వచ్చే విద్యా సంవత్సరం నుంచే తరగతులు
400 పడకల దవాఖాన సిద్ధం
ఎమ్మెల్యే సంజయ్ చొరవ ప్రశంసనీయం
పేదలకు మెరుగైన విద్య, వైద్యమందినప్పుడే నిజమైన ప్రగతి
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
జగిత్యాల, జనవరి 25 (నమస్తే తెలంగాణ) / జగిత్యాల అర్బన్ : జగిత్యాలలో మెడికల్ కాలేజీ, దవాఖాన నిర్మాణ పనులకు త్వరలోనే సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మెడికల్ కాలేజీ నిర్మించడం చరిత్రాత్మకమని ఆయన పేర్కొన్నారు. జగిత్యాలలో మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి మంగళవారం మంత్రి పరిశీలించారు. సాయంత్రం జిల్లా కేంద్రానికి చేరుకున్న మంత్రికి ఎమ్మెల్యే సంజయ్ స్వాగతం పలికారు. అనంతరం వైద్యకళాశాల తాత్కాలిక భవన నిర్మాణ పనులు, ల్యాబ్‌ల కోసం సిద్ధం చేస్తున్న భవనాలు, మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా బోధన గదులు, వైద్యుల చాంబర్లు, ల్యాబ్ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎంసీహెచ్‌ను సకల సౌకర్యాలతో తీర్చిదిద్దాలని సూచించారు. అనంతరం మంత్రి స్థానిక ఐఎంఏ హాల్లో మాట్లాడుతూ, విద్య, వైద్య రంగంపై సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టిపెట్టారని చెప్పారు. రూ. 200 కోట్లతో మెడికల్ కాలేజీ భవనం, రూ.300ల కోట్లతో దవాఖాన నిర్మిస్తున్నామన్నా రు. నర్సింగ్ కాలేజీకి రూ. 40 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. రూ. 11 కోట్లతో తాత్కాలిక మెడికల్ కళాశాల భవనాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. జగిత్యాలలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ చొరవతో మెడికల్ కాలేజీ తాత్కాలిక భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఫిబ్రవరి వరకు తరగతి గదులు, ల్యాబ్‌లు పూర్తి అవుతాయన్నారు. ఆలిండియా మెడికల్ కౌన్సిల్ విభాగం భవనంతో పాటు, అనుబంధ దవాఖానలో ఏర్పాట్లను పరిశీలిస్తుందని, ఆ తర్వాత జూన్, జూలై నెలల్లో మెడికల్ కాలేజీ ప్రారంభమవుతుందని తెలిపారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా సూపర్‌స్పెషాలిటీ దవాఖాన ఉండాలనే నిబంధనలు ఉన్నాయని, ఈ నేపథ్యంలోనే ప్రధాన దవాఖానలో 100 పడకలతో పాటు, మాతా శిశు సంరక్షణ కేంద్రంలో 132 పడకలు అందుబాటులో ఉండగా, ఎంసీహెచ్‌లో మరో 162 పడకల సామర్థ్యంతో మరో దవాఖానను నిర్మిస్తున్నామని చెప్పారు. సీఎం తమ శాఖపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నాణ్యతతో, శరవేగంగా భవనాలను నిర్మిస్తామన్నారు. జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ సైతం ఇప్పటికే సిద్ధమైందని, త్వరలోనే సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారన్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత జగిత్యాలలోనే అధికంగా 4,500 ఇండ్లు నిర్మించడం సాధారణ విషయంకాదన్నారు. సిద్ధమైన ఇండ్లను త్వరలోనే లబ్ధిదారులకు అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతి, జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ ఎస్ లత, జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ బోగ శ్రావణి, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, ఆర్డీవో మాధురి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ పుప్పాల శ్రీధర్, దవాఖాన సూపరింటెండెంట్ సుదక్షిణాదేవి, ఆర్.ఎం డాక్టర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.