పార్టీ మీటింగులకు గవర్నర్ ఎలా వస్తరు..?
గొర్రె ల పెంపకందారుల సంఘం మాజీ చైర్మన్ కన్నెబోయిన రాజయ్యయాదవ్
హుజూరాబాద్, ఆగస్టు 26: రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ మీటింగ్‌లకు ఎలా హాజరవుతారని గొర్రెల పెంపకందారుల సంఘం మాజీ చైర్మన్ కన్నెబోయిన రాజయ్యయాదవ్ ఆ పార్టీ నాయకులను ప్రశ్నించారు. బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నదని మండిపడ్డారు. గురువారం జమ్మికుంటలో బీజేపీ నిర్వహించిన గొల్లకుర్మల సమావేశానికి దత్తాత్రేయ హాజరుకావడంపై రాజయ్య యాదవ్ స్పందించారు. హుజూరాబాద్ టీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మొదట గొల్ల, కుర్మల సమస్యల పరిష్కారానికి కృషిచేసిన ఆయన, కేంద్రమంత్రి అయ్యాక పూర్తిగా మరిచిపోయారన్నారు. దత్తాత్రేయ గవర్నర్ అయినందుకు పార్టీలకతీతంగా సంతోషించామని, కానీ ఆయన తమను పట్టించుకోలేదన్నారు. దత్తాత్రేయకు ఏరోజు యాదికి రాని యాదవకులం ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. యాదవకులస్తుడికి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెటు ఇచ్చినందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పే సమయంలో దత్తాత్రేయ వచ్చి మీటింగ్‌లో పాల్గొనడం క్షమించరానిదన్నారు. ఒక రకంగా చెప్పాలంటే అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లేనని పేర్కొన్నారు. ఆయన ఒక రాజకీయనాయకుడు కాదని, గవర్నర్ అంటే పార్టీలకు అతీతంగా ఉండాలన్నారు. ఓట్ల కోసం బీజేపీ నాయకులు గవర్నర్‌ను తీసుకువచ్చి ప్రచారం చేయడం చాలా సిగ్గుచేటని అభివర్ణించారు. నియోజకవర్గంలోని గొల్లకుర్మలు అందరూ ఐక్యంగా ఉండి టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను గెలిపించాలని సూచించారు. ఇక్కడ నాయకులు బద్దుల రాజుకుమార్, కన్నెబోయిన శ్రీనివాస్, గోవిందుల భాస్కర్, మూడెత్తుల మల్లేశ్, మక్కపెల్లి కుమార్, శ్రీహరి ఉన్నారు.