ఓటమి భయంతో ఈటల ఏదేదో మాట్లాడుతున్నడు
మంత్రిగా చేయకుండా.. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఏం చేస్తడు
దేశాయిపల్లిలో ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు
టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరు
వీణవంక వైస్‌ఎంపీపీ సహా 100 మంది చేరిక
‘గెల్లు’ ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపు
వీణవంక, ఆగస్టు 26: ఆనాడు కేసీఆర్ ప్రజల కోసం రాజీనామా చేసిండు. మరి ఈటల రాజీనామా ఎందుకు చేసిండు. మళ్లీ ఓట్ల కోసం ఎందుకు వస్తున్నడు. మంత్రిగా ఏం చేయకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఏం చేస్తడు? వ్యవస్థను కూలదోసే వాళ్లవైపు ఉండాలో.. నిర్మించే వాళ్ల వైపు ఉండాలో ప్రజలే ఆలోచించుకోవాలి. ఈటలకు రైతుల పట్ల ప్రేముంటే యాసంగిలో పండించే దొడ్డువడ్లను కేంద్రం కొనేలా ఒప్పించాలి
బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు ఓటమి భయం పట్టుకున్నదని, కొద్దిరోజులుగా ఏదేదో పిచ్చి ప్రేలాపణలు చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. పలు ప్రాంతాల టీఆర్ఎస్ నాయకులు హుజూరాబాద్ నియోజకవర్గానికి వచ్చి ప్రజలకు సేవ చేస్తుంటే.. తోడేళ్లు.. నక్కలు అని మాట్లాడుతున్నాడని, మరీ బీజేపీ నేతలు జితేందర్‌రెడ్డి, వివేక్, ఏనుగు రవీందర్‌రెడ్డి ఎక్కడి వాళ్లో చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు ఈ మధ్య ఏవేవో యాత్రలు చేస్తున్నారని, అసలు ఇక్కడ కాదని తెలంగాణకు రావాల్సిన నిధులు.. నల్ల చట్టాల రద్దు, ధరల తగ్గింపు కోసం ఢిల్లీకి మోకాళ్ల యాత్ర చేయాలని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు సూచించారు. బీజేపీ ప్రభుత్వంతో అచ్చేదిన్ కాదని.. సచ్చేదిన్ వచ్చిందని దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం అన్నింటినీ అమ్మకానికి పెట్టిందని, ఏం చెప్పి ఓట్లు అడిగేందుకు వస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం వీణవంక మండలం దేశాయిపల్లి పీఎస్కే గార్డెన్లో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రానున్న హుజూరాబాద్ ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్‌యాదవ్ గెలుపు ఖాయమని, భారీ మెజార్టీకి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. గెల్లు శ్రీనివాస్ పేదోడయినా పని చేసే నాయకుడని, ఈటల గెలిస్తే ఏం చేస్తాడో చెప్పాలన్నారు. ఆయన గోడ గడియారాలు, కుట్టుమిషన్లు, గ్రైండర్లను నమ్ముకుంటే టీఆర్ఎస్ అభివృద్ధిని నమ్ముకుందని తెలిపారు.
సీఎం కేసీఆర్ ప్రజల బాధలను తన బాధగా భావిస్తోంటే.. ఈటల మాత్రం తన బాధను ప్రజల బాధగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. హుజూరాబాద్‌కు మీరు కూడా వెయ్యి కోట్లు తెచ్చి ఓట్లు అడుగాలని, బీజేపీ చేసిన మంచి పనేంటో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు డిపాజిట్ కూడా రాదని, రానున్న ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్కు మధ్య పోటీ ఉంటుందన్నారు. రైతులను బాగు చేసిన టీఆర్ఎస్కు ఓటేద్దామా..రైతు నడ్డి విరిచిన బీజేపీకి ఓటేద్దామా ప్రజలు ఆలోచించాలని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గ్రామ సమన్వయ కమిటీ సభ్యులు, కార్యకర్తలు గడపగడపకూ తీసుకెళ్లాలని, అందరూ కలిసి టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవడానికి కృషి చేయాలని కోరారు. అనంతరం వీణవంక వైస్‌ఎంపీపీ రాయిశెట్టి లత-శ్రీనివాస్, ఆయా గ్రామాలకు చెందిన మరో 100 మంది బీజేపీ నుంచి టీఆర్ఎస్లో చేరగా, హరీశ్‌రావు కండువాకప్పి ఆహ్వానించారు. ఇక్కడ ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జడ్పీచైర్మన్ విజయ, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, పాడి కౌశిక్‌రెడ్డి, ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, జడ్పీటీసీ మాడ వనమాల-సాదవరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, సీనియర్ నాయకులు పరిపాటి రవీందర్‌రెడ్డి, ముద్దసాని కశ్యప్‌రెడ్డి, సర్పంచ్ల, ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు మ్యాకల ఎల్లారెడ్డి, గెల్లు శ్రీనివాస్, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
సింగాపూర్‌లో మరో మంది చేరిక
హుజూరాబాద్ రూరల్, అగస్టు26: హుజూరాబాద్ మండలంలోని సింగాపూర్ గెస్ట్‌హౌస్‌లో టీఆర్ఎస్ యువ నాయకుడు వొడితల ప్రణవ్‌బాబు ఆధ్వర్యంలో బీజేపీ మండల కార్యదర్శి దేవేందర్‌రెడ్డితో పాటు తుమ్మనపల్లికి చెందిన 100 మంది యువకులు గురువారం టీఆర్ఎస్లో చేరారు. వీరికి మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. హుజూరాబాద్‌లో గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు ఖాయమైందని, మెజార్టీయే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఐటీ కంపనీలు తీసుకువచ్చామని, యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో యువకులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు పాడి కౌశిక్‌రెడ్డి, ఇంద్రనీయల్, సంగెం ఐలన్న, సర్పంచ్ ప్రతాప్‌రెడ్డి, సింగిల్ విండో మాజీ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, ఉప సర్పంచ్ బేతి రాజిరెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్లు భగవాన్‌రెడ్డి, సామ సుధాకర్‌రెడ్డి ఉన్నారు.
ఈటల అక్రమాల పుట్ట: టీఆర్ఎస్ నాయకుడు పాడి కౌశిక్‌రెడ్డి
వీణవంక రూరల్: ఈటల రాజేందర్ అక్రమాల పుట్ట అని, తన అక్రమ సంపాదన కాపాడుకోవడానికి బీజేపీలో చేరాడని టీఆర్ఎస్ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఈటలకు దమ్ము, ధైర్యం ఉంటే హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో చర్చకు రావాలని, అక్కడికి తాను, గెల్లు శ్రీనివాస్‌యాదవ్ వస్తామని సవాల్ విసిరారు. “తేదీ సమయం చెబితే మేమే వస్తామని, నీ అక్రమాల గుట్టు విప్పుతామని స్పష్టం చేశారు. ఒకవేళ నిరూపించకుంటే రాజకీయాల నుంచే తప్పుకుంటామని సవాల్ చేశారు. కోడిగుడ్ల వ్యాపారంతో ఆస్తులు సంపాందించానని ఈటల చెబుతున్నారని, మరి ఇతర వ్యాపారులు ఆర్థికంగా ఎందుకు ఎదగలేకపోతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈటల రాజేందర్ కేవలం ఆస్తులు కాపాడుకునేందుకే బీజేపీలో చేరాడని ఆరోపించారు. మంత్రి హరీశ్‌రావు సహకారంతో ఎమ్మెల్యేగా గెల్లు శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్సీగా తాను కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని, లేదంటే 2023 ఎన్నికల్లో ఓట్లు అడుగబోమని వాగ్దానం చేశారు.
నిండు మనసుతో ఆశీర్వదించండి : గెల్లు శ్రీనివాస్
ఉద్యమాన్ని నమ్ముకొని పోరాటాలు చేశానే తప్ప మోసాలు చేయడం తెలియదు. నిరుపేద కుటుంబంలో పుట్టి మీ ముందు పెరిగిన బిడ్డను. నన్ను నిండు మనస్సుతో ఆశీర్వదించాలి’ అని హుజూరాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కోరారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని నిలబడ్డానే తప్ప ఉద్యమాన్ని విడువలేదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ బాటలో నడిచానని, తన సేవలు గుర్తించే హుజూరాబాద్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారని చెప్పారు.
ఈటల కాళ్లు మొక్కినా పనిచేయలే..
ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చిన. మా గ్రామంలో దవాఖానలో పోస్టుమార్టం రూం లేదు. దవాఖానను అభివృద్ధి చేయాలని, పోస్టుమార్టం రూం కావాలని ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటలను ఎన్నోసార్లు అడిగినం. ఓ సారి కాళ్లు కూడా మొక్కినం. కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. చివరికి ఆయనతోపాటే బీజేపీలో చేరినం. తర్వాత ఆలోచించినం. పనిచేసే ప్రభుత్వంతోనే ఉండాలనుకున్నం. అందుకే ఈ రోజు టీఆర్ఎస్లో చేరిన. కానీ ఇప్పుడు అడుగంగనే పోస్టుమార్టం రూంతోపాటు 24 గంటలపాటు దవాఖాన నడిచేలా మంత్రి హరీశ్‌రావు వైద్యశాఖ నుంచి ఆర్డర్లు ఇప్పిచ్చిండు. చానా సంతోషంగా ఉంది.
కేసీఆర్ పథకాలు నచ్చాయి..
రాష్ట్ర సర్కారు అభివృద్ధి, సంక్షేమ పథకాలు నచ్చినయ్. మా లాంటి పేదల కోసం కల్యాణ లక్ష్మితోపాటు అనేక పథకాలు అమలు చేస్తున్నరు. ఇంటింటికీ ఏదో ఒక రకంగా మేలు జరుగుతుంది. పనిచేసే ప్రభుత్వానికి అండగా ఉండాలని టీఆర్ఎస్లో చేరిన. నా వంతు ప్రచారం చేసి టీఆర్ఎస్ను గెలిపించాలని అనుకున్న. ఈ రోజు హరీశ్ రావు సమక్షంలో కండువా కప్పుకున్న. గెల్లు శ్రీనివాస్ విజయానికి శ్రమిస్తా.
అభివృద్ధిలో భాగస్వామినవుతా..
గ్రామాల అభివృద్ధిలో భాగస్వామిని కావాలనే టీఆర్ఎస్లో చేరిన. గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినయి కానీ కేసీఆర్ సర్కారులా పనిచేయలే. పథకాలు ఇవ్వలే. నేను కూడా రైతు బంధుతో లబ్ధి పొందుతున్న. టీఆర్ఎస్లో చేరి నా వంతు గ్రామాభివృద్ధిలో పాలుపంచుకోవాలని అనుకున్న. హరీశ్‌రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన. ప్రభుత్వ పథకాలపై ఊరూరా ప్రచారం చేస్తా.
-రాజిరెడ్డి గంగరాం