తిమ్మాపూర్ రూరల్, డిసెంబర్ 27: రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నదని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. సోమవారం రూ.20లక్షలతో నుస్తులాపూర్ గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పండితుడు కిరణ్‌శర్మ ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చడానికి నిధులు మంజురు చేశానన్నారు. అన్ని కులసంఘాలు, మహిళా సంఘాలకు భవనాలకు సైతం నిధులు మంజూరు చేశానని గుర్తు చేశారు. ఈ గ్రామానికి జాతీయ అవార్డు వచ్చిందని.. ఇదే ఉత్సాహంతో మరింత ముందుకు సాగుతూ.. అభివృద్ధి చేసుకోవాలని పాలకవర్గానికి సూచించారు. స్థలం ఉంటే ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షలు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తున్నదని చెప్పారు. సర్పంచ్ రావుల రమేశ్ ఎమ్మెల్యేను సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎలుక అనిత, ఎంపీటీసీ కొత్త తిరుపతిరెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, తహసీల్దార్ రాజ్‌కుమార్, ఎంపీడీవో రవీందర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ వీరారెడ్డి ఉన్నారు.
ఉప మార్కెట్లో ఇబ్బందులు తొలిగిస్తాం
శంకరపట్నం, డిసెంబర్ 27: కేశవపట్నం ఉప మార్కెట్లో సమస్యలపై దృష్టి సారిస్తానని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. సోమవారం ఆయన స్థానిక నాయకులతో కలిసి మార్కెట్ యార్డును పరిశీలించారు. వర్షం కురిస్తే యార్డు పరిసరాల్లో నీరు నిలిచి చిత్తడిగా మారుతున్నదని స్థానిక నాయకులు ఆయన దృష్టికి తెచ్చారు. స్పందించిన ఆయన యార్డు ఆవరణను పూర్తిగా సీసీ తో నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఆవరణలో ‘రైతు-జోడెడ్ల బండి’ విగ్రహ నిర్మాణానికి రూ. 10.80 లక్షల నిధులు మంజూరైనట్లు వెల్లడించారు. ఇక్కడ జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, హుజూరాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చౌడమల్ల వీరస్వామి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట మహిపాల్, ఎరడపల్లి సర్పంచ్ కలకుంట్ల రంజిత్‌రావు, ఎస్ఐ ప్రశాంత్‌రావు, టీఆర్ఎస్ నాయకులు ఉమ్మెంతల సతీశ్‌రెడ్డి, బొజ్జ కోటిలింగం ఉన్నారు.