జగిత్యాల రూరల్, అక్టోబర్ 27: రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో 25అడుగుల హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరుగగా ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ, కొండగట్టు, ధర్మపురి, వేములవాడ, యాదాద్రి ఆలయాలకు ప్రభుత్వం నిధులు కేటాయించిందని గుర్తుచేశారు. లక్ష్మీపూర్ వేంకటేశ్వర ఆలయానికి కూడా నిధులు మంజూరుకు వినతి పత్రాన్ని అందజేశారని, తన వంతుగా నిధుల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆలయంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం గ్రామానికి చెందిన దళిత యువకుడు నక్క హరీశ్ పిడుగుపాటుకు గురై మరణించగా ఆపద్భందు పథకం ద్వారా మంజూరైన రూ.6లక్షల విలువ గల ప్రొసీడింగ్ కాపీని మృతుడి తండ్రి లింగన్నకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అందజేశారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ హనుమంతుడికి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్, ఏఎంసీ చైర్మన్ దామోదర్ రావు, ఆర్బీఎస్ మండల కన్వీనర్ రవీందర్ రెడ్డి, ప్యాక్స్ చైర్మన్ సందీప్ రావు, ఆత్మ చైర్మన్ రాజిరెడ్డి, సర్పంచ్ చెరుకు జాన్, ఎంపీటీసీ సునీత, లక్ష్మణ్, గ్రామశాఖ అధ్యక్షుడు నగేశ్ గౌడ్, వీడీసీ చైర్మన్ స్వామిరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్యాక్స్, ఏఎంసీ డైరెక్టర్లు, నాయకులు పాల్గొన్నారు.