ఇదే స్ఫూర్తితో ముందుకుసాగాలి
నగరాలు, పట్టణాలను ఆదర్శంగా నిలపాలిమంత్రి కేటీఆర్
ఢిల్లీలో కరీంనగర్ మేయర్, కమిషనర్, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్లకు అభినందనలు
కార్పొరేషన్/సిరిసిల్ల టౌన్, నవంబర్ 21 ;‘వెల్డన్. బాగా పనిచేశారు. చాలా కష్టపడ్డారు. ఇదే స్ఫూర్తితో ముందుకుసాగాలి. మరింత బాధ్యతగా పనిచేసి నగరం, పట్టణాన్ని ఆదర్శంగా నిలుపాలి’ అంటూ రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. కరీంనగర్ మేయర్, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్లను అభినందించారు. సఫాయి మిత్ర సురక్షా ఛాలెంజ్‌లో కరీంనగర్ కార్పొరేషన్‌కు జాతీయ స్థాయిలో రెండో బహుమతి రావడం, స్వచ్ఛ సర్వేక్షన్లో సిరిసిల్ల మున్సిపాలిటీకి దక్షిణ భారతదేశంలో మొదటి బహుమతి వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆదివారం ఢిల్లీలోని సీఎం కేసీఆర్ అధికారిక నివాసంలో అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కరీంనగర్ మేయర్ సునీల్‌రావు, నగర కమిషనర్ యాదగిరి రావు, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, కమిషనర్ సమ్మయ్య, టీపీవో అన్సర్‌ను అభినందించారు. వెల్ డన్ బాగా పనిచేశారంటూ ప్రశంసించారు. కరీంనగర్, సిరిసిల్లను అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందు వరుసలో నిలిపేందుకు కృషి చేయాలని సూచించారు. అనంతరం సీఎం కేసీఆర్ సతీమణి కల్వకుంట్ల శోభ, మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమను జిందం కళ, సమ్మయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ జిందం కళ కేసీఆర్ సతీమణ శోభ వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు. వారి వెంట టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి కూడా ఉన్నారు.