కక్షిదారులకు సత్వర న్యాయం చేయాలి
రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి షమీమ్ అక్తర్
గోదావరిఖనిలో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభం
ఫర్టిలైజర్‌సిటీ, నవంబర్ 21: మారుతున్న పోటీ ప్రపంచానికి అనుగుణంగా న్యాయవాదులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని, కక్షిదారులకు సత్వర న్యాయం చేసేందుకు కృషిచేయాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి షమీమ్ అక్తర్ సూచించారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని మున్సిపల్ కాంప్లెక్స్ ఆవరణలో ఏర్పాటు చేసిన సీనియర్ సివిల్ జడ్జి కోర్టును ప్రారంభించి, మాట్లాడారు. గోదావరిఖని సబ్ డివిజన్ పరిధిలో సబ్ కోర్టులో అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయనీ, న్యాయవాదుల 22 ఏండ్ల పోరాట ఫలితంగా కోర్టు ఏర్పాటైందని, వాళ్ల కృషి చిరస్మరణీయమన్నారు. పెరుగుతున్న పోటీ ప్రపంచానికి తోడు సాంకేతిక నైపుణ్యాన్ని అలవర్చుకోవాలని సూచించారు. రెండేళ్లుగా కొవిడ్ నేపథ్యంలో కోర్టు నిర్వహణ ఆలస్యం కావడంతో కేసుల సంఖ్య మరింత పెరిగిందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి షమీమ్ తోపాటు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని, నగర పాలక కమిషనర్ శంకర్ కుమార్, ఆర్జీ-1 జీఎంను గోదావరిఖని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాయకులు ఘనంగా సన్మానించారు. అంతకు ముందు కోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా న్యాయమూర్తి ప్రత్యేక పూజలు చేశారు. వీరితోపాటు ఇక్కడ ఎమ్మెల్యే చందర్, మేయర్ అనిల్‌కుమార్ డివిజన్ కార్పొరేటర్ మంచికట్ల దయాకర్, బార్ సభ్యులు లక్ష్మణ్‌కుమార్, ప్రిన్సిపల్, 2వ అదనపు మెజిస్ట్రేట్ భార్గవి, ప్రియాంక పూజలు చేశారు. అనంతరం గోదావరిఖని కోర్టులో పెద్దపల్లి సీనియర్ సివిల్ జడ్జి సరోజిని బాధ్యతలు స్వీకరించి పలు కేసులను పరిష్కరించారు.
అనంతరం గోదావరిఖనిలో నూతనంగా నిర్మించే శారదానగర్‌లోని కోర్టు భవనాల వద్ద హైకోర్టు జడ్జి షమీమ్ అక్తర్, జిల్లా ఆరో అదనపు న్యాయమూర్తి భరత లక్ష్మీ, కరీంనగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని, కమిషనర్ శంకర్ కుమార్ మొక్కలు నాటారు. అనంతరం ఆయన గోదావరిఖనిలోని మున్సిఫ్ కోర్టు కాంప్లెక్స్‌తోపాటు జిల్లా ఆరో అదనపు న్యాయస్థానాన్ని బార్ అసోసియేషన్ కార్యాలయాన్ని పరిశీలించారు. సింగరేణి సహకారంతో రానున్న రోజుల్లో ఒకే చోట కోర్టులు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఇక్కడ బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బల్మూరి అమరేందర్ రావు, జవ్వాజి శ్రీనివాస్, ప్రతినిధులు ముస్కె రవికుమార్, సురేశ్‌కుమార్, నర్సయ్య, చెల్కల పద్మజ, పాత అశోక్, సుధాకర్ రెడ్డి, ము చ్చకుర్తి కుమార్, ఉమర్, శ్రీనివాస్, భారతి దేవితోపాటు న్యాయవాదులు శైలజ, సంజయ్‌కుమార్, శంతన్‌కుమార్, గోపాల్‌రెడ్డి, గొర్రె రమేశ్, న్యాయమూర్తులు శ్రీధర్, ప్రసాద్, భార్గవి, ప్రియాంక, డీసీపీ రవీందర్, ఏసీపీ గిరి ప్రసాద్, సీఐలు రమేశ్‌బాబు, ఎస్ఐలు ఉన్నారు.