నాడు ధాన్యం అమ్ముకోవాలంటే తిప్పలు..
కేంద్రాల వద్ద రోజులకొద్దీ పడిగాపులు
సమైక్య పాలనలో జాడలేని మద్దతు ధర
నేడు అన్నదాతకు అండగా సీఎం కేసీఆర్
కేంద్రం కొనేదిలేదని చెప్పినా.. భరోసా
రైతులకు ఇబ్బందుల్లేకుండా గ్రామాల్లోనే కాంటాలు
కనుగోళ్ల ప్రక్రియ వేగవంతం
హుజూరాబాద్‌లో రెండ్రోజుల్లోనే 13 వేల మెట్రిక్ టన్నుల సేకరణ ఇప్పటికే 50లక్షలు జమ
ఆనందంలో రైతులు
కరీంనగర్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ):ఒకప్పుడు ఆరుగాలం పండించిన పంటను అమ్ముకుందామంటే దగ్గరలో మార్కెట్ ఉండేది కాదు. కిలోమీటర్ల దూరం పోవాలంటే రవాణాకు వేలకు వేలు ఖర్చయ్యేది. తీరా తీసుకెళ్లిన తర్వాత మార్కెట్లో ధాన్యం పోద్దామంటే జాగ ఉండేదికాదు. ఎక్కడోచోట పోసిన తర్వాత రోజులకొద్దీ పడిగాపులు గాసేది. కొనడానికి వచ్చిన అడ్తీదారులు ఒక్కొక్కరు ఒక్కో (ధర నిర్ణయం) పాట పాడుతోంటే రైతుగుండె దడతో బరువెక్కేది. నిర్ణయమయ్యేదాకా ముఖంలో ఆందోళన కనిపించేది. మద్దతు ధర ఊసే లేక పోయేది. ధాన్యం అమ్మిన తర్వాత సేట్ల కార్యాలయాలకు వెళ్లి డబ్బుల కోసం గంటల తరబడి వేచిచూసేది. బిల్లు పట్టికలో ఆ చార్జీ.. ఈ చార్జీ.. కమీషన్ అని సవాలక్ష రాసి మిగిలిన పైసలు రైతు చేతిల పెట్టేది. ఈ తిప్పలన్నీ ఎందుకని కల్లంకాన్నే దళారీకి అమ్మితే ఆఖరికి అప్పే మిగిలేది.
రాష్ట్ర సర్కారు రైతన్నకు అండగా నిలుస్తున్నది. ఆది నుంచీ కంటికిరెప్పలా కాపాడుకుంటున్నది. కేంద్రం నల్ల చట్టాలతో ఇబ్బందులు పెడుతూ.. మార్కెట్లు ఎత్తివేస్తూ.. కర్షక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నా ఎక్కడా నష్టం జరుగకుండా చూస్తున్నది. అందులో భాగంగా కేం ద్రం దొడ్డు వడ్లు కొనబోమని తేల్చిచెప్పడంతో ‘ మేమున్నాం.. మేకేం కాదని’ అభయమిచ్చింది. ఊరికో సెంటర్ ఏర్పాటు చేసి కొనుగోళ్లు మొద లు పెట్టింది. కరీంనగర్ జిల్లావ్యాప్తంగా 351 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన అధికారులు, హుజూరాబాద్‌లోనే 95 కేంద్రాలను ప్రారంభించారు. వారం నుంచే కొన్ని కేంద్రాలకు ధాన్యం వస్తుండగా, రెండ్రోజుల్లోనే 13 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నారు. చెల్లింపులు వెంటనే చేస్తున్నారు. అందులో ఆన్లైన్లో నమోదైన రైతులకు రూ.50 లక్షల దాకా చెల్లించారు. జిల్లాలోని మానకొండూర్, శంకరపట్నం తదితర మండలాల్లో కూడా కోతలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ కూడా అధికారులు కేంద్రాలను ప్రారంభించారు. మానకొండూర్‌లో మినహాయిస్తే హుజూరాబాద్‌లోనే ప్రస్తుతం కేంద్రాలకు ఎక్కువగా ధాన్యం వస్తోందని అధికారులు తెలిపారు.
ఇప్పుడు రైతు పంట అమ్ముకోవడానికి ఊరు దాటాల్సిన అవసరం లేదు. ట్రాన్స్పోర్ట్ చార్జీలకు వేలకు వేలు పెట్టాల్సిన పనిలేదు. ధాన్యాన్ని పట్టుకపోయి పడిగాపులు పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ధర ఎంత పెడుతరో అన్న ఆందోళన ఏమాత్రం లేదు. డబ్బుల కోసం ఎటూ తిరగాల్సిన పని ఎంతమాత్రమూ లేదు. ఎందుకంటే.. రాష్ట్ర సర్కారు కర్షకులపై కరుణ చూపుతున్నది. వడ్లు కొనేది లేదని కేంద్రం చేతులెత్తేసినా.. రైతులకు భరోసా ఇచ్చింది. ఊరిలోనే కేంద్రాలు ఏర్పాటు చేసి కొనడంతోపాటు వెనువెంటే చెల్లింపులు చేస్తున్నది. ఉమ్మడి జిల్లాలో కొనుగోళ్లు వేగవంతం కాగా, పండించిన ప్రతి గింజకూ మద్దతు ధర దక్కుతుండడంతో కర్షకలోకం హర్షం వ్యక్తంచేస్తున్నది.కావలి వండే బాధ తప్పింది..
వరి కోతలు మొదలైతే వడ్లు ఎవ్వలు కొంటరో..ఎప్పుడు కొంటరో అని రందయ్యేది. పరదలల్ల పోసి రోజుల కొద్దీ రాత్రింబవళ్లు కావలి పడుకునేటోళ్లం. ఒక్కోసారి నెల రోజులైనా వడ్లు కొనేటోళ్లు కాదు. పరదల కిరాయికి, ఎవ్వలు కావలిగాయాలని భయపడి ధర తక్కువై నా దళారులకు అమ్ముకొనెటోళ్లం. ఆ పైసలు నెలా, రెండునెల్ల వాయిదా పెట్టి ఇచ్చెటోళ్లు. చేతికి అందేటాళ్లకు తెచ్చిన అప్పులకు వడ్డీ పెరిగేది. తెలంగాణ సర్కారు అచ్చినంక కోతలు మొదలవుడే ఆలస్యం. అన్ని ఊళ్లల్ల సెంటర్లు వెడుతున్నది. టైముకు బార్దన్ ఇచ్చి, మద్దతు ధర వెట్టి సర్కారే కొనుగోలు జేత్తంది. పైసలు గూడ వారం రోజులల్ల బ్యాంక్ ఖాతాల ఏత్తన్రు. గిప్పుడే రైతులకు మంచి రోజుల చ్చినయ్. పెట్టుబడి సాయం ఇచ్చి ఆదుకుంటున్న సర్కారే మళ్లా మద్దతు ధరవెట్టి వడ్లు కొంటంది. ఇంతకన్నా రైతులకు ఏంగావాలె. నాకు మూడున్నర ఎకరాలు ఉన్నది. ఏ రంది లేకుంట మంచిగ ఎవుసం జేసుకుంటాన్న.
పానం నిమ్మలమైంది..
అప్పట్ల పంట సాగుజేసుడు ఒకెత్తయితే దాన్ని అమ్ముడు మరో ఎత్తయ్యేది. వడ్లు శాంపిల్ పట్టుకొని మిల్లు మిల్లుకు తిరిగినా కొనేటోళ్లు కాదు. విసుగచ్చి చివరికి మిల్లు సేట్ ఎంత అడిగితే అంతకు అమ్ముకునేటోళ్లం. పైసలకు కూడా తిరగంగ తిరగంగా తాపకిన్నీ ఇచ్చేవారు. అవి రాశికి రాక పెట్టుబడికి తీసుకువచ్చిన అప్పులు అట్లనే ఉండేవి. తెలంగాణ సర్కారు అచ్చి, వడ్లు కొన్నప్పటి సంది ఎసొంటి ఇబ్బందులు లేవు. కొత్తాన్నం.. ఎండబెడతాన్నం, అమ్ముకుంటున్నం. అకౌంట్ల పైసలు కూడా తొందరగానే పడుతున్నయ్. ఇప్పుడు పానం నిమ్మలమైతంది.
ఏడెకరాలల్ల పంటేస్తున్న..
ఏడేండ్ల కిందట ఎవుసం చేయాలంటే ఇబ్బంది ఉండే. రాత్రి పూట కరెంటు ఎప్పుడు వస్తదో, ఎప్పుడు పోతదో తెల్వది. లాంతర్లు పట్టుకొని రాత్రి పూట బాయి కాడికి పోయి నీళ్లు కట్టేది. ఆ అచ్చిన నాలుగు గంటల కరెంటుతో టాన్స్‌ఫార్మర్లు కాలిపోతుండె. వేసిన పంట ఇంటికి వచ్చే దాకా గ్యారెంటీ ఉండకపోతుండె. సీఎం కేసీఆర్ అచ్చినంకనే రైతులకు 24 గంటల కరెంట్ ఉచితంగా ఇత్తండు. పంట పెట్టుబడి సాయం కూడా ఆయనే మొదలు పెట్టిండు. పండిన పంటను సుత ఊళ్లనే కొంటాండ్రు. ఒకప్పుడు పంట అమ్మాలంటే మస్తు ఇబ్బందులుండె. సర్కారు కొలువు జేసుడుకంటే.. ఎవుసం జేసుడే సులువయ్యింది. నేను ఏడెకరాల్ల పంటేస్తున్న. – సోమసాని కొంరయ్య, చెల్పూర్ (హుజూరాబాద్)
కేంద్రాలు ఊళ్లెకే అచ్చినయ్..
సర్కారోళ్లు ఊళ్లనే వడ్లు కొనేందుకు ఏర్పాట్లు చేసిండ్రు. మేం పండించిన పంటను ఏడికి తీసుకపోకుండా.. కొనుగోలు కేంద్రానికే తెస్తున్న. వడ్లను మంచిగ ఎండబెట్టినంక అందుల తేమను జూసి పంటను కొంటాండ్రు. గతంలో వరి పండించినంక అమ్మనీకి ఎన్నో తిప్పలు ఉంటుండె. దళారులు ఎంత జెప్పితె అంతకు అమ్మెటోళ్లం. ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు పెట్టుట్ల మంచిగనే ధర వత్తాంది. టీఆర్ఎస్ సర్కారు వచ్చినంక ఎవుసం చాలా సులువైంది. గతంలో ఏ ప్రభుత్వాలు సుక ఇట్ల రైతుల గురించి ఆలోచించలె. 24 గంటలు ఉత్తగానే కరంటు, రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ, కాళేశ్వరం ప్రాజెక్టు.. ఇట్ల పథకాలు పెట్టి సహాయం చేయలె.