కమాన్చౌరస్తా, ఆగస్టు 31 : శాతవాహన యూనివర్సిటీలోని 25 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ముందస్తు సమాచారం లేకుండా స్థానచలనం చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తర్వులు వెలువడిన వెంటనే వీసీ అమెరికా పర్యటనకు వెళ్లగా, వారు తమ బాధలు ఎవరికి చెప్పాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. యూనివర్సిటీ స్థాపించిన దాదాపు 16 ఏళ్ల నుంచి పలువురు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అయితే, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని మినహా ఇప్పటి వరకు సిబ్బంది ఎవరినీ బదిలీ చేయడం, తొలగించడం ఎప్పుడూ జరుగలేదు. కానీ, వీసీ అమెరికా పర్యటన ప్రారంభమయ్యే రెండు రోజుల ముందు ఆగస్టు 13న ఉత్తర్వులు వెలువడడం వారిని కలవరపెడుతున్నది.
యూనివర్సిటీలోని ఒక కళాశాలలో ఉద్యోగం చేస్తున్న కార్మిక సంఘానికి చెందిన నాయకుడు తన కొడుకు ఆరోగ్యం బాగాలేదని, అత్యవసరంగా ప్రిన్సిపాల్ అనుమతితో సెలవు పెట్టాడు. ఈ క్రమంలో తనకు తెలియకుండా సెలవు ఎలా పెడతాడు? అంటూ అదే కళాశాలలో పని చేసే ఓ ఉద్యోగి అతనితో దుర్భాషలాడినట్లు, కించపర్చేలా మాట్లాడినట్లు తెలిసింది. దీంతో ఒక తాటిపైకి వచ్చిన కార్మిక సంఘం నాయకులు ఈ విషయాన్ని యూనివర్సిటీ ఎస్సీ, ఎస్టీ సెల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా వారు ఆ కార్మికుడిని, సంఘం నాయకులను శాంతింపజేసినట్లు తెలిసింది. ఈ విషయంలో యూనివర్సిటీలో ప్రశ్నించే కార్మికులతో ఇబ్బందులు ఎదురవుతాయని మూకుమ్మడిగా ముందస్తు సమాచారం లేకుండా స్థానచలనం చేపట్టినట్లు తెలుస్తున్నది.
వీసీ ఉమేశ్ కుమార్ అమెరికా పర్యటన ముగించుకుని సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ క్రమంలో బదిలీల పంచాయితీ ఆయన ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తున్నది. కార్మిక సంఘాలు ఏకతాటిపైకి రాగా, తమకు ముందస్తు సమాచారం లేకుండా ఎలా బదిలీలు చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. నగర పరిధిలో ఉన్నా, తాము చేయని తప్పునకు తమను ఎలా శిక్షిస్తారు? అంటూ ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో వీసీ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.