మంగళవారం 02 మార్చి 2021
Karimnagar - Jan 20, 2021 , 00:48:11

రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం

రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం

కలెక్టర్‌ కె.శశాంక    

జిల్లా స్థాయి ఉద్యోగుల క్రీడా పోటీలు ప్రారంభం

కొత్తపల్లి, జనవరి 19: ప్రజాస్వామ్య పరిరక్షణ, రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని కలెక్టర్‌ కె.శశాంక పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ స్టేడియంలో ఉద్యోగ క్రీ డాకారుల జిల్లాస్థాయి క్రీడాపోటీలను ఆయన సీపీ కమలాసన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, సుమారు 1200 మంది ఉద్యోగ క్రీడాకారులు 23 క్రీడాంశాల్లో పోటీపడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం రూపొందించే చట్టాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం కంటే ముందు ఉద్యోగులకు క్రీడాపోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఐదురోజులపాటు నిర్వహించే పోటీల్లో ఉద్యోగులు చురుకుగా పాల్గొనాలని సూచించారు. రాబోయే రో జుల్లో పోలీస్‌శాఖ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో క్రీడలు నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపా రు. విశిష్ట అతిథిగా హాజరైన సీపీ కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులకు క్రీడాపోటీల నిర్వహణలో కలెక్టర్‌ కృషి ప్రశంసనీయమని కొనియాడారు. నిరంతరం పనిఒత్తిడితో సతమతమయ్యే ఉద్యోగులకు ఇలాంటి పోటీలు ఉపశమనాన్ని కలిగిస్తాయని చెప్పారు. కలెక్టర్‌ స్ఫూర్తితో పోలీస్‌శాఖ ఉద్యోగులకు ఫిబ్రవరిలో క్రీడాపోటీలను నిర్వహిస్తామని తెలిపారు. అంబేద్కర్‌ స్టేడియంతో పాటు ఎస్సారార్‌ కళాశాల మైదానం, రెవెన్యూ, కరీంనగర్‌ క్లబ్‌లలో పోటీలు నిర్వహిస్తుండగా, ప్రారంభానికి ముందు క్రీడా ఉద్యోగులు మార్చ్‌ఫాస్ట్‌ చేయగా అతిథులు గౌరవవందనం స్వీకరించారు. సీపీ కమలాసన్‌రెడ్డితో కలిసి ఒలింపిక్‌ జ్యోతి వెలిగించి, క్రీడాపతాకాలను ఆవిష్కరించి పోటీలను  ప్రారంభించారు. కలెక్టర్‌, సీపీ ఉద్యోగులతో కలిసి క్రికెట్‌, వాలీబాల్‌, కబడ్డీ ఆడి ఉత్సాహపరిచారు. అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, నరసింహారెడ్డి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ అంకిత్‌, ఆర్డీవో మాధవరావు, జిల్లా యువజన క్రీడాశాఖాధికారి కీర్తి రాజవీరు, టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మారం జగదీశ్వర్‌, దారం శ్రీనివాస్‌రెడ్డి, పలు విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

 మొదటి రోజు ఫలితాలు..

మొదటి రోజు కబడ్డీ, క్రికెట్‌, వాలీబాల్‌ పోటీలను నిర్వహించారు. మెడికల్‌, హెల్త్‌-ఇంజినీరింగ్‌ డిపార్ట్‌మెంట్ల మహిళలకు నిర్వహించిన క్రికెట్‌ పోటీలో మెడికల్‌, హెల్త్‌ డిపార్ట్‌మెంటు జట్టు విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో రెవెన్యూశాఖపై పంచాయతీరాజ్‌శాఖ గెలిచింది. మూడో మ్యాచ్‌లో విద్యాశాఖ వెల్ఫేర్‌ జట్టుపై విజయం సాధించింది. నాలుగో మ్యాచ్‌ ఎక్సైజ్‌శాఖ కమర్షియల్‌ జట్టుపై గెలిచింది. పురుషుల క్రికెట్‌ పోటీల్లో ఎక్సైజ్‌శాఖపై వ్యవసాయశాఖ విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో వెల్ఫేర్‌ జట్టుపై ఎంసీకే జట్టు గెలిచింది. మూడో మ్యాచ్‌లో మెడికల్‌, హెల్త్‌ జట్టుపై పంచాయతీరాజ్‌ జట్టు విజయం సాధించింది. మహిళలకు నిర్వహించిన వాలీబాల్‌ పోటీల్లో పంచాయతీరాజ్‌ జట్టుపై హెల్త్‌ జట్టు గెలిచింది. రెండో మ్యాచ్‌లో ఎంసీకే జట్టుపై ఎక్సైజ్‌ జట్టు గెలుపొందింది. మూడో మ్యాచ్‌లో వ్యవసాయశాఖపై ఎక్సైజ్‌ జట్టు విజయం సాధించింది. పురుషుల వాలీబాల్‌ పోటీల్లో కమర్షియల్‌ డిపార్ట్‌మెంట్‌ జట్టుపై రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ జట్టు గెలిచింది.

VIDEOS

logo