శుక్రవారం 05 జూన్ 2020
Karimnagar - Mar 02, 2020 , 02:07:18

సుందర నగరంగా తీర్చిదిద్దుతాం

సుందర నగరంగా తీర్చిదిద్దుతాం

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: కరీంనగర్‌ను సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలూ చేపడుతున్నామని నగర మేయర్‌ వై.సునీల్‌రావు పేర్కొన్నారు. ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం నగరంలోని 59, 60వ డివిజన్లల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు వీధుల్లో చిన్న వర్షం కురిసినా ఇబ్బందులు వస్తున్నాయని ప్రజలు మేయర్‌కు విన్నవించారు. వీటితోపాటు మురుగుకాలువ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  గుర్తించిన సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మేయర్‌ మాట్లాడుతూ ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమంలో సమస్యలను గుర్తించడంతోపాటు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ముఖ్యంగా తక్షణమే పరిష్కరించే వాటికి ప్రాధాన్యత ఇచ్చి, పనులు చేపడుతున్నామని తెలిపారు. దీర్ఘకాలిక సమస్యలకు సంబంధించి పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు తీసుకొని, ముందుకు సాగుతున్నామని తెలిపారు. అన్ని డివిజన్లలోనూ ఇప్పటికే ఖాళీ స్థలాలను గుర్తించి వాటిలో పేరుకపోయిన చెత్తా, చెదారాన్ని తొలిగించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. వీటిని పరిశుభ్రంగా మార్చిన అనంతరం మరోసారి చెత్త వేస్తే ఖాళీ స్థలాల యజమానులతోపాటు చుట్టూ ఉన్న ప్రజలపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని డివిజన్లలోనూ శిథిలావస్థకు చేరిన సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీనికి సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. వీటితోపాటు అన్ని డివిజన్లలోనూ ఏళ్ల తరబడిగా పరిష్కారానికి నోచుకోని సమస్యలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. అలాగే, మంచినీటి ఇబ్బందులున్న ప్రాంతంలో తక్షణమే స్పందించి చర్యలు చేపడుతామన్నారు. వీటితోపాటు  ప్రజలందరూ కూడా  నగరంలో పచ్చదనాన్ని పెంచేందుకు సహకరించాలన్నారు. ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటే విషయంలో ప్రతి ఒక్కరూ దృష్టిపెట్టాలని కోరారు. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించేందుకు అధికారులు, ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. మేయర్‌ వెంట కార్పొరేటర్లు గందె మాధవి, వాల రమణారావు, తదితరులున్నారు.logo