సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండండి
సీపీ చంద్రశేఖర్‌రెడ్డి
ఫర్టిలైజర్‌సిటీ, ఆగస్టు 28: ఆన్లైన్లో అద్భుత ఆఫర్లు అంటూ వచ్చే ప్రకటనలు, వెబ్సైట్లు, సైబర్ నేరాలపై ప్రజలు అప్రతమ్తంగా ఉండాలని రామగుండం సీపీ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. సైబర్ నేరాలు, నేరగాళ్లపై అవగాహన లేకుంటే బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతాయని తెలిపారు. సైబర్ నేరగాళ్లు మాయమాటల్లో దింపి బ్యాంకు ఖాతాల నుంచి కొత్త రూపాల్లో స్వాహా చేస్తున్నారని పేర్కొన్నారు. వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు రెండు జిల్లాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. వారం రోజుల కాలంలో మంచిర్యాల పట్టణంలో సైబర్ నేరాలకు సంబంధించి పలు కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. మంచిర్యాలకు చెందిన ఒకరికి ఈ నెల 13వ తేదీన సైబర్ నేరగాడు ఫోన్ చేసి ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు కన్వర్టు చేస్తానని నమ్మించి వివరాలు తెలుసుకొని ఓటీపీ ద్వారా రూ. 8,599 కొట్టేశాడన్నారు. జన్నారం మండలానికి చెందిన ఓ వ్యక్తికి సైబర్ నేరగాడు ఈ నెల 25వ తేదీన ఫోన్ చేసి ఎల్ఐసీ ఏజెంట్ అని, పాలసీ డబ్బులు వచ్చాయని చెప్పడంతో ఫోన్‌పే నంబర్ చెప్పడంతో సైబర్ నేరగాడు అకౌంట్ నుంచి రూ.13,300 డ్రా చేశాడని తెలిపారు.
పొత్కపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి ఫోన్‌కు ఫ్లిప్ కార్డు నుంచి మెసేజ్ పంపించి రూ.99లకే ఇయర్ ఫోన్ అని చూపించగానే ఆకర్షితుడైన బాధితుడు క్యాష్ ఆన్ డెలివరీ లేకపోయేసరికి డెబిట్ కార్డు వివరాలు ఎంటర్ చేయగా రూ.15,650 డ్రా చేశారని వివరించారు. జూలపల్లికి చెందిన మరో వ్యక్తికి ఈ నెల 21వ తేదీన ఫోన్ పే గిఫ్ట్ వోచర్ వచ్చిందని నోటిఫికేషన్ రాగా, దాన్ని ఓపెన్ చేసి, పిన్ నంబర్ టైప్ చేయగా రూ.1816 డబ్బులు ఖాతా నుంచి డ్రా అయ్యాయన్నారు. ఈ నెల 20వ తేదీన పెద్దపల్లి, రామగుండానికి చెందిన ఇద్దరు ఇన్‌స్టాగ్రాంలో తక్కువ ధరకు ఐ ఫోన్లు అమ్ముతున్నామని ప్రకటన కనిపించగా అది నమ్మిన బాధితులు నగదు పంపించి మోసపోయారని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలు, వెబ్సైట్లపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఎలాంటి లింక్ మెసేజ్ వచ్చినా ఓపెన్ చేయవద్దన్నారు. బాధితులు డయల్ 100ను ఆశ్రయించాలని సీపీ పేర్కొన్నారు.