వీణవంక, అక్టోబర్ 24: హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి వైపు ఉంటారో.. అరాచకం వైపు ఉంటారో ఆలోచన చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ సూచించారు. వీణవంక మండల కేంద్రంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పాడి కౌశిక్‌రెడ్డి ఇంట్లో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగిందనే టీఆర్ఎస్ ఆవిర్భవించిందని పేర్కొన్నారు. గతంలో రాష్ట్రం ఎలా ఉంది.. ప్రస్తుతం ఎలా ఉందో ఆలోచన చేయాలన్నారు. 24 గంటల కరెంట్, రైతు బంధు, రైతు బీమాతో అన్నదాతలకు అండగా నిలుస్తున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలించిందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నుంచి బీజేపీ గ్రామశాఖ అధ్యక్షుడి వరకు ఏ ఒక్కరైనా అభివృద్ధి గురించి మాట్లాడారా అని ప్రశ్నించారు. దేశంలో అలజడి, మత విద్వేషాలు, మత కలహాలు సృష్టించి లబ్ధి పొందాలనేది బీజేపీ చూస్తున్నదని మండిపడ్డారు. రూ.400 ఉన్న సిలిండర్ ధరను రూ.వెయ్యికి పెంచారని, ఇది ఆర్థిక అరాచకత్వం కాదా.. అని ప్రశ్నించారు. అన్ని మతాలను సమానంగా చూడడమే టీఆర్ఎస్కు అలవాటని పేర్కొన్నారు. బీజేపీ గుడి కట్టిస్తామని చెప్పి కట్టించలేదని.. టీఆర్ఎస్ యాదాద్రిలో కట్టించిందని తెలిపారు. హుజూరాబాద్ ప్రాంత అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఉద్యమ నాయకుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను మీ ముందకు తీసుకువచ్చారని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలందరూ గెల్లును ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించాలని, ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈటల రాజేందర్ ఎందుకు రాజీనామా చేశారో స్పష్టత ఇవ్వలేదని, ఆయన బాధను ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. త్వరలోనే మరో రెండు, మూడు పథకాలు రానున్నాయని..2023లో ప్రజలు టీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతారని తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ మాడ సాదవరెడ్డి, సర్పంచ్ నీల కుమారస్వామి, ఉపసర్పంచ్ భానుచందర్, తదితరులు పాల్గొన్నారు.