తగ్గిన అమ్మకాలు, పెరిగిన వ్యయం
భారీ విగ్రహాలు అంతంతమాత్రమే
మంథని టౌన్, ఆగస్టు 22: కరోనా ప్రభా వం వినాయక విగ్రహాల తయారీపై పడుతున్నది. అమ్మకాలు తగ్గడం, వ్యయం పెరగడం, కొనుగోళ్లు అంతంతమాత్రంగానే ఉంటుండడంతో తయారీదారులు చిన్నవి మాత్రమే రూ పొందిస్తున్నారు. రాజస్థాన్‌కు చెందిన కొందరు కార్మికులు 12 ఏండ్లుగా మంథనిలోని ఎస్బీఐ(ఏడీబీ), గాంధీచౌక్తోపాటు మండలంలోని సూరయ్యపల్లి శివారులోని ఏరియాల్లో వినాయక, దుర్గామాత విగ్రహాలు తయారు చేస్తున్నారు. మంథనితో పాటు పలు ప్రాంతాలకు చెందిన వారికి విగ్రహాలను విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు.
ఇతర ప్రాంతాల నుంచి..
2020లో మొదలైన కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతున్నది. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురువుతాయో అన్న భయంతోపాటు మార్కెట్ ఆశించిన స్థాయి ఉండడంలేదు. ముడి సరుకులు, రంగులను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. కరోనా వైర స్, లాక్డౌన్లతో రవాణా సౌకర్యం సన్నగిల్ల డం, వాటికయ్యే ఖర్చులు సైతం అధికమయ్యా యి. కొనుగోళ్లు లేక పోతే భారీగా నష్టాలే ఎదురవుతాయని భావించి తయారీని గణనీయంగా తగ్గించుకున్నారు. తయారీ ప్రక్రియను దాదాపు 80 శాతం మేర తగ్గించినట్లుగా తెలుస్తుంది.
1 నుంచి 3 ఫీట్ల ఎత్తు ..
కరోనా వైరస్ నేపథ్యంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు గతేడాది నామమాత్రంగా కొనసాగాయి. ఈ ఏడాది సైతం అలాగే జరిగే అవకాశమున్నదని భావించిన విగ్రహాల తయారీ దారు లు చిన్న వాటి తయారీపైనే దృష్టి పెట్టారు. భారీ విగ్రహాలు పెట్టే పరిస్థితులు లేనందున 1 నుంచి 3 ఫీట్ల ఎత్తు ఉండేవి మాత్రమే తయారు చేస్తున్నారు. కొనుగోలుదారుల ఇష్టం మేరకు చాలా తక్కువ సంఖ్యల్లో 5 లేదా 6 ఫీట్ల విగ్రహాలను రూపొందిస్తున్నారు. ఇండ్లలో పెట్టుకొని పూజలు చేసుకునే చిన్న విగ్రహాలను అధికంగా తయారు చేస్తున్నారు.