ఓదెల, ఆగస్టు 27: జిల్లాలోని ప్రభుత్వ విద్యాలయాలు ప్రారంభించేందుకు చర్యలు ముమ్మరంగా చేపడుతున్నారు. బడులలోని పరిసరాలు పరిశుభ్రం చేయిస్తూ, వసతులు కల్పిస్తున్నారు. హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నారు.
సమస్యల పరిష్కారం
పాఠశాలల్లో ఉన్న సమస్యలు పరిష్కారమవుతున్నాయి. కరోనా వైరస్ కారణంగా దాదాపుగా 18 నెలల పాటు మూసి ఉన్న విద్యాలయాల్లో ప్రత్యక్ష బోధనకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. అలాగే పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించేందుకు ఇటీవల మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, దయాకర్‌రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు ఇచ్చారు. పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించే బాధ్యతను గ్రామపంచాయతీలకు అప్పగించారు. దీంతో సర్పంచులు, జీపీ పాలకవర్గాలు కృషి చేస్తున్నాయి. ఓదెల మోడల్ స్కూల్ ఆవరణలో తుమ్మ చెట్లు, గడ్డిని సర్పంచ్ ఉదయాదేవి, కార్యదర్శి రాజేందర్ ఆధ్వర్యంలో తొలగింపజేసి శుభ్రం చేయించారు. ఎక్స్కవేటర్, ఫ్రంట్ బ్లెడ్ ట్రాక్టర్ పెట్టించి చదును, శుభ్రం చేసే పనులు కొనసాగుతున్నాయి. మండలంలో డీఈవో జగన్మోహన్రెడ్డి, జడ్పీ డిప్యూటీ సీఈవో గీత పాఠశాలలను సందర్శించారు.
ఈ నెల 30వ తేదీ దాకా పాఠశాలలో ప్రత్యక్ష బోధన జరిగే విధంగా సిద్ధంగా ఉంచాలని జడ్పీ డిప్యూటీ సీఈవో, మండల ప్రత్యేకాధికారి గీత కోరారు. శుక్రవారం గోపరపల్లి, కొలనూర్, నాంసానిపల్లి, ఓదెలలో పర్యటించి పాఠశాలలను పరిశీలించారు. ఇక్కడ ఎంపీడీవో సత్తయ్య, ఎం పీవో వాజిద్, సర్పంచులు కర్క మల్లారెడ్డి, సామ మణెమ్మ, మాజీ వైస్ ఎంపీపీ రాజుగౌడ్ ఉన్నారు.
కాల్వశ్రీరాంపూర్, ఆగస్టు 27: ప్రభుత్వ పాఠశాలలను సిద్ధం చేయాలని ఎంపీపీ నూనేటి సంపత్, జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి ఉపాధ్యాయులు, సిబ్బందిని ఆదేశించారు. కాల్వశ్రీరాంపూర్ హైస్కూల్, కస్తూర్బా పాఠశాల, మల్యాల మోడల్ స్కూల్‌తోపాటు పలు ప్రభుత్వ పాఠశాలలను శుక్రవారం వారు సందర్శించారు. కార్యక్రమంలో డీఏవో తిరుమల్‌ప్రసాద్, ఎంపీడీవో రాంమోహనాచారి, ఎంపీవో గోవర్ధన్, సర్పంచులు ఆడెపు శ్రీదేవి, లంక రాజేశ్వరి, ఉపాధ్యాయ పాల్గొన్నారు.
విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం
పాలకుర్తి, ఆగస్టు 27: విద్యాలయాల ప్రారంభంపై మారేడుపల్లిలో తల్లిదండ్రుల అభిప్రాయం కోసం సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ పాఠశాలలు ప్రారంభించనుండడంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ పిల్లలు పాఠశాలకు హాజరుకావాలని నిర్ణయించారు. జిల్లా సెక్టోరియల్ అధికారి జగదీశ్వర్ పాఠశాల ప్రారంభంపై తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా వైద్యసిబ్బంది అందుబాటులో ఉన్న విద్యార్థులకు నులి పురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ గంధం లక్ష్మీనారాయణ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సీహెచ్ వెంకటేశం, ఎస్ఎంసీ చైర్మన్ రఘుపతిరెడ్డి, చంద్రయ్య, లచ్చయ్య పాల్గొన్నారు.
పనుల పరిశీలన
జూలపల్లి, ఆగస్టు 27: పలు పాఠశాలల ఆవరణలో ముళ్ల పొదలు, చెత్తా చెదారం తొలగించి శుభ్రం చేయించారు. అబ్బాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తాగునీటి సరఫరా మరమ్మతు పనులను ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి పరిశీలించారు. ఇక్కడ సర్పంచ్ ఈర్ల మల్లేశం, ఎంపీటీసీ వెంకటేశం, మండల ప్రత్యేకాధికారి రంగారెడ్డి, ఎంపీడీవో వేణుగోపాల్‌రావు, ఎంపీవో రమేశ్, ఏఈ సువిశాల, పంచాయతీ కార్యదర్శి అర్చన పాల్గొన్నారు.
కొవిడ్ నియంత్రణ చర్యలు
రామగిరి, ఆగస్టు 27 : అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో శానిటైజేషన్ చేసి కొవిడ్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని ఎంపీపీ ఆరెల్లి దేవక్క తెలిపారు. ఈ మేరకు ఎంపీపీ మండల ప్రత్యేకాధికారి హరినాథ్ బుధవారంపేట, రత్నాపూర్, పన్నూర్‌లోని పాఠశాలలను పరిశీలించారు. మండలంలోని 26 ప్రభుత్వ విద్యాలయాల్లో చెత్తాచెదారం తొలగించి, శుభ్రం చేయిస్తున్నామని వివరించారు. కార్యక్రమాల్లో ఎంపీడీవో విజయకుమార్, వైస్ ఎంపీపీ కాపురబోయిన శ్రీదేవి, సర్పంచులు అల్లం పద్మ, బుర్ర పద్మ, పల్లె ప్రతిమ, దేవునూరి రజిత, పద్మ తదితరులు పాల్గొన్నారు.
జ్యోతినగర్(రామగుండం), ఆగస్టు 27: అంతర్గాం మండలంలోని పలు పాఠశాలల్లో శానిటేషన్ పనులను డీఆర్డీవో శ్రీధర్ పరిశీలించారు. ఇక్కడ డీఎల్పీవో దేవకీదేవి, ఎంపీడీవో యాదగిరి నాయక్, ఎంపీవో ఉన్నారు.
పరిశుభ్రం చేయండి
ఎలిగేడు, ఆగస్టు 27: పాఠశాలల ఆవరణలో చెత్తాచెదారం తొలగించాలని, గదులను పరిశుభ్రం చేయాలని ఎలిగేడు ఎంపీపీ తానిపర్తి స్రవంతి సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆమె సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఈ నెల 30వ తేదీ వరకు అన్ని పాఠశాలల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. గదుల ఆవరణలో నిలువ ఉన్న నీటిని పూర్తిగా తొలగించాలని, హైపోక్లోరైట్ పిచికారి చేయించాలని వివరించారు. తాగునీటి ట్యాంకులను శుభ్రపరచాలని సూచించారు. సమావేశంలో ఎంపీడీవో శ్రీనివాసమూర్తి, ఎంఈవో కవిత, మెడికల్ ఆఫీసర్ నిస్సీక్రిస్టీనా, ఏఈ యశశ్రీ, ఐసీడీఎస్ సూపర్వైజర్ సూర్యకళ, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పంచాయతీల కార్యదర్శులు పాల్గొన్నారు.