ్లు దాటి ఇప్పటి వరకు టీకా వేసుకోని వారికి కూడా వేయిస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
ప్రతి డిపోలో వ్యాక్సినేషన్..
కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలో 10 ఆర్టీసీ డిపోలున్నాయి. ఇందులో కరీంనగర్-1, 2 డిపోలు కలిపి బస్టేషన్లో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుండగా, మిగతా అన్ని చోట్లా డిపోల వారీగా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఉద యం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ఆర్టీసీ సీఎండీ ఆదేశించిన నేపథ్యంలో డిపోల వారీగా గుర్తిం చి అర్హులకు అధికారులు ఫో న్లు చేసి సమాచారం అందించారు. ఎక్కువ మంది ఉన్న డిపోల్లో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి టీకాలు వేస్తా రు. అర్హులైన ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ ఆర్ఎం ఏ శ్రీధ ర్ విజ్ఞప్తి చేశారు. కాగా, శనివారం సాయంత్రం ఆర్టీసీ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమైన కరీంనగర్ కలెక్టర్ కే శశాంక దిశానిర్దేశం చేశారు.