కారు గుర్తుపై టింగ్ టింగ్‌మని నొక్కితే ఢిల్లీ గుండెలదరాలె
రెండో తారీఖున సిలిండర్‌కు రూ.200 పెంచుతరట
బీజేపీ సర్కారు మెడలు వంచితేనే సామాన్యుడికి బతుకు
పెట్రో సర్‌చార్జీ పేరిట ఏటా 3 లక్షల కోట్లు దోచుకుంటాన్రు
30న ఇంట్ల గ్యాస్‌బండకు దండం పెట్టి రావాలె
టీఆర్ఎస్కు ఓట్లేయాలె.. బీజేపీని బొందవెట్టాలె
ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు
జమ్మికుంట చౌరస్తా/జమ్మికుంట , అక్టోబర్ 24 : హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీకి దింపుడుకల్లం ఆశే మిగిలింది. గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు ఖాయమైంది. 30 తారీఖున ఓటేసేటందుకు పోయేముందు వంటింట్లకు వెళ్లి గ్యాస్ సిలిండర్‌కు దండం పెట్టున్రి.. కారు గుర్తుకు ఓటు వేయున్రి.. ధరలు పెంచిన బీజేపీని బొందవెట్టున్రి.. ఈవీఎంల కారు గుర్తు మీద టింగ్.. టింగ్‌మని నొక్కితే ఢిల్లీ గుండెలదరాలె. నిత్యావసర వస్తువుల ధరలు పెంచి నిరుపేదలపై పెనుభారం మోపుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ మెడలు వంచితే గాని సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. ఆ పార్టీ నాయకులు ప్రజలకు ఝూటా మాటలు చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నరు. వాళ్ల అబద్ధపు ప్రచారాలను మా ప్రజలు నమ్మరు గాక, నమ్మరు.
హుజూరాబాద్ ఉపఎన్నికలో బీజేపీకి దింపుకల్లం ఆశ మాత్రమే మిగిలి ఉందని, గెల్లు శ్రీనివాస్‌యాదవ్ గెలుపు ఖాయమైపోయిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఆదివారం మధ్యాహ్నం జమ్మికుంట మండలం మాచనపల్లి, సాయంత్రం వెంకటేశ్వర్లపల్లి జంక్షన్, మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లిలో జరిగిన ధూంధాంలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఇటీవల ఓ కేంద్ర మంత్రి పెట్రోల్, డీజిల్ 95 శాతం మందికి అవసరమే లేదని మాట్లాడారని, ఇయ్యాళ పెట్రోల్, డీజిల్‌తో పని లేని రైతు ఉంటడా? అని ప్రశ్నించారు. బావుల కాడికి పోవాలన్నా, పొలం దున్నాలన్నా వాటి అవసరం తప్పనిసరైందని, అట్లాంటి వాటి ధరలు విపరీతంగా పెంచుతున్న బీజేపీని ప్రోత్సహిద్దామా? అని ప్రశ్నించారు. అంతర్జాతీయంగా ధరల పెరగడం వల్ల పెట్రోల్, డీజిల్ ధర పెరిగిందని చెబుతున్న బీజేపీ నాయకులు, సర్‌చార్జీలు వసూలు చేసి రూ.3 లక్షల కోట్లు జమ చేసుకున్నది మీరు కాదా? అని సూటిగా ప్రశ్నించారు. ఈటల రాజేందర్ అబధ్ధాలు చెప్పి ఓట్లు దండుకోవాలని చూస్తున్నాడని, అబద్ధాలు చెప్పే బీజేపీ కావాలా?, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే టీఆర్ఎస్ కావాలా? ఆలోచించాలని కోరారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని ఓట్ల కోసం తిప్పుతున్నాడని, గ్యాస్ సిలిండర్ ధర తగ్గిస్తామని చెప్పి ఓటడగాలని హితవుపలికారు. ఆయన వ్యవహారం కూట్లె రాయి తీయలేనోడు ఏట్లె రాయి తీసినట్లుందని ఎద్దేవా చేశారు. తాను సిద్దిపేటలో ఆరు సార్లు గిలిచి ఎన్ని పనులు చేశానో చూడాలని సూచించారు.
తాము ప్రవేశ పెట్టిన పథకాల్లో కేంద్రం వాటా ఉంటే పక్కన ఉన్న మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ర్టాల్లో ఎందుకో ఇస్తలేరని నిలదీశారు. ఈటల రాజేందర్‌కు ఇక్కడి ప్రజలపై ప్రేముంటే తన మెడికల్ కాలేజీ హైదరాబాద్‌లో కాకుండా జమ్మికుటలో ఎందుకు కట్టలేదని అడిగారు. కేవలం ఆయన స్వార్థం, ఆస్తుల రక్షణ కోసమే మధ్యంతర ఎన్నిక తెచ్చాడని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, హుజూర్నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యయాదవ్, వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, కరీంనగర్ డీసీసీబీ వైస్ చైర్మన్ పింగిళి రమేశ్, మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు, జడ్పీటీసీ శ్యాం, ఎంపీపీ మమత, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు కనపర్తి లింగారావు, మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్న, జడ్పీటీసీ శ్రీరాంశ్యాం, ఎంపీపీ మమత, కౌన్సిలర్లు ఎలంగందుల స్వప్న, పిట్టల శ్వేత, సదానందం, దేశిని రాధ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి, క్లస్టర్ ఇన్చార్జిలు బండి రజని కుమార్, సర్పంచ్‌లు బొజ్జం కల్పన, వంశీధర్ రావు, ఎంపీటీసీ రాజేశ్వర్ రావు, ఎర్రయ్య, కనవేయిన తిరుపతి, పర్లపల్లి రమేశ్, మాజీ ఎంపీటీసీ భిక్షపతి, శ్యాంసుందర్ సమ్మారావు, రమ, ఆగయ్య, మహేందర్, కుమార్, సంపత్‌రావు పాల్గొన్నారు.
“ఈటల రాజేందర్ గెలిస్తే ఏం చేస్తావో చెప్పకుండా టీఆర్ఎస్ను, ఆదరించి అందలం ఎక్కించిన కేసీఆర్‌ను బొందపెడతా, కూలగొడతా, అంతు చూస్తా, ఘోరీ కడతా, అగ్గి పెడుతా అంటున్నడు తప్ప ప్రజలకు పనికి వచ్చే ముచ్చట ఒక్కటీ చెప్తలేడు. నీలాగే నేను సిద్దిపేటలో ఆరు సార్లు గెలిచిన. ఎన్ని పనులు చేసిన్నో చూసుకో. నీలాగ మైకుల ముందు మాట్లాడి తప్పుకునేటోన్ని కాదు. హామీ ఇచ్చిన పని పూర్తి చేసి చూపిస్తా”
‘మోసానికి కేరాఫ్ బీజేపీ. వాళ్లు చెప్పింది ఒక్కటీ చేయరు. ఎంపీ అర్వింద్ ఏం చేసిండు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు తెస్తనని బాండ్ పేపర్ రాసిచ్చిండు. గెలిచిన తర్వాత మొఖం చాటేసిండు. ఇప్పుడిక్కడికచ్చి ఓట్లు అడుగుతాండు. అతని మాట ఎవరన్నా నమ్ముతరా.. ఆయన వ్యవహారం ఎట్లున్నదంటే కూట్లే రాయి తీయలేనోడు.. ఏట్లే రాయి తీసినట్లున్నది.