శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 18, 2020 , 02:56:11

పల్లెల అభివృద్ధే ధ్యేయం

పల్లెల అభివృద్ధే ధ్యేయం

  •  రైతుల పాలిట దేవాలయాలు.. రైతు వేదికలు.. n  మంత్రి కొప్పుల ఈశ్వర్‌
  • రూ.2కోట్ల నిధులతో పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు

వెల్గటూర్‌: పల్లెల అభివృద్ధే ధ్యేయంగా అహర్నిశలు కృషి చేస్తున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్‌ మండలం చెగ్యాం, కొత్తపేట, జగదేవ్‌పే ట, తాళ్లకొత్తపేటల్లో రూ.2కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శుక్రవారం ప్రారంభోత్స వం, శంకుస్థాపనలు చేశారు. చెగ్యాం, కొత్తపేట గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి చెగ్యాంలో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రైతు వేదికలు రైతుల పాలిట దేవాలయాలన్నారు. ఈ వేదికల ద్వారా రైతు సమస్యలు పరిష్కారమవుతాయని వివరించారు. రాష్ట్రంలో రూ. 572కోట్లు వెచ్చించి 2,600 రైతు వేదికలను సర్కారు నిర్మిస్తున్నదని తెలిపారు. ఒక్కో వేదికకు రూ.22 లక్షలు ఖర్చు చేస్తున్నదని వెల్లడించారు. అలాగే కరోనా కష్టకాలంలో కూడా రూ.30వేల కోట్లు కేటాయించి రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. అలాగే హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటి బాధ్యతగా సంరక్షించాలన్నారు. 

నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి 

ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు త్వరలో పరిష్కరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వెల్గటూర్‌ ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీ వాసులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన స్పందించి మాట్లాడారు. పూర్తిస్థాయిలో లబ్ధిపొందని నిర్వాసితులను గుర్తించి సాయం అందించాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం 18 ఏళ్ల వయసు నిండిన యువతీ యువకులకు కూడా ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ వర్తింపజేయాలని సూచించారు. కార్యక్రమాల్లో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, జగిత్యాల అదనపు కలెక్టర్‌ రాజేశం, ఎంపీపీ కూనమల్ల లక్ష్మి, జడ్పీటీసీ సుధారాణి, వైస్‌ ఎంపీపీ కవిత, ఏఎంసీ చైర్మన్‌ కృష్ణారెడ్డి తదితరులున్నారు..


logo