కరీంనగర్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పథకం కింద మంజూరైన యూనిట్లను జనవరి 1న గ్రౌండింగ్ చేసేందుకు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో దళితబంధు కింద మంజూరైన యూనిట్ల గ్రౌండింగ్, యూనిట్ల ఎంపికపై క్లస్టర్ అధికారులు, బ్యాంకర్లు, ఎంపీడీవోలు, తహసీల్దార్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దళితబంధు పథకం కింద 10 ఎక్స్కవేటర్, హార్వెస్టర్, టాటా ఇటాచీ, డీసీఎం వాహనాలు మంజూరైనట్లు తెలిపారు. వాటిని జనవరి 1న గ్రౌండింగ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యూనిట్ కాస్ట్ ఎకువ ఉంటే ఇద్దరు, ముగ్గురు లబ్ధిదారులతో కలిపి మంజూరు చేయవచ్చని తెలిపారు. యూనిట్లను గ్రౌండింగ్ కమిటీ సభ్యుల సహకారంతో అధికారులు త్వరగా గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దళితబంధు కింద క్లియర్‌గా ఉన్న డెయిరీ యూనిట్లను వెంటనే గ్రౌండింగ్ చేయాలన్నారు. యూనిట్ల ఎంపిక, గ్రౌండింగ్‌లో ఎంపీడీవోలు, క్లస్టర్ ఆఫీసర్ల పాత్ర కీలకమన్నారు. అధికారులు లబ్ధిదారులతో చర్చించి మారెట్‌కు అనుగుణంగా లాభాలు వచ్చే యూనిట్లను ఎంపిక చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. అధికారులు అధిక ప్రాధాన్యతమిచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించి లబ్ధిదారుల అభిరుచులు, నైపుణ్యం ఆధారంగా యూనిట్లను ఎంపిక చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేశ్‌రెడ్డి, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్‌గౌడ్, లీడ్ బ్యాంక్ మేనేజర్ లక్ష్మణ్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సీనియర్ మేనేజర్ రామారావు, జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ నవీన్‌కుమార్, డీఆర్డీవో శ్రీలత, హుజూరాబాద్ ఆర్డీవో రవీందర్‌రెడ్డి, క్లస్టర్ అధికారులు, బ్యాంకర్లు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.