ఇప్పటికే 36 శాతం అధికం
నామ మాత్రంగా మిగతా పంటలు
నీళ్లు పుష్కలంగా ఉండడమే కారణం
కరీంనగర్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): పంటల సాగు విస్తీర్ణం కరీంనగర్ జిల్లాలో అనూహ్యంగా పెరుగుతోంది. వరి అంచనాలు దాటింది. కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా నీటి వనరులు పుష్కలంగా ఉండడంతో ఈసారి కూడా రైతాంగం ఎక్కువగా వరిసాగుపైనే మక్కువ చూపుతోంది. ఇప్పటికే 36 శాతం అధికంగా వేసినట్లు స్పష్టమవుతోంది. పత్తి, మక్కజొన్న, పప్పు దినుసులు, తదితర పంటల సాగు నామమాత్రంగా ఉంది.
జిల్లాలో 3,53,173 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. జిల్లాలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 1,56,258 ఎకరాలు కాగా, ఈ సీజన్లో 2.50 లక్షల ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేశారు. ఇప్పటికే 2,12,486 ఎకరాల్లో వరి నాట్లు వేశారు. అంటే సాధారణ సాగు విస్తీర్ణంతో పోల్చుకుంటే ఇది 36 శాతం అధికం. సాధారణ విస్తీర్ణాన్ని బట్టి చూస్తే ఇప్పటికే 136.0 శాతం అధికంగా వరి సాగైంది. గత వానకాలం సీజన్లోనూ ఇదే పరిస్థితి. ఆ సీజన్లో 2,52,952 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈ నెలాఖరు వరకు నాట్లు వేసుకునే అవకాశం ఉన్నందున, ఇంకా వరి సాగు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎస్సారెస్పీ, ఎల్ఎండీ రిజర్వాయర్లలో ఆశించిన నీరు ఉండడంతో రైతులు ధీమాతో వరి నాట్లు వేస్తున్నారు. ఈసారి వ్యవసాయ శాఖ అధికారులు రూపొందించిన ప్రణాళికను దాటే పరిస్థితి కనిపిస్తున్నది.
94.7 శాతానికి చేరిన సాగు విస్తీర్ణం
పంటల సాగు విస్తీర్ణం ఇప్పటికే 94.7 శాతానికి చేరుకున్నది. ఇందులో వరిదే సింహభాగం. మిగతా పంటలు అంచనాల చేరువలో లేవు. వానకాలంలో మరో ప్రధాన పంటగా భావిస్తు న్న పత్తి ఈసారి తక్కువే సాగయింది. గతేడాది వానకాలంలో సాగయిన విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకుని ఈసారి 75 వేల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనాకు వచ్చారు. అయితే, 58,164 ఎకరాలకే పత్తి పరిమితమైంది. సాధారణ సాగు విస్తీర్ణంతో పోల్చుకుంటే 55.9 శాతమే సాగయింది. ఇక మక్కజొన్న 6,500 ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేయగా, ఇ ప్పటికే 8,812 ఎకరాల్లో సాగయింది. 1,500 ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేసిన పెసర 867, 9,500 ఎకరాల్లో సాగవుతుందనుకున్న కంది 3,256 ఎకరాల్లో సాగయింది. మొత్తంగా చూస్తే ప్రధాన పంట వరితోపాటు జిల్లాలో ఇప్పటివరకు 3,53,173 ఎకరాల్లో సాగవుతుందనుకున్న పంట విస్తీర్ణం ఇప్పటికే 2,84,302 ఎకరాలకు చేరుకున్నది. వానకాలం సాధారణ విస్తీర్ణం 3,00,235 ఎకరాలతో పోల్చుకుంటే ఇది 94.7 శాతంగా అధికారులు చెబుతున్నారు. ఇంకా పంటలు విస్తరించే అవకాశం ఉండడంతో ఇంకా పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి.