ఒకే కర్రీతో బగారా భోజనం.. ఒకే స్వీట్కే పరిమితం
ఇటీవలే వేములవాడ ముస్లిం కమిటీ తీర్మానం
కట్నకానుకలు నిషేధించాలంటున్న యువతరం
వేములవాడ, జనవరి 22 : ముస్లింల పెండ్లంటే బ్యాండు భాజాలు.. డెకరేషన్ హంగులు.. అత్తరు సొబగులు.. మూడు రకాల మాంసం వంటలు.. బిర్యానీ గుమగుమలు.. తీరొక్క మిఠాయిలు.. వెరసీ పెండ్లి ఖర్చు తడిసి మోపడవుతున్నది. ఇది నిరుపేద ముస్లింలకు భారంగా మారుతున్నది. లక్షలకు లక్షలు వెచ్చించలేక ఆడపిల్లల పెండ్లంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే ఆడపిల్లల వివాహాలలో పెరుగుతున్న ఖర్చులను తగ్గించేందుకు వేములవాడ ముస్లిం కమిటీ సంచలనం నిర్ణయం తీసుకున్నది. విందులో ఒకే కూర, ఒకే స్వీటు పెట్టాలని, వచ్చే ఫిబ్రవరి ఒకటి నుంచి అమలు చేయాలని తీర్మానం చేయగా, ముస్లిం సమాజంతో పాటు సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
ముస్లిం సమాజంలో నెలకొన్న ఆర్థిక అంతరాన్ని కొంతమేరకైనా తగ్గించేందుకు వేములవాడ ముస్లిం కమిటీ చైతన్యవంతమైన నిర్ణయం తీసుకున్నది. ఆడపిల్లల పెండ్ల్లి ఖర్చులను పరిమితం చేయాలని సంకల్పించింది. దావత్ మెనూలో చికెన్ లేదా మటన్‌తో బగారా అన్నం, ఒకే స్వీటు వడ్డించాలని నిర్దేశించింది. ఈ మేరకు ఈనెల 16న సమావేశమైన ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. వచ్చే ఫిబ్రవరి ఒకటి నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. పెండ్లిళ్లు చేసే ఖాజీలకు సైతం తెలియజేసింది. వేములవాడ మున్సిపల్ పరిధిలో ఎనిమిది మసీదులు, సుమారు 1200 ముస్లిం మైనార్టీ కుటుంబాలు ఉండగా ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించింది. ఇందుకు సంబంధించిన వివరాలను వేములవాడ ముస్లిం మైనార్టీ సంఘం అధ్యక్షుడు ఎండీ అక్రంపాషా వెల్లడించగా ఈ నిఖాపై అన్ని వర్గాల నుంచి విశేష స్పందన వస్తున్నది. కులమతాలకతీతంగా ప్రతి వర్గం స్వాగతిస్తున్నది.
వరుడే మెహర్ ఇవ్వాలి..
ముస్లిం మతాచారం ప్రకారం వరుడే వధువుకు మెహర్(ఎదురుకట్నం) ఇవ్వాలి. కానీ, ప్రస్తుతం పరిస్థితి మారింది. వరుడికి సుమారు రూ.3లక్షల నుంచి 10లక్షల దాకా కాట్న కానుకలు ఇస్తున్నారు. వస్తురూపంలో మరో రెండు మూడు లక్షల వరకు ముట్టజెప్పుతున్నారు. అంతేకాకుండా ఫంక్షన్‌హాల్‌కు రూ.50 వేలు, మూడు నాలుగు రకాల మాంసం వంటలు, స్వీట్లు, బిర్యానీలు ఇలా మరో రూ.3లక్షలు ఖర్చు చేయాల్సి వస్తున్నదని మతపెద్దలు చెబుతున్నారు. మొత్తంగా రూ.10 లక్షలు ఉంటేనే గానీ ఆడపిల్ల పెండ్లి చేసే పరిస్థితి లేదని వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో వేములవాడ పట్టణ పరిధిలోని నిరుపేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లలకు పెండ్లి చేసే పరిస్థితుల్లేక ఇంటివద్దే ఉంటున్నారు. ఈనేపథ్యంలోనే ఆడపిల్లల వివాహంలో పెరుగుతున్న ఖర్చులను తగ్గించేందుకు వేములవాడ మున్సిపల్ పరిధిలోని ఎనిమిది మసీదు కమిటీల అధ్యక్షులతో వేములవాడ ముస్లిం కమిటీ అధ్యక్షుడు అక్రమ్ పాషా సమావేశం నిర్వహించారు. అమ్మాయి నిఖాలో బగారాలో మటన్ లేదా చికెన్ మాంసంతో ఒకే కూర మాత్రమే పెట్టాలని తీర్మానించారు.
కట్నం ఇవ్వద్దని తీర్మానం చేస్తాం
ఆడపిల్లల పెండ్లికి కట్నాలు కూడా ఇచ్చుకోలేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. దావత్ ఖర్చులు తగ్గించుకోవాలని తీర్మానించుకునట్లుగానే వరుడి కట్నం కూడా ఇవ్వబోమని త్వరలోనే అందరితో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటం. ఇందుకు అందరూ కట్టుబడి ఉండాలి. – ఎండీ అక్రమ్‌పాషా, వేములవాడ ముస్లిం కమిటీ అధ్యక్షుడు
ఇరువై ఏండ్ల కింద రూ. వెయ్యిలోపే వేడుక
ఇరువై ఏండ్ల కిందట పెండ్లి చేసేందుకు రూ. 800 నుంచి రూ. వెయ్యి వరకు ఖర్చయ్యేది. అప్పుడు బగారా అన్నం ఒక మాంసం కూర, దాల్చాతో పాటు స్వీటు కూడా పెట్టేవాళ్లం. ప్రస్తుతం రూ. 10 లక్షలు దాటుతున్నాయి. ఉన్నవాళ్లకు ఇబ్బందిలేదు. కానీ పేదలు పరేషాన్ అవుతున్నరు. అందుకే పెండ్లి ఖర్చులు తగ్గించాలని నిర్ణయించినం.
–షేక్ ఇమామ్, వేములవాడ మహమ్మదీయ మసీదు కమిటీ అధ్యక్షుడు