నిరుపేదలను ఆదుకుంటాం
సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
హమాలీ కార్మికులతో సమావేశం
జమ్మికుంట, ఆగస్టు 21: కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం పట్టణంలోని హమాలీ కార్మికుల సంఘ భవనంలో, 15వ వార్డులో స్టేట్ వేరోజ్ గోదాంల హమాలీ కార్మికులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నిరుపేద కార్మికులందరినీ ప్రభుత్వపరంగా ఆదుకుంటామన్నారు. హమాలీ కార్మికులకు కమ్యూనిటీ భవనం నిర్మిస్తామన్నారు. అంతకుముందు హమాలీ కార్మికులు తమ సమస్యలకు సంబంధించి మంత్రికి వినతిపత్రాన్ని అందజేశారు. తొలిసారిగా హమాలీ కార్మికులను కలిసిన మంత్రి కొప్పులను వారు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మాజీ సర్పంచ్ మల్లయ్య, హమాలీ సంఘం అధ్యక్షుడు ఒల్లాల శ్రీనివాస్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు టంగుటూరి రాజ్‌కుమార్, హమాలీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
మంత్రికి రాఖీ కట్టిన మహిళలు
రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద బహుజన పూజారుల శివశక్తుల సేవాసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చీమల కోటేశ్వరి ఆధ్వర్యంలో మహిళలు రాఖీలు కట్టారు. శనివారం మంత్రి జమ్మికుంట పర్యటనలో భాగంగా తెలంగాణ చౌక్‌కు చేరుకున్నారు. అప్పటికే అక్కడ నాయకురాలు కోటేశ్వరి, మరి కొందరు మహిళలు మంగళహారతి, రాఖీలతో ఉన్నారు. సమాచారం తెలుసుకున్న మంత్రి అక్కడ ఆగగా, మహిళలు ఆయన వద్దకు వచ్చారు. బొట్టు పెట్టారు. రాఖీలు కట్టి, సోదరీ సోదరులకు అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ సంపత్, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు ఉన్నారు.