మేం కుడి చేత్తో పెట్టుబడి ఇస్తే వాళ్లు ఎడమచేత్తో గుంజుకుంటన్రు
డీజిల్ రేట్లు పెంచి ఆగం చేసిన్రు
ఆలోచించండి.. గెల్లును గెలిపించండి
బీజేపీని బొందవెట్టున్రి.. కారుకు ఓటు కొట్టున్రి
మంత్రి తన్నీరు హరీశ్‌రావు
జమ్మికుంట చౌరస్తా/జమ్మికుంట/జమ్మికుంట రూరల్, అక్టోబర్ 27 : కేంద్రంలో ఉన్న బీజేపోళ్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి రైతులను నిండా ముంచిన్రు. ఎకరం దున్నెతందుకు గతంల రూ.2500 అయితే, ఇప్పుడు రూ.6 వేలైంది. మేం కుడిచేత్తో రైతుబంధు కింద పెట్టుబడి ఇస్తే.. వాళ్లు ఎడమ చేత్తో గుంజుకుంటున్రు. పెట్టుబడి ఖర్చు రెండింతలు చేసి రైతులను ఆగం చేస్తున్నరు. అట్లాంటి బీజేపీ నాయకులను ఇంకా నమ్ముదమా..? నమ్మి ఓటేద్దమా..? రైతు పక్షం ఎవరో..? రైతు వ్యతిరేకి ఎవరో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పని చేసే టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా నిలువండి. కారు గుర్తుకు ఓటేసి బీజేపీని బొంద పెట్టండి.. గెల్లు సీనును భారీ మెజార్టీతో గెలిపించండి.
బీజేపోళ్లు ఓట్ల కోసం కుట్రలు చేస్తున్నరు. ఎవరో దాడులు చేసినట్టు సృష్టించి సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నరు. సోషల్ మీడియాలో ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేయాలని చూస్తున్నరు. వాటిని నమ్మొద్దు. ఈటల రాజేందర్ మొసలి కన్నీళ్లకు మోసపోతే గోసపడుతం. – మంత్రి హరీశ్‌రావు
పనిచేసేవాళ్లకు పట్టంగట్టాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ప్రచారంలో చివరి రోజు ఆయన జమ్మికుంట, బిజిగిరిషరీఫ్లో ఏర్పాటుచేసిన ధూంధాంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్, బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, కోరుకంటి చందర్, సైదిరెడ్డి, కిశోర్, పాడి కౌశిక్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఆయాచోట్ల మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెల్లు శ్రీనివాస్ గెలు ఖాయమైందనీ, 25వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తున్నట్లు సర్వేలు అందాయని చెప్పారు. సీఎం కేసీఆర్ వస్తే వార్ వన్‌సైడ్ అవుతుందని భయపడి.. బీజేపీ నాయకులు సభను ఆపించారన్న మండిపడ్డారు. గెల్లు గెలిచిన రెండు వారాల తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూరాబాద్‌కు స్వయంగా వచ్చి మెడికల్ కళాశాలపై ప్రకటన చేస్తారని చెప్పారు. అదే విధంగా హుజూరాబాద్‌కు వరాల జల్లును కురిపిస్తాడని చెప్పారు. నాగార్జునసాగర్‌లో నోముల భగత్ గెలువగానే ఇచ్చిన మాట ప్రకారం నాగార్జునసాగర్‌కు వెళ్లి అక్కడ అంతకుముందు ఇచ్చిన హామీలైన నీటి లిఫ్టులను, ఇతర అభివృద్ధి పథకాలను మంజూరు చేసి వచ్చారని గుర్తు చేశారు. జమ్మికుంట ఆర్థికాభివృద్ధికి ఆటంకంగా ఉన్న రైల్వే బ్రిడ్జిని ప్రజల కోరిక మేరకు తీసేసి మరొకటి కట్టించే బాధ్యత తనదేనని పునరుద్ఘాటించారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఈ రోజు అభివృద్ధిలో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందంటే దానికి కారణం కారు గుర్తే.
కానీ బీజేపీకి ఎందుకు ఓటెయ్యాల్నో ఒక్క కారణం చెప్పున్రి. గ్యాస్ ధరలను రూ.వెయ్యి చేసినందుకా? ఎన్నికలు అయిపోగానే మరో 200 రుపాయలు పెంచడానికా? పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నందుకు మీకు ఓటెయ్యాల్నా? అని సూటిగా ప్రశ్నించారు. సూటిగా మాట్లాడే దమ్ములేక చాటుగా అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నావంటూ ఈటలను విమర్శించారు. వడ్లు కొనమని మొన్నటిదాక అసత్య ప్రచారం మొదలుపెట్టిన్లు, ఇప్పుడు అన్ని ఊళ్లల్లో కాంటాలు అయితాంటె మళ్లీ యాసంగిలో వరి వెయ్యద్దని అంటున్నమని కొత్తగా ప్రచారం చేస్తున్నరని మండిపడ్డారు. ఇయ్యాల పొద్దుగాలనే జిల్లా కలెక్టర్ ప్రకటన చేసిండు, యాసంగిలో వరి వేసుకోవచ్చని, ఇక్కడ విత్తన వరి పెద్ద మొత్తంలో పండుతదని వరి వేసుకోవచ్చని హామీ ఇచ్చారని చెప్పారు. నియోజకవర్గంలో మహిళల కోసం రూ.25 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని చెప్పారు. గ్యాస్ ధరల పెంపుతో ఉజ్వల పథకం అటకెక్కిందన్నారు. ఈటలతో వచ్చేది, పోయేది ఏమీలేదన్న హరీశ్ గెల్లు సీను గెలుపు సీను అయ్యాడన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడుతున్న టీఆర్ఎస్కు అండగా నిలిచి ఈ నెల 30న కారు గుర్తుకు ఓటేసి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచులు సదయ్య, స్వాతి, సుజాత, శ్రీరాం శ్యాం, సీనియర్ నాయకుడు ముద్దసాని కశ్యప్‌రెడ్డి, ఎంపీటీసీ రాజయ్య, వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, నాయకులు వాసుదేవరెడ్డి, యుగేందర్‌రెడ్డి, దేవేందర్‌రావు, భరత్‌కుమార్, లత, సమీర్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.