ఎకరా 25 గుంటల్లో రూ.కోటితో నిర్మాణం
మొదటి విడుతగా రూ.50 లక్షలు మంజూరు
పనులను స్వయంగా పర్యవేక్షిస్తా
రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్
వృద్ధాశ్రమ భవన నిర్మాణానికి భూమిపూజ
జగిత్యాల రూరల్, డిసెంబర్ 27 : జగిత్యాల జిల్లాకేంద్రంలోని టీఆర్‌నగర్‌లో కోటి రూపాయలతో ప్రభుత్వం తరఫున వృద్ధాశ్రమాన్ని నిర్మించనున్నట్లు రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పట్టణంలోని టీఆర్‌నగర్‌లో ఎకరం 25గుంటల భూమిలో రూ.కోటితో అన్ని వసతులు, హంగులతో నిర్మించనున్న వృద్ధాశ్రమానికి సోమవారం మంత్రి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ వృద్ధ్దాశ్రమ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని తెలిపారు. మొదటి విడుతగా రూ.50లక్షలు మంజూరు చేసిందన్నారు. భవన నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా స్వయంగా పర్యవేక్షిస్తానన్నారు. ఆశ్రమ నిర్వాహణ బాధ్యతలను రెడ్‌క్రాస్ సొసైటీకి అప్పగిస్తామని తెలిపారు. ఎన్జీవోల ద్వారా ఆశ్రమ నిర్వహణ బాగుంటుందన్నారు. సేవా దృక్పథంతో ప్రారంభించిన ఆశ్రమంలో ఎవరైనా వారి సేవలను అందించవచ్చని తెలిపారు. అనంతరం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో మొట్టమొదటి సారిగా ప్రభుత్వం వృద్ధ్దాశ్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం పట్టణ ప్రకృతి వనాన్ని పరిశీలించి అందులో కాసేపు సేదతీరారు. తర్వాత పద్మనాయక కల్యాణ మండపంలో 1098 బాల రక్షక వాహనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కలెక్టర్ జీ రవి, మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణి, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, కౌన్సిలర్ దేవేందర్ నాయక్, డీడబ్ల్యూవో నరేశ్, మున్సిపల్ కమిషనర్ స్వరూపారాణి, నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వృద్ధులు పాల్గొన్నారు.