ప్రజారోగ్యమే ప్రభుత్వ లక్ష్యం
కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం
సర్కారు దవాఖానల్లో మెరుగైన వైద్యం
సిరిసిల్ల ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్
సిరిసిల్ల టౌన్/ కలెక్టరేట్, జనవరి 21 : ప్రజారోగ్యమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, కొవిడ్ థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నదని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కరోనా రెండో దశలో ఉన్నంత తీవ్రత లేదని వైద్యాధికారులు చెబుతున్నారని, అయినా వైరస్ నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దవాఖానల్లో అన్ని సౌకర్యాలు కల్పించామని, మెరుగైన వైద్యం అందుతున్నదని చెప్పారు. ప్రజలందరికీ సర్కారు అండగా ఉంటుందని, ఎలాంటి భయాందోళన వద్దని సూచించారు. శుక్రవారం మధ్యాహ్నం తర్వాత సిరిసిల్లకు చేరుకున్న మంత్రి కేటీఆర్, సమీకృత కలెక్టరేట్లో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్‌హెగ్డే, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, వైద్య ఆరోగ్య శాఖ, విద్యా శాఖ అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా, దళితబంధు, చేనేత మరమగ్గాల పరిశ్రమలపై సుమారు రెండున్నర గంటల పాటు సమీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొవిడ్ ఫస్ట్, సెకండ్ వేవ్ సమయాల్లో జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పించామన్నారు. అన్ని రకాల మందులు, ఆధునిక పరికరాలతోపాటు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. వేములవాడలో వంద పడకల హాస్పిటల్‌ను నిర్మించుకున్నామని, ఇక్కడ లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకు, పాలియేటివ్ కేర్ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఒకప్పుడు సర్కారు దవాఖానకు పోవాలంటేనే భయపడేటోళ్లని, నేడు అవే వైద్యశాలల్లో ప్రసవాలు చేయించుకుంటున్నారని, ఇది కేసీఆర్ ఘనతేనని ప్రశంసించారు. గత నవంబర్‌లో జిల్లా దవాఖానలో 324, డిసెంబర్లో 320 ప్రసవాలు చేశారని, ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో పెరిగిన నమ్మకానికి ఇది నిదర్శనమన్నారు. ప్రసవాలు పెద్ద ఎత్తున చేస్తూ, పేద మహిళలకు మెరుగైన వైద్య సేవలందిస్తున్న డాక్టర్లను ఆరోగ్య సిబ్బంది, అధికారులను మంత్రి అభినందించారు. రాష్ట్రంలో హెల్త్ ప్రొఫైల్ రూపొందించేందుకు రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాలు పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికయ్యాయని తెలిపారు. వచ్చే నెలలో ఈ ప్రాజెక్టును మన జిల్లాలో ప్రారంభిస్తామని చెప్పారు.
వ్యాక్సినేషన్లో ఐదో స్థానం..
ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు బూస్టర్ డోస్ ప్రక్రియను వేగవంతంగా నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. పోలీస్, వైద్య, ఆరోగ్య, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల్లో 3,784 మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉన్నారని, వీరందరికీ బూస్టర్ డోస్ వేస్తామన్నారు. వ్యాక్సినేషన్లో రాజన్న సిరిసిల్ల జిల్లా 5వ స్థానంలో నిలిచిందన్నారు. మొదటి డోసు వంద శాతం, రెండో డోసు 86శాతం, మూడో డోసు 35శాతం పూర్తి చేసినట్లు తెలిపారు. వీటిని వంద శాతం పూర్తి చేసి రాష్ట్రంలో జిల్లాను అగ్రస్థానంలో నిలుపాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు పేర్కొన్నారు.
వేగంగా ఫీవర్ సర్వే..
కొవిడ్ కేసులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని మంత్రి చెప్పారు. అందులో భాగంగానే ముందస్తుగా ఇంటింటా ఫీవర్ సర్వే చేస్తున్నామన్నారు. దీనిని శుక్రవారం నుంచి ప్రారంభించామని, వేగంగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో 479 బృందాలు లక్ష ఇండ్లకు తిరిగి సర్వే చేస్తాయన్నారు. ఈ సర్వేను రాబోయే ఐదు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. కరోనాపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఒకవేళ వైరస్ వచ్చినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వైద్య సిబ్బంది ఇంటికే వచ్చి మందులు అందిస్తారని, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని మెరుగైన చికిత్స అందేలా చూస్తారని భరోసా ఇచ్చారు.
జిల్లాలో 510 ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ
ప్రభుత్వ బడులను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ‘మన ఊరు -మనబడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మంత్రి పేర్కొన్నారు. రూ.7289 కోట్ల నిధులతో రాష్ట్రంలోని 26వేల పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగు పరుచడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు. ఇంగ్లిష్ మీడియంలో బోధించేందుకు వీలుగా ఉంటుందన్నారు. జిల్లాలోని 510 పాఠశాలలను ఆధునీకరిస్తామన్నారు. పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, డైనింగ్ హాల్స్, టాయిలెట్స్, పెయింటింగ్ వాల్స్ నీటి వసతి, తదితర కార్పొరేట్ స్థాయి మౌలిక వసతులు సమకూరుతాయన్నారు.
డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ వేగవంతం
డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో విచారణ చేసి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. తంగళ్లపల్లి బ్రిడ్జి నుంచి రగుడు జంక్షన్ వరకు ఉన్న రెండు వరుసల బైపాస్ రహదారిని నాలుగు వరుసలు మార్చాలని, అందుకు సంబంధించిన పనులను జూన్‌లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రాజీవ్‌నగర్‌లో రూ.3 కోట్లతో నాలుగెకరాల స్థలంలో నిర్మిస్తున్న మినీ స్టేడియం పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొత్త చెరువు పనుల సుందరీకరణ పనులతోపాటు ఆర్డీవో కార్యాలయం స్థలంలో ఇండోర్ స్పోర్ట్స్ స్టేడియం, జాతీయ స్థాయిలో స్టేడియం నిర్మిస్తామని తెలిపారు. 300 ఎకరాల్లో నిర్మించబోయే ఆక్వా హబ్‌కు సంబంధించిన భూసేకరణ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
కేంద్రం వివక్ష చూపుతోంది..
‘సబ్కా సాథ్. సబ్కా వికాస్’ అంటున్న మోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై మాత్రం వివక్ష చూపుతున్నదని కేటీఆర్ మండిపడ్డారు. సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా చేనేత జౌళిశాఖ మంత్రిగా, మెగా పవర్‌లూం క్లస్టర్ మంజూరు చేయాలని ఎనిమిదేళ్లుగా డిమాండ్ చేస్తున్నా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వినతులను పట్టించుకోకుండా పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని, నేతన్నల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని మండిపడ్డారు. వినతులను పట్టించుకోకుంటే నేతన్నల భాగస్వామ్యంతో ఉద్యమ రూపంలో హక్కులను సాధించుకునేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. ఎంపీ బండి సంజయ్ రాజకీయాలకతీతంగా వ్యవహరించాలని హితవు పలికారు. ఇకనైనా మొద్దు నిద్ర వీడి కేంద్రం నుంచి రాష్ర్టానికి నిధులు తీసుకురావడంలో తనవంతు పాత్ర పోషించాలని సూచించారు. మెగాపవర్‌లూం క్లస్టర్, చేనేత సమూహాలకు క్లస్టర్లు, ఇండియన్ టెక్స్టైల్స్ ఇనిస్టిట్యూట్ తెలంగాణకు తీసుకురావాలని డిమాండ్ చేశారు.