నెల క్రితమే కమర్షియల్ క్వారీకి అనుమతి
అప్పుడే దందాకు తెరలేపిన అక్రమార్కులు
మానేరు నుంచి జోరుగా అక్రమ రవాణా
వేబిల్లులు లేకుండానే తరలింపు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
తాజాగా పోలీస్ టాస్క్‌ఫోర్స్ బృందాల కొరడా
వేగురుపల్లి- ఊటూరు శివారులో 19 లారీలు పట్టివేత
ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం : సీపీ సత్యనారాయణ
కరీంనగర్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ)/రాంనగర్ : వేగురుపల్లి-ఊటూరు శివారు మానేరు వాగులో కమర్షియల్ ఇసుక క్వారీకి నెల క్రితమే అనుమతి వచ్చింది. కానీ, అంతలోనే అక్రమ దందాకు తెరలేచింది. ప్రతి రోజూ 40 లారీల వరకే సాండ్ తీయాల్సి ఉన్నా.. కొందరు అక్రమార్కులు నిబంధనలు తుంగలో తొక్కుతున్నట్లు తెలుస్తున్నది. ఎలాంటి అనుమతులు లేకుండా నిత్యం రెండు మూడు వందల లారీల్లో హైదరాబాద్‌కు తరలిస్తూ.. ప్రభుత్వాదాయానికి భారీగా గండికొడుతుండగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సీపీ సత్యనారాయణ ఆదేశాలతో పోలీస్ టాస్క్‌ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగాయి. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు మెరుపు దాడులు చేసి, 19 లారీలను పట్టుకున్నాయి. అయితే ఇసుక దందా చాలాచోట్ల జరుగుతున్నట్లు తెలుస్తుండగా, అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామన్న సీపీ హెచ్చరికలతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
మానేరు వాగులో అపారమైన ఇసుక నిల్వలున్నాయి. మానకొండూర్ మండల పరిధిలో విస్తరించి ఉన్న మానేరు శివారు గ్రామాలు కొన్నింటి నుంచి ఇప్పటికే స్థానిక అవసరాలకు గనులు, భూగర్భ శాఖ క్వారీలు నడిపిస్తోంది. కలెక్టర్ పర్యవేక్షణలో జిల్లా వ్యాప్తంగా ఇలాంటివి 13 క్వారీలు నడుస్తున్నాయి. గృహ నిర్మాణాల కోసం కమర్షియల్ క్వారీ నిర్వహించాలనే ఉద్దేశంతో నెల కింద మానకొండూర్ మండలం వేగురుపల్లిలో రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఐడీసీ) ఆధ్వర్యంలో ఒక క్వారీని ప్రారంభించారు. ఇక్కడి నుంచి ఇసుక తరలించాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ప్రతి క్యూబిక్ మీటర్‌కు 600 చొప్పున చెల్లించాలి. ఆన్లైన్లో పొందిన వేబిల్ ఆధారంగానే వేగురుపల్లి క్వారీ నుంచి ఇసుక తరలించుకోవాలి. ప్రతి రోజు గరిష్ఠంగా 500 క్యూబిక్ మీటర్ల ఇసుక తొలగించేందుకు మాత్రమే టీఆఎస్ఐడీసీ అనుమతి ఉంది. ఈ లెక్కన రోజుకు 40 లారీలకు మించి ఇక్కడి నుంచి ఇసుక తీసుకునే అవకాశం లేదు. కానీ, ఇక్కడి నుంచి ప్రతి రోజూ 200 నుంచి 300 లారీల ద్వారా ఇసుకను తరలిస్తున్నట్లు స్థానికుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి.
రంగంలోకి పోలీసు టాస్క్‌ఫోర్స్..
స్థానికుల నుంచి అందిన ఫిర్యాదులపై సీపీ సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు టాస్క్‌ఫోర్స్ బృందాలను రంగంలోకి దింపారు. సీఐలు, ఎస్‌ఐలతోపాటు పోలీసులు బృందాలుగా విడిపోయి ఏక కాలంలో పలు చోట్ల దాడులు చేపట్టారు. వేబిల్లుల కోసం లారీ డ్రైవర్లను స్థానిక నిర్వాహకులను ప్రశ్నించారు. వేబిల్లులు లేకుండానే ఇసుక రవాణా చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు 19 లారీలను పట్టుకున్నారు. కాగా, దాడుల విషయం తెలుసుకుని పదుల సంఖ్యలో లారీలను క్వారీల్లోకి రాకుండా డ్రైవర్లు నిలిపివేశారు. కొందరు లారీలను వదిలి పారిపోయారు. దీంతో దొరికిన 19 లారీలను టాస్క్‌ఫోర్స్ బృందాలు పోలీసు శిక్షణా కేంద్రానికి తరలించాయి. నెల రోజుల్లోనే వేగురుపల్లి క్వారీలో అక్రమ దందాకు తెరలేపినట్లు ఈ దాడుల ద్వారా స్పష్టంగా తెలుస్తున్నది..
అనుమతికి మించి తవ్వకాలు
ఇసుక తరలించేందుకు వేగురుపల్లి క్వారీ నుంచి రోజుకు 40 లారీలకు మాత్రమే ఆన్లైన్లో అనుమతులు వస్తాయి. ప్రతి క్యూబిక్ మీటర్‌కు 600 చొప్పున లెక్కేసినా రోజుకు 3 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఇది సరిపోదన్నట్లుగా అక్రమార్కులు దందాకు తెరలేపారు. క్వారీకి అనుమతి పొందిన నెల రోజుల్లోనే దందాకు తెగబడ్డారు. ఇక్కడికి వచ్చే లారీల సంఖ్యను బట్టి చూస్తే రోజుకు కనీసం 2,500 నుంచి 3 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను అక్రమంగా తవ్వుకుంటున్నట్లు తెలుస్తుననది. అంటే ప్రతి రోజు సుమారు 15 లక్షలకు మించి ఆదాయం వస్తే.. 3 లక్షలకు వేబిల్లులు చూపి.. మిగతా మొత్తానికి లెక్కా పత్రం లేకుండా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనికి తోడు ఓవర్ లోడ్ కూడా అక్రమార్కులకు కలిసివస్తున్నది. నిజానికి మనుషులతో ఇసుక తొలగించాలనే ఏ క్వారీలోనైనా అనుమతులు ఇస్తారు. కానీ, ఇక్కడ మాత్రం యంత్రాలతో లోడింగ్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి కొడుతున్న కారణంగానే పోలీసులు రంగంలోకి దిగినట్లు స్పష్టంగా తెలుస్తున్నది.