ఇప్పటికే రూ.15లక్షల ఖర్చు మరో రూ. 20లక్షలు ఉంటేనే ప్రాణాలు నిలిచే అవకాశం
ఆపన్న హస్తం కోసం తల్లిదండ్రుల ఎదురుచూపులు
పెద్దపల్లి, నవంబర్ 20(నమస్తే తెలంగాణ): పేద కుటుంబానికి పెద్ద కష్టమే వచ్చింది. ఎంతో హుషారుగా అందరితో కలివిడిగా ఆడుతూ పాడుతూ ఉండే కన్న కొడుకు క్యాన్సర్ బారిన పడడంతో ఆ తల్లిదండ్రుల ఆవేదనకు అంతులేకుండా పోయింది. వైద్యం చేయించి అతడిని కాపాడుకోవడం శక్తికి మించిన భారం కావడంతో ఆపన్నహస్తం కోసం ఆ కుటుంబం దీనంగా ఎదురు చూస్తున్నది.
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రాజాపూర్ గ్రామానికి చెందిన పుల్లెల స్వరూప-సదానందానిది వ్యవసాయ కుటుంబం. వీరికి ఇద్దరు సంతానం. కూతురు బీటెక్, కుమారుడు విష్ణు ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. ఈ క్రమంలో విష్ణు మూడు నెలలపాటు జ్వరంతో బాధపడ్డాడు. వైద్యులు డెంగ్యూగా నిర్ధారించగా, చికిత్స అనంతరం మరోసారి జ్వరం వచ్చింది. దీంతో కరీంనగర్‌కు తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకువెళ్లారు. పరీక్షల అనంతరం విష్ణుకు బ్లడ్ క్యాన్సర్‌గా తేలడంతో హైదరాబాద్‌లోని ఇండో అమెరికన్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో చేర్పించారు. అక్కడ కీమో థెరపీ చేయించారు. ఆ తర్వాత వారం బయట ఉండాలని చెప్పడంతో ఇంటికి వచ్చారు. తిరిగి వైద్యం కోసం హైదరాబాద్‌కు వెళ్లగా నెలపాటు కీమో థెరపీ చేయించాలనడంతో వైద్యం కోసం అప్పు సప్పు జేసి రూ.15 లక్షల వరకు ఖర్చు చేశారు. అయితే బోన్ న్యారో సర్జరీ చేస్తేనే విష్ణు ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉందని వైద్యులు స్పష్టం చేయడం, అందుకోసం 10-15 రోజుల్లో రూ.20 లక్షల వరకూ అవసరం కావడంతో స్వరూప-సదానందం కన్నీరు మున్నీరవుతున్నారు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సాయం అందించి తమ కన్న కొడుకును కాపాడాలని వేడుకుంటున్నారు. సాయం చేసే వారు ఫోన్‌పే/ గూగుల్ పే ద్వారా 93323 29480 నంబర్‌కు విరాళాలను అందజేయాలని అర్థిస్తున్నారు.