జమ్మికుంట, డిసెంబర్ 13: నిబంధనలను తుంగలోతొక్కి ఇష్టానుసారంగా నిర్వహిస్తున్న హోటల్స్, రెస్టారెంట్లు, బేకరీలపై మంగళవారం జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ కే సమ్మయ్య సమక్షంలో జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ డాక్టర్ అనూష, సిబ్బంది ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వ్యర్థ పదార్థాలు, చెత్తాచెదారం, పాడైపోయిన బ్రెడ్‌తో పదార్థాలు, వివిధ రకాలైన కలర్స్ వేసి జింక్ ఫుడ్ తయారీ, ఫుడ్‌లో వాడుతున్న స్పైసెస్, నాసిరకం ఆయిల్స్ వాడకం, నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్టిక్ కవర్ల వినియోగం, తదితర అంశాలను గమనించారు. ఇంత చెత్త తిండిని ప్రజలకు అందిస్తున్నారా..? అని నివ్వెరపోయారు. అధ్వానంగా తిండిని అందించడం ఏమిటీ..? అని నిర్వాహకులకు ప్రశ్నించారు. ఉదయం స్థానిక తెలంగాణ చౌక్ నుంచి ప్రారంభమైన తనిఖీలు సాయంత్రం వరకు కొనసాగగా, ఈ విషయం తెలిసిన పలువురు నిర్వాహకులు హోటల్స్ మూసి పరారయ్యారు. తనిఖీల సమయంలో హోటల్స్, బేకరీ, రెస్టారెంట్లలో అధికారులు శాంపిల్స్ సేకరించారు. ల్యాబ్‌కు పంపిస్తామని తెలిపారు. కాగా, తనిఖీల సమయంలో హోటల్స్ నిర్వాహకులు కొందరు కమిషనర్, ఎఫ్ఐతో వాగ్వాదానికి దిగారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ.. అధికారులతో గొడవకు దిగడంపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ వెంటనే పట్టణ సీఐ రాంచందర్‌రావుతో మాట్లాడారు. వెంటనే సీఐ పోలీస్ సిబ్బందిని పంపించారు. పోలీసుల ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు చేస్తూ ముందుకు సాగారు.
ఇక నుంచి నిరంతరం తనిఖీలు
జమ్మికుంటలో 20కిపైగా హోటల్స్, రెస్టారెంట్లు, బేకరీల్లో తనిఖీలు చేశామని ఫుడ్ ఇన్స్పెక్టర్ డాక్టర్ అనూష, కమిషనర్ కే సమ్మయ్య తెలిపారు. నిర్వహణ అంతా అధ్వానంగా ఉందని చెప్పారు. శాంపిల్స్ సేకరించామని, నమూనాలను ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. నాసిరకం, నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటల్స్, రెస్టారెంట్లు, బేకరీలపై చర్యలు తీసుకుంటామని, అవసరమైతే కేసులు నమోదు చేయిస్తామని చెప్పారు. తనిఖీల్లో 16 హోటల్స్, బేకరీల్లో నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు చేస్తున్న ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్నామని, నిర్వాహకులకు రూ.23వేల జరిమానా వేసినట్లు చెప్పారు. తనిఖీలు ఇక నుంచి నిరంతరం కొనసాగుతాయని, హోటల్స్, బేకరీలు, రెస్టారెంట్లు నిబంధనలు పాటించాలని, నాణ్యమైన ఫుడ్‌ను ప్రజలకు అందించాలని హెచ్చరించారు. ప్రజలు కూడా బయట ఫుడ్ తినకుండా ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు.