టీకాల్లో కరీంనగర్ జిల్లా రికార్డు సృష్టించడం గర్వకారణం
సీఎం కేసీఆర్ ప్రోత్సాహం.. వైద్యసిబ్బంది కృషితోనే ఈ ఘనత
రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్
టీకా విజయంపై కరీంనగర్ కలెక్టరేట్లో సంబురాలు
అధికారులు, వైద్యసిబ్బందితో కలిసి కేక్ కటింగ్
ఐదు పీహెచ్‌సీలకు రూ. లక్ష చొప్పున ప్రోత్సాహకాలు
హాజరైన జడ్పీ చైర్పర్సన్ విజయ, ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి
కరీంనగర్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): ప్రజారోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. కరీంనగర్ జిల్లా సెకండ్ డోస్ వ్యాక్సినేషన్లో రాష్ట్రంలో మొదటి, దక్షిణభారతస్థాయిలో ద్వితీయ, జాతీయస్థాయిలో నాలుగో స్థానంలో నిలువడం గర్వకారణమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహం, వైద్యాధికారులు, సిబ్బంది నిరంతర కృషితోనే ఈ ఘనత సాధ్యమైందని చెప్పారు. టీకాల పంపిణీలో విజయానికి గుర్తుగా బుధవారం కరీంనగర్ కలెక్టరేట్లో వైద్యాధికారులు, సిబ్బంది సంబురాలు జరుపుకొన్నారు. అనంతరం కలెక్టరేట్లో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలకు మంత్రి గంగుల హాజరై కరీంనగర్ కలెక్టర్ కర్ణన్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి. జిల్లా వైద్యాధికారి జువేరియా, సిబ్బందితో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం కలెక్టర్‌తో పాటు వైద్యాధికారులు, సిబ్బందిని సన్మానించారు. వ్యాక్సినేషన్‌ను వేగంగా పూర్తిచేసిన జిల్లాలోని ఐదు పీహెచ్‌సీలకు సొంత నిధులు లక్ష చొప్పున పారితోషికాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో వైద్యసిబ్బంది తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడారని కొనియాడారు. తదనంతరం అంతే అంకితభావంతో వ్యాక్సినేషన్‌ను విజయవంతం చేశారని పేర్కొన్నారు. కరోనాతో మొదట కరీంనగర్ భయపడ్డదని..కానీ జిల్లా యంత్రాంగం చేపట్టిన కట్టుదిట్టమైన చర్యలతో కరోనాను భయపెట్టే స్థాయికి చేరిందని చమత్కరించారు. ఒకప్పుడు కల్లోల జిల్లాగా పేరుగాంచిన కరీంనగర్, ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో అన్ని రంగాల్లో ముందున్నదని ప్రస్తావించారు.
కేసీఆర్‌కు జిల్లా అంటే అభిమానం..
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కరీంనగర్ జిల్లా అంటే అపారమైన అభిమానమున్నదని, జిల్లా ప్రజలు సైతం ఆయనను అదేస్థాయిలో అభిమానిస్తారని చెప్పారు. 2001 సింహగర్జన సభతో కరీంనగర్ నుంచే తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. అంతేకాకుండా సీఎం పీఠం అధిరోహించిన వెంటనే కరీంనగర్ రెనోవేషన్ స్కీంకు మొదటి జీవో జారీ చేసి రూ. 92 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. ఆ నిధులతోనే కరీంనగర్లో రోడ్లను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. పూర్వపు కరీంనగర్ జిల్లా నుంచే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి రాష్ర్టానికి గోదావరి జలాలను మళ్లించి బీడు భూములను సస్యశ్యామలం చేశారని అన్నారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించడం, కలెక్టర్ ప్రత్యేక దృష్టిపెట్టడంతోనే కొవిడ్ ఫస్ట్, సెకండ్ వేవ్‌లను సమర్థంగా ఎదుర్కొన్నామని, ఇదే స్ఫూర్తితో మూడో దశను ఎదుర్కొని జిల్లాను ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాలని వైద్యాధికారులు, సిబ్బందికి పిలుపునిచ్చారు. మెరుగైన చికిత్స అందించడంతోనే ప్రజలకు ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెరిగిందన్నారు. ప్రైవేట్ దవాఖానలో కొవిడ్ బాధితులను భయపెట్టకుండా తగిన ఆదేశాలు ఇవ్వాలని కలెక్టర్‌కు సూచించారు. కరోనా కాలంలో నిరుపేదలు, వలసకూలీలకు ఆరుకిలోల చొప్పున బియ్యం, రూ. 1500 అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని జడ్పీ చైర్పర్సన్ విజయ పేర్కొన్నారు. కరోనా థర్డ్‌వేవ్ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రాణాలకు తెగించి వ్యాక్సినేషన్‌ను విజయవంతం చేసిన వైద్యసిబ్బంది. ఆశ కార్యకర్తలను అభినందించారు. ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ వ్యాక్సినేషన్లో జిల్లాను అగ్రస్థానంలో నిలుపడంతో వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది చేసి కృషి ప్రశంసనీయమన్నారు. కలెక్టర్ కర్ణన్ మాట్లాడుతూ, జిల్లాలో కొవిడ్ మొదటి డోసు 104 శాతం, రెండో డోసు 100.19 శాతం పూర్తి చేశామన్నారు. 15 నుంచి 18 ఏండ్లలోపు ఉన్నవారికి 72.46 శాతం బూస్టర్ డోసు 34.47 శాతం పూర్తి చేసినట్లు తెలిపారు. కరీంనగర్ అర్భన్‌లో 100 బృందాలు, కొత్తపల్లిలో 15, చొప్పదండిలో 15, హుజూరాబాద్ 30, జమ్మికుంట 30 బృందాల చొప్పున ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించి వ్యాక్సినేషన్ పూర్తి చేశాయని వెల్లడించారు.
ఐదు పీహెచ్‌సీలకు ప్రోత్సాహకాలు..
టీకాల పంపిణీలో కరీనంగర్ జిల్లాలోని కీలక భూమిక పోషించిన కరీంనగర్ అర్బన్‌లోని బుట్టిరాజారాం కాలనీ, అర్బన్ హెల్త్ సెంటర్, గంగాధర, శంకరపట్నం, సైదాపూర్, ఇల్లందకుంట పీహెచ్‌సీలకు మంత్రి గంగుల రూ. లక్ష చొప్పున ప్రోత్సాహకాలను ప్రకటించారు. తన సొంత నిధుల నుంచి మంజూరు చేశారు. బుట్టి రాజారాం కాలనీ అర్భన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ సత్యజిత్ రాజ్, గంగాధర పీహెచ్సీ డాక్టర్ ఉషా, శంకరపట్నం పీహెచ్సీ డాక్టర్ సయ్యద్ షాకీర్ అహ్మద్, సైదాపూర్ పీహెచ్సీ డాక్టర్ ప్రతిమ, ఇల్లందకుంట పీహెచ్సీడాక్టర్ పీ జోష్ణ బృందాలకు చెక్కులను అందజేశారు. అనంతరం ఇందుకు కృషి చేసిన కలెక్టర్ ఆర్వీ కర్ణన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి డాక్టర్ అతుల్, డీఎంహెచ్‌వో డాక్టర్ జువేరియా, డీఆర్డీవో ఎల్ శ్రీలతారెడ్డి, డీపీవో వీరబుచ్చయ్య, డీడబ్ల్యూవో పద్మావతి, కరీంనగర్ డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ సుధాకర్, హుజూరాబాద్ డీఎంహెచ్‌వో డాక్టర్ స్వాతి తదితరులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇంకా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి, కార్పొరేటర్లు ఉన్నారు.