వేములవాడ రూరల్, ఫిబ్రవరి 20 : కరీంనగర్ డెయిరీ పాల శీతలీకరణ కేంద్రాన్ని సీజ్ చేయడంపై దాదాపు 200 మంది రైతులు భగ్గుమన్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అగ్రహారానికి చేరుకొని, పాల కేంద్రం ఎదుట సిరిసిల్ల-కరీంనగర్ రహదారిపై ఆందోళన చేశారు. అధికారుల తీరుకు వ్యతిరేకంగా నినదించారు. దాదాపు మూడు గంటలపాటు ధర్నా చేశారు. వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్, డీఆర్డీఏ శేషాద్రి అక్కడి చేరుకోగా, సముదాయించే ప్రయత్నం చేశారు. దీంతో రైతులు మరింత కోపోద్రిక్తులయ్యారు. ఎటువంటి నోటీస్ ఇవ్వకుండానే ఎలా సీజ్ చేస్తారని, తాము ఎక్కడ పాలు పోయాలంటూ మహిళా రైతులు ప్రశ్నించారు. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని, విజయ డెయిరీకి పోయాలని ఆర్డీవో రాజేశ్వర్ సూచించగా, రైతులు మండిపడ్డారు. తామెందుకు విజయడెయిరీకి పోయాలని నిలదీశారు.
బయట పారబోయనైనా పోస్తాం గానీ, విజయ డెయిరీకి పోసేది లేదని తేల్చిచెప్పారు. కావాలనే రాజకీయ కక్షతో అధికారులు తమ పాలకేంద్రాన్ని సీజ్ చేశారని, నోటీసులు ఇవ్వకుండా ఎలా మూసివేస్తారని ప్రశ్నించగా, ఏం సమాధానం చెప్పలేక అధికారులు నీళ్లు నమిలారు. రైతులు అడిగిన ఏ ఒక్క ప్రశ్నకూ సమాధానం చెప్పలేకపోయారు. అయితే మూడు గంటలపాటు ధర్నా చేసినా ఎలాంటి స్పందన లేకపోవడంతో కలెక్టర్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. అయితే అరకిలోమీటర్ మేర వాహనాలు నిలిచి ట్రాఫిక్‌కు అంతరాయం కలుగడంతో పోలీసులు బలవంతంగా రైతులను పక్కకు ఈడ్చుకెళ్లారు. రోడ్డుపక్కకు తోసివేశారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ధర్నా అనంతరం ఆర్డీవో పాటు సీఐలు, ఎస్ఐలు అక్కడి నుంచి వెళ్లిపోగా, పోలీసులు కొంత మంది అక్కడే ఉన్నారు. పాలకేంద్రం వద్దకు ఎవరూ రాకుండా బందోబస్తు నిర్వహించారు.