దళితవాడలోని ప్రతి ఇంటికీ వెళ్లాలి
ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్ డాటా సేకరించాలి
వెంటనే లబ్ధిదారులకు బ్యాంకు ఖాతా తెరువాలి
అధికారులకు కలెక్టర్ కర్ణన్ ఆదేశం
దళితబంధు సర్వే నిర్వహణపై సమీక్షా సమావేశం
కరీంనగర్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) :సర్వే బృందాలు అంకితభావంతో పనిచేయాలి. నేటి ఉదయం 9.30 గంటలకు సర్వే ప్రారంభించాలి. క్లస్టర్ ఆఫీసర్, స్పెషల్ ఆఫీసర్, సహాయ సిబ్బంది దళితవాడల్లోని ఇంటింటికి వెళ్లాలి. ఆన్లైన్ డాటాతోపాటు ఆఫ్‌లైన్ డాటా కూడా సేకరించాలి. ఆ వివరాలను దళితబంధు యాప్‌లో నమోదు చేయాలి. బ్యాంకు అధికారులు కూడా సర్వేలో పాల్గొనాలి. లబ్ధిదారులకు కొత్తగా తెలంగాణ దళిత బంధు బ్యాంక్ ఖాతాను తెరువాలి.
హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితవాడల్లో నేటి నుంచి దళితబంధు ఇంటింటి సర్వేను అంకితభావంతో పారదర్శకంగా.. పకడ్బందీగా చేయాలని, ఓపిక, సేవాభావంతో వివరాలను సేకరించి విజయవంతం చేయాలని అధికారులు, సిబ్బందిని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో క్లస్టర్ ఆఫీసర్లు, స్పెషల్ ఆఫీసర్లు, బ్యాంకర్లు, సహాయ సిబ్బందితో దళితబంధు సర్వే నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సాయంత్రం క్లస్టర్ ఆఫీసర్లు, స్పెషల్ ఆఫీసర్లకు శుక్రవారం నుంచి హుజూరాబాద్ నియోజకవర్గంలో ‘దళితబంధు సర్వే ఎలా చేయాలి’ అనే విధానంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దళితబంధు ఒక చారిత్రాత్మకమైన కార్యక్రమమని, ప్రపంచంలో, దేశంలో ఎకడా ఇలాంటి పథకం లాంటి పథకం లేదని చెప్పారు. ఈ పథకం కింద ప్రతి దళిత కుటుంబానికీ 10 లక్షల సాయం అందుతుందని, దీంతో దళితులు ఆర్థికంగా, సామాజికంగా ఎంతో అభివృద్ధి సాధిస్తారన్నారు. ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం అమలు చేస్తున్నదని, దీనిని విజయవంతం చేయాలని సూచించారు. సర్వేపై మండలానికో రాష్ట్ర స్థాయి అధికారిని పర్యవేక్షకులుగా ప్రభుత్వం నియమించిందని, వీరు ప్రతి రోజు గ్రామాల్లో పర్యటిస్తూ సర్వేను పర్యవేక్షిస్తారని తెలిపారు.
సర్వే వివరాలను దళితబంధు యాప్‌లో నమోదు చేయాలన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు ఇంటింటి సర్వే పకడ్బందీగా చేయాలని సూచించారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్ ప్రొఫార్మాలో వివరాలు ఎలా పూరించాలో తెలిపారు. సర్వే బృందాలు గ్రామంలో దళితవాడలో ఇంటింటికీ వెళ్లి వారితో మమేకమై వివరాలు సేకరించాలని ఆదేశించారు. ఆన్లైన్ వివరాలలో మార్పులు చేర్పులు ఉంటే ఆఫ్‌లైన్ ప్రొఫార్మాలో కుటుంబ వివరాలు పూరించాలని తెలిపారు. ప్రజాప్రతినిధుల సమక్షంలో ఇంటింటి సర్వే చేసి, దళితబంధు లబ్ధిదారుల వివరాలు గ్రామాలో ప్రదర్శించాలని, గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు శ్యాం ప్రసాద్‌లాల్, గరీమా అగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, జడ్పీ సీఈవో ప్రియాంక, రాష్ట్ర స్థాయి అధికారులు, కరీంనగర్, హుజూరాబాద్ ఆర్డీవోలు, ఆనంద్‌కుమార్, రవీందర్‌రెడ్డి, పాల్గొన్నారు.