నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి ఉంటా
చచ్చేదాకా కేసీఆర్ వెంటే నడుస్తా
ఈటల తిన్నింటి వాసాలు లెక్కబెట్టే రకం
అందలం ఎక్కిస్తే వెన్నుపోటు పొడిచిండు
అభివృద్ధిని విస్మరించిండు
చెన్నూర్ ఎమ్మెల్యే, విప్ బాల్క సుమన్
హుజూరాబాద్‌లో సోషల్ మీడియా వారియర్స్‌కు అవగాహన
హుజూరాబాద్/టౌన్, జూన్ 26: బీజేపీ నాయకులు తనను బానిస అంటున్నారని, అయితే నేను తెలంగాణ ప్రజలు, టీఆర్ఎస్ పార్టీకి కట్టు బానిసను అని చెన్నూర్ ఎమ్మెల్యే, విప్ బాల్క సుమన్ తేల్చిచెప్పారు. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉంటానని, చచ్చేవరకు కేసీఆర్ వెంటనే నడుస్తానన్న సుమన్, ఈటల మాదిరిగా తిన్నింటి వాసాలు లెక్కపెట్టే రకం కాదని మండిపడ్డారు. ఈటల ఆత్మగౌరవం కోసం కాదని ఆస్తుల కోసం పోరాటం చేస్తున్నారనే విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. శనివారం హుజూరాబాద్ పట్టణంలోని బీఎస్సార్ గార్డెన్లో హుజూరాబాద్ మండలం టీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ అవగాహన సదస్సులో మాట్లాడారు. 2001 నుంచి మా కుటుంబం టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ వెంట నడుస్తున్నదని, పూటకో పార్టీ మార్చే వాళ్లు నాకు నీతులు చెబుతారా..? అంటూ బీజేపీపై మండిపడ్డారు. ఈటల రాజేందర్ ఆత్మభిమానాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టాడని, ఢిల్లీ దొరల దగ్గర మొకరిల్లాడని ఎద్దేవా చేశారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న బీజేపీలో చేరిన బడుగు బలహీన వర్గాలకు తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. పేదల నడ్డివిరుస్తున్న బీజేపీలోకి చేరితే ఆ సిద్ధాంతాలను సమర్థించినట్లే కదా అని మండిపడ్డారు. ఇన్ని రోజులు మాట్లాడిన దానికి, చేసినదానికి పోలిక పొంతన ఏమైనా ఉందా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్‌తోనే రాష్ర్టానికి శ్రీరామరక్ష
స్వీయ రాజకీయ అస్థిత్వమే శ్రీరామరక్ష అన్న ప్రొఫెసర్ జయశంకర్ మాటలను సీఎం కేసీఆర్ నిజం చేస్తూ నేడు రాష్ర్టానికి శ్రీరామరక్షగా నిలిచాడని కొనియాడారు. ప్రపంచమే గర్వించదగ్గ కాళేశ్వరం ప్రాజెక్టు న భూతో న భవిష్యత్ అన్న చందంగా అనతి కాలంలోనే నిర్మించి ఘనత సాధించారన్నారు. మేధావులు మెచ్చిన రైతు బంధు పథకంతో పాటు కల్యాణలక్ష్మి, ఆసరా, ఇతరత్రా సంక్షేమ పథకాలను విమర్శించిన ఈటల పేదల వైపు ఉన్నట్లా లేనట్లా తేల్చాలని సూచించారు. హుజూరాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్కు కంచుకోట అని, నాడు, నేడు ఎప్పుడైనా గులాబీదే విజయమని, కేసీఆర్ నాయకత్వాన్ని ఇక్కడి ప్రజలు సమర్థిస్తారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గులాబీ జెండాను ఎగురవేసి కేసీఆర్‌కు కానుకగా అందజేస్తామని దీమా వ్యక్తం చేశారు.
ఉత్సాహంగా పని చేయాలి
టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ రాష్ట్ర ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం మొక్కవోని దీక్షతో పని చేస్తుందని, వచ్చే ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం సోషల్ మీడియా వారియర్స్ ఉత్సాహంగా పనిచేయాలని సూచించారు. అభ్యర్థుల గెలుపోటముల్లో సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషిస్తుందని, ప్రతిపక్ష పార్టీల పోస్టింగ్‌లను తిప్పికొట్డడంలో ముందుండాలన్నారు. అంది వచ్చిన అవకాశాలను తప్పనిసరిగా వినియోగించుకొని ప్రతిపక్ష పార్టీలకు దిమ్మ తిరిగిపోయే కంటెంట్‌ను పోస్ట్ చేయాలని సూచించారు. ఇందుకు తప్పనిసరిగా తమవంతు కృషి ఉంటుందని, కాషాయం దళం చేస్తున్న దుర్మార్గపు, అబద్దపు ప్రచారాన్ని తిప్పికొట్టి నియోజకవర్గంలో టీఆర్ఎస్ సత్తా ఏమిటో నిరూపించాలని పిలుపునిచ్చారు.
ముసిముసి నవ్వావు.. ఎందుకు ఖండించలేదు
కోళ్ల ఫారం నడుపుకొంటున్న ఈటలను సీఎం కేసీఆర్ దగ్గరకు తీసి అందలం ఎక్కిస్తే ఆయనకే వెన్నుపోటు పొడువాలని కుట్రలు చేసిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో ఎందరో నాయకులను కాదని కమలాపూర్ టికెట్ ఇచ్చి గెలిపించింది వాస్తవం కదా అని ప్రశ్నించారు. సొంత తమ్ముడిలా దగ్గరికి తీసి నమ్మకం కొద్ది రెండు సార్లు మంత్రి పదవులు కట్టబెట్టిన కేసీఆర్‌ను నియంత అని, దొరల పాలన అని నోటికి ఎంత వస్తే అంతా మాట్లాడడం తగునా అని మండిపడ్డారు. నియోజకవర్గాల పునర్విభజనలో హుజూరాబాద్ నియోజకవర్గంలో అప్పటికే బలంగా ఉన్న కెప్టెన్ లక్ష్మీకాంతారావును పక్కనబెట్టి టికెట్ ఇస్తే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన విధంగా కేసీఆర్‌ను విమర్శించడం ఎంత వరకు సమంజసమని మండిపడ్డారు. ఇవన్ని పక్కకు పెడితే ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎంపీలు బండి సంజయ్, రేవంత్‌రెడ్డి, ఇతరత్రా నాయకులు ఈటల సీఎం అయ్యే అర్హత ఉందని వ్యాఖ్యలు చేస్తుంటే ముసిముసి నవ్వులు నవ్వినావే తప్ప ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. మనసులో దురుద్దేశం ఉంది కనుకనే కేసీఆర్ పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను విమర్శించావని మండిపడ్డారు.
అంత అహంకారమా..?
బీజేపీ వాళ్లు డబ్బు సంచులతో వస్తారని, గతంలోనే ఈటల ఆయనకు 200 ఎకరాలు హైదరాబాద్‌లో ఉన్నాయని, వాటిలో ఒక ఎకరం అమ్మితే చాలు ఎన్నికల్లో ఖర్చు పెట్టి అవలీలగా గెలుస్తానని, డబ్బు అహంకారంతో మాట్లాడిన సంగతి గుర్తు చేశారు. బీజేపీ వాళ్లు పగటి వేషగాళ్లని, పార్టీలు మార్చే ద్రోహులు అని విమర్శించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక అయ్యేవరకు ఇకడే ఉంటా.. యూత్, విద్యార్థి, సోషల్ మీడియా సమన్వయ కర్తగా పని చేసి ఉప ఎన్నికల్లో గెలిచేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. సమావేశంలో నాయకులు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, గెల్లు శ్రీనివాస్, బండ శ్రీనివాస్, కొలిపాక శ్రీనివాస్ తదితరులున్నారు.
బీజేపీ నేతలకు సంస్కారం లేదు: బాల సుమన్
బీజేపీ నేతలకు సంస్కారం లేదని, భారత రాజ్యాంగాన్ని రచించి దేశంలోని బడుగు బలహీన వర్గాలకు దారి చూపిన భారతరత్న అంబేదర్ ఆశయాలకు బీజేపీ తూట్లు పొడుస్తున్నదని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల సుమన్ మండిపడ్డారు. శనివారం పట్టణంలోని అంబేదర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ దేశానికి జాతికి ప్రయోజనాలు కల్పించిన మహానీయులను గౌరవించుకోవడం భారతీయులుగా మనందరి కర్తవ్యమని, కానీ బీజేపీ మహనీయుల పట్ల అవమానకరంగా ప్రవర్తించడం ఆ పార్టీ నాయకుల సంసారానికి నిదర్శనమన్నారు. బీజేపీ తుచ్చ పద్ధతులను మానుకోకపోతే దళిత జాతి ఉద్యమం చేస్తుందని చెప్పారు. ఈ విషయంలో దళిత నాయకులకు దళిత బిడ్డగా దళిత ఎమ్మెల్యేగా అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఇక్కడ హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గంధె రాదిక, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్, పార్టీ పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, దళిత నాయకులు, ప్రజాప్రతినిధులు పాక సతీశ్, సందమల్ల బాబు, కొండ్ర నరేశ్, మారపెల్లి సుశీల, తొగరి సదానందం, లావణ్య, కే రమాదేవి, తాళ్లపెల్లి శ్రీనివాస్, ఆవాల హరిబాబు, రియాజ్, రాకేశ్ ఉన్నారు.