రైతుబంధు ద్వారా జిల్లాకు 1,203 కోట్లు
ప్రజా ప్రతినిధులు, అధికారులు పారదర్శకంగా ఉండాలి
కరీంనగర్ జడ్పీ సర్వసభ్య సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి అండగా ఉంటున్నదని, రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ అధ్యక్షతన మంగళవారం ఏర్పాటు చేసిన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. సమస్యలపై అధికారులతో చర్చించారు. సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయబోమని తేల్చి చెప్పడంతోనే ఇతర పంటలపై దృష్టి పెట్టాలని రైతులకు సూచించామన్నారు. యాసంగిలో వరి సాగు చేసే రైతులు మిల్లర్లు, సీడ్ కంపెనీలతో ఒప్పందం చేసుకోవాలని సూచించారు. ఇందుకు అధికారులు సహకరించాలన్నారు. రైతుబంధు పథకం ద్వారా 2018 సంవత్సరం నుంచి 2021 వరకు రూ. 1,203 కోట్ల నగదును రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. ఆయిల్ పామ్ సాగుపై రైతులు దృష్టిసారించాలని, ఈ పంటతో అధిక లాభాలు వస్తాయన్నారు. ఈ పంట సాగుకు సబ్సిడీ కూడా అందిస్తుందని తెలిపారు. ఈ పంటకు కోతుల బెడద ఉండదని పేర్కొన్నారు. ధరణి పోర్టల్‌లో చూసి బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వాలని, మార్టిగేజ్ అవసరం లేదని స్పష్టం చేశారు.
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు విజిలెన్స్, టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. పీడీఎస్ బియ్యం అమ్మితే చట్టరీత్యా నేరమని, లబ్ధిదారులకు కూడా అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఇష్టం లేకపోతే తీసుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. కొత్త, పాత బియ్యాన్ని గుర్తించేందుకు ఒక కెమికల్‌ను తెచ్చామని, రీ సైక్లింగ్ చేయడం మిల్లర్లకు సాధ్యం కాదని స్పష్టం చేశారు.
ప్రభుత్వ ప్రధాన దవాఖానపై సభ్యులు అడిగిన ప్రశ్నకు జవాబు చెబుతూ దవాఖానలో పట్టించుకోవడం లేదనే ఆరోపణలు సరికాదన్నారు. వైద్యులు సమర్ధవంతంగా పనిచేస్తున్న కారణంగానే కొవిడ్‌ను నియంత్రించడం సాధ్యమైందన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో తప్పనిసరిగా రిసెప్షన్ కౌంటర్లు ఏర్పాటు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. పీఆర్వో వ్యవస్థను పటిష్టం చేయాలని, వైద్యాధికారులను కోరారు. ప్రభుత్వ ప్రధాన దవాఖానలో పోస్టుల భర్తీ పూర్తిగా కలెక్టర్ ఆధ్వర్యంలో పారదర్శకంగా జరుగుతున్నదని స్ప ష్టం చేశారు. వచ్చేనెలలో ప్రారంభమయ్యే మేడా రం సమ్మక సారలమ్మ జాతరలో కరోనా ప్రబలకుండా అన్ని జాగత్తలు తీసుకుంటున్నామన్నారు.
ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో రైతులు వరినే ఎకువగా సాగు చేస్తారన్నారు. ప్రత్యామ్నాయ పంటల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
అనంతరం జడ్పీ చైర్పర్సన్ విజయ మాట్లాడు తూ.. ప్రజలందరూ ఆరోగ్యవంతంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఈ దిశగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. జడ్పీకి రావాల్సిన రూ. 3.50 కోట్లు ట్రెజరీలో ఆగిపోయాయని, పనులు ముందుకు సాగాలంటే వాటిని మంజూరు చేయించాలని మంత్రిని కోరారు. ఈసందర్భంగా జడ్పీ డైరీతో పాటు ఓటరు దినోత్సవం సందర్భంగా అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జడ్పీ డిప్యూటీ సీఈవో పవన్ కుమార్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.