సోమవారం 21 సెప్టెంబర్ 2020
Karimnagar - Jun 27, 2020 , 02:23:47

పర్యాటక కేంద్రంగా నంది రిజర్వాయర్‌

పర్యాటక కేంద్రంగా నంది రిజర్వాయర్‌

  • l అభివృద్ధి కోసం పక్కా ప్రణాళిక
  • l త్వరలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటుతాం
  • l రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌
  • l పార్క్‌ కోసం చదును పనుల పరిశీలన 
  • l త్వరగా పూర్తి చేయాలని  అధికారులకు ఆదేశం
  • l అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష

ధర్మారం: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కీలమైన ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని నంది రిజర్వాయర్‌ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా, ఉద్యాన వనంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం నంది రిజర్వాయర్‌ కట్ట కింద పార్క్‌ అభివృద్ధి కోసం చేపట్టిన మట్టి చదును పనులు, నంది రిజర్వాయర్‌ను పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రఘువీర్‌ సింగ్‌, ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జడ్పీ సభ్యురాలు పూస్కూరు పద్మ, స్థానిక సర్పంచ్‌ సామంతుల జానకితో కలిసి పరిశీలించారు. పార్క్‌ అభివృద్ధి పనులపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన 30 శాతం పనులను వేగంగా పూర్తి చేయించాలని కాళేశ్వరం ప్రాజెక్ట్‌ 7వ ప్యాకేజీ ఏఈ పరశురాం గౌడ్‌ను మంత్రి ఆదేశించారు. అనంతరం అక్కడ నుంచి కాలి నడకన నంది రిజర్వాయర్‌ను పరిశీలించారు. ఇక్కడ చేపట్టాల్సిన పనులపై ఎంపీడీవో జయశీలకు  ఆదేశాలు, సూచనలు ఇచ్చారు. అనంతరం మంత్రి ఈశ్వర్‌ మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రం గా, ఉద్యాన వనంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. మొదట రిజర్వాయర్‌ కింద ఉన్న పాత చెరువు స్థలంలో పార్క్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. చదును పనులు పూర్తి కాగానే ఆకర్షణీయమైన, పూల మొక్కలు నాటి సుందరీకరణకు శ్రీకారం చుడతామని వెల్లడించారు. పార్క్‌ పూర్తయిన తర్వాత కాకతీయుల కాలం నాటి చరిత్ర కలిగిన ఈ గ్రామాన్ని పక్కా ప్రణాళిక ప్రకారం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. అనంతరం మంత్రి ఈశ్వర్‌ మండల పరిషత్‌ కార్యాలయానికి చేరుకుని, అధికారులు, ప్రజాప్రతినిధులతో ఉద్యాన వనంలో చేపట్టాల్సిన పనులపై సమీక్షించారు. వారికి దిశా నిర్దేశం చేశారు. మండలంలో అసంపూర్తిగా ఉన్న వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన 48 గంటల్లో పూర్తి చేయడానికి త్వరలో తాను రెండు రోజులు ఇక్కడే మకాం వేస్తానని తెలిపారు. వాటిని పూర్తి చేసి ప్రారంభించి వెళ్తానని, అందుకు అందరూ సిద్ధంగా ఉండాలని మంత్రి ఈశ్వర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ పీ సంపత్‌, ఎంపీటీసీ సభ్యులు మిట్ట తిరుపతి, కట్ట సరోజ, ఉప సర్పంచ్‌ కట్ట రమేశ్‌, వార్డు సభ్యులు, ఏఎంసీ చైర్మన్‌ గుర్రం మోహన్‌రెడ్డి, ప్యాక్స్‌ చైర్మన్లు ముత్యాల బలరాంరెడ్డి, నోముల వెంకట రెడ్డి, వైస్‌ చైర్మన్‌ సామంతుల రాజమల్లు, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పూస్కూరు రామారావు, ఆర్‌బీఎస్‌ మండల కోఆర్డినేటర్‌ పాకాల రాజయ్య, జిల్లా సభ్యులు పూస్కూరు రామారావు, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పెంచాల రాజేశం, మండల కో ఆప్షన్‌ సభ్యుడు ఎండీ రఫీ, ఏఎంసీ డైరెక్టర్‌ ఎండీ హఫీజ్‌, నంది మేడారం టీఆర్‌ఎస్‌ గ్రామాధ్యక్షుడు సామంతుల శంకర్‌, నాయకులు కట్ట స్వామి, సాన రాజేందర్‌, నేరెళ్ల చిన్న లచ్చయ్య, ధర్మారం ఎంపీటీసీ తుమ్మల రాంబాబు పాల్గొన్నారు. 


logo